న్యూఢిల్లీ: ప్రస్తుతానికి తగినన్ని ఉల్లిపాయల నిల్వలు ఉన్నందున వచ్చే నెల వరకు ఢోకా లేదని అధికారులు చెబుతున్నారు. అయితే వచ్చే నెలలో కిలో ఉల్లిధర రూ.40 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఉల్లి టోకు, చిల్లర ధరల మధ్య పెద్దగా తేడా కనిపించడం లేదు. ధరలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే నగరంలోని ఒక్కో ప్రాంతంలో ఉల్లిధర ఒక్కోరీతిలో ఉంటోంది. దక్షిణ ఢిల్లీ గౌతమ్‌నగర్‌లో కిలోకు రూ.20 చొప్పున అమ్ముతుండగా, తూర్పు, మధ్యఢిల్లీలో రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్లో అత్యున్నత నాణ్యత గల రకం ఉల్లిపాయలు రూ.25 చొప్పున, తక్కువ నాణ్యత గలవాటిని రూ.13.75 చొప్పున అమ్ముతున్నారని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ సంఘం (ఏపీఎంసీ) వర్గాలు బుధవారం తెలిపాయి.
ఉల్లితోపాటు టమాటాలు, ఆలుగడ్డల ధరల పట్టికను ఏపీఎంసీ ఎప్పటికప్పుడు మదర్ డెయిరీల్లో ప్రదర్శిస్తోంది. ‘ఢిల్లీ మార్కెట్లలో అవసరం కంటే ఎక్కువగానే ఉల్లి నిల్వలు వస్తున్నాయి. మంగళవారం ఒక్క రోజే మార్కెట్లోకి 1,200 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు వచ్చాయి. ఒక రోజు వినియోగానికి ఇవి చాలా ఎక్కువ. ఆలుగడ్డలు కూడా 1,299 టన్నులు వచ్చాయి’ అని అభివృద్ధిశాఖ కమిషనర్ పునీత్ గోయల్ తెలిపారు. నగరవ్యాప్తంగా 40 స్టాళ్లు ఏర్పాటు చేసి టోకు ధరలకే ఉల్లి, ఆలును విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆయన మంగళవారం ఏపీఎంసీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇది వరకే ఉల్లి, ఆలుగడ్డల నిల్వలు పేరుకుపోయి ఉండడంతో కొన్ని ట్రక్కుల్లో సరుకును పూర్తిగా దింపకుండా, సగం వెనక్కి పంపిస్తున్నారని ఏపీఎంసీ సభ్యుడు అనిల్ మల్హోత్రా అన్నారు.
స్వదేశీ మార్కెట్లలో ఉల్లి ధరలు, ఎగుమతులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉల్లి కనిష్ట ఎగుమతి ధరను టన్నుకు 500 డాలర్లుగా నిర్ధారించింది. అందుకే ధరలు పెరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. నిజానికి మే 30న ఉల్లి కిలో టోకు కేవలం రూ.9.75 మాత్రమేనని ఎన్‌హెచ్‌ఆర్డీఎఫ్ వర్గాలు తెలిపాయి. ఉల్లి సరఫరాలో మార్పులేవీలేవని, కరువు సంభవించే అవకాశాలు ఉన్నందునే ధరలు పెరుగుతున్నాయని జాతీయ ఉద్యానవన పరిశోధన, అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఆర్డీఎఫ్) ఉన్నతాధికారి గుప్తా విశ్లేషించారు. రబీలో పండించిన 39 లక్షల టన్నుల ఉల్లిపాయలు దేశవ్యాప్తంగా గోదాముల్లో ప్రస్తుతం నిల్వ ఉన్నాయన్నారు. అయితే ఖరీఫ్ పంటలకు వర్షాలు లేకుంటే ఈ నిల్వలు సరిపోకపోవచ్చని చెప్పారు.
ఈసారి సాధారణం కంటే తక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల సహజమేనని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఉల్లిని పండించే భూముల్లో 40 శాతం వర్షాలపైనే ఆధారపడుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. మనదేశంలో మహారాష్ట్ర, కర్ణాటక,గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లిసాగు అధికంగా ఉంటుంది.
ఉల్లి ధరలు ప్రస్తుతానికి యథాతథం
Published Thu, Jul 3 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement
Advertisement