తాడేపల్లిగూడెం : ఉల్లి ధర మళ్లీ పెరిగింది. గత వారం కాస్త తగ్గినట్టు కనిపించినా ఆదివారం అనూహ్యంగా మార్కెట్‌లో వాటి ధర మళ్లీ యథాస్థితికి చేరింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇబ్బడిముబ్బడిగా కొత్త ఉల్లిపాయలు ముంచెత్తగా గత వారం ధర దిగివచ్చింది. రెండు వారాల క్రితం రూ.1,700 ఉండగా, గత వారం ధర రూ.1,100కి తగ్గింది. ఇటీవల ఇంతగా ధర పతనం కావడం ఇదే ప్రథమం. మహారాష్ట్ర నుంచి పాత ఉల్లిపాయల రాక ఆగిపోవడం, మరో పక్క కర్నూలు ఉల్లిపాయలు మాత్రమే మార్కెట్ అవసరాలను తీర్చడం, అస్సోం, బంగ్లాదేశ్ , సిలిగుడి ప్రాంతాల నుంచి ఎగుమతిదారులు మార్కెట్‌కు రావడం తదితర కారణాల వల్ల రెండు వారాల క్రితం ధర పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తారు.
ఈ పరిస్థితి వారం తరువాత రివర్స్ అయ్యింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇండోర్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కొత్త సరుకు మార్కెట్‌కు రావడంతో ధర పతనమైంది. అయితే తాజాగా ఆదివారం కర్నూలు నుంచి ఇక్కడి గుత్త మార్కెట్‌కు కేవలం 40 లారీల సరుకులు మాత్రమే వచ్చాయి. దీంతో క్వింటాలు ధర రూ.1,600కు ఎగబాకింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, రాజస్థాన్‌లోని అల్వార్, మహారాష్ట్రలోని సోలాపూర్, అహ్మద్ నగర్, నాసిక్ వంటి ప్రాంతాలలో బుధ, గురువారాలలో భారీగా వర్షాలు కురవడంతో మార్కెట్‌లకు సరుకు ఎగుమతి నిలిచిపోయింది. దీంతో ఉన్న సరుకులకు డిమాండ్ పెరిగింది. మరో పది రోజుల వరకు ఉల్లి ధర లు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
దిగివచ్చిన కూరగాయలు
కార్తీక మాసంలో ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు కాస్త దిగివచ్చాయి. గురువారం నుంచి మార్కెట్‌కు సరుకు రాక పెరగడంతో ధరలు పతనమై ఆది వారం నాటికి మరింత తగ్గాయి. గడచిన మూడు నెలల కాలంగా ఎన్నడూ లేని విధంగా ఎగబాకిన వంకాయల ధర ఆదివారం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. గుత్త మార్కెట్‌లో గతవారం పది కిలోలు రూ.450 పలుకగా, ఈ వారం సగానికి తగ్గాయి. నలుపు రకం వంకాయలు పది కిలోలు రూ.100కు విక్రయించారు. కాగా బీన్స్ పదికిలోలు రూ.60 నుంచి రూ.40, క్యారట్ రూ.350 నుంచి రూ.300 , దొండ రూ.250 నుంచి 120, బీరకాయలు రూ.150కి, దోసకాయలు రూ.100కు తగ్గాయి. చిక్కుళ్ల ధర గత వారం రూ.600 పలకగా, ప్రస్తుతం రూ.230కు పడిపోయింది. అలాగే బెండకాయలు రూ.250 నుంచి రూ.100కి, ఆకాకర రూ.400 నుంచి రూ.350, కాకరకాయలు రూ.200 నుంచి రూ.100కు తగ్గాయి. బీట్‌రూట్ పది కిలోల ధర రూ.200, కంద రూ.120 వద్ద స్థిరంగా ఉంది. టమాటా ధర స్వల్పంగా పెరిగింది.
మళ్లీ ఘాటెక్కిన ఉల్లి
Published Mon, Nov 17 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement
Advertisement