సీజన్ ఆరంభమైన ఆకాశంలోనే.. కూరగాయల ధరలు
సాక్షి, హైదరాబాద్: సీజన్ ప్రారంభమైనా కొన్ని కూరగాయల ధరలు ఆకాశంలోనే ఉన్నాయి. దిగుబడి పెరిగితే ధరలు దిగివస్తాయనుకున్న పేదవర్గాలకు నిరాశే మిగిలింది. ఉల్లి, బెండ, బీర, చిక్కుడు, గోరుచిక్కుడు, వంకాయల ధర లు సామాన్యుడికి అందనంత ఎత్తులోనే ఉన్నాయి. ఇవి బహిరంగ మార్కెట్లో కేజీ రూ.25 -60 దాకా పలుకుతుండటంతో సామాన్యులు అల్లాడుతున్నా రు. నిజానికి టమాటా, పచ్చి మిర్చి, కాకర, క్యాబేజీ, క్యారెట్, దొండ వంటి ధరలు హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ. 12-20 మధ్యలోనే ఉన్నాయి. అయితే.. అవి వ్యాపారుల చేతి లోకి వచ్చేసరికి హమాలీ, రవాణా, డ్యామేజీ, లాభం కలుపుకొని అధిక ధర నిర్ణయిస్తూ వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. గుడిమల్కాపూర్ హోల్‌సేల్ మార్కెట్‌లో ఆదివారం కేజీ టమాటా ధర రూ.12 పలకగా.. రిటైల్ మార్కెట్లో రూ.20కు విక్రయించారు.
పచ్చి మిర్చి, బెండ, బీర, చిక్కుడు, గోరుచిక్కుడు వంటివి హోల్‌సేల్‌గా రూ.16, రూ.22, రూ.15, రూ.38, 28గా ధర నిర్ణయించగా, రిటైల్‌లో 20 నుంచి రూ.50 దాకా అమ్ముతున్నారు. ఆలుగడ్డ హోల్‌సేల్‌గా రూ.13 ధర పలకగా.. బహిరంగ మార్కెట్లో రూ.18-20కు విక్రయిస్తున్నారు.
మొన్నటివరకు డిమాండ్, సరఫరాల మధ్య అంతరం ఉండటంతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు సీమాంధ్ర నుంచి నగరానికి కూరగాయల సరఫరా యథావిధిగా సాగుతోంది. అలాగే కూరగాయల దిగుబడీ పెరిగింది. అయినా ధరలు తగ్గట్లేదు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నగరానికి కూరగాయల సరఫరా తగ్గిందని, ఫలితంగా ధరలు దిగిరావట్లేదని వ్యాపారులు చెబుతుండడం గమనార్హం.