న్యూఢిల్లీ : పాలనా పరమైన విధానం వల్లే ఉల్లి ధరలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి మంత్రి తారిఖ్ అన్వర్ వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో ఉల్లిధరల్లో పెరుగుదలకు పాలన పరమైన విధానాలే కారణమన్నారు. కిలో ఉల్లికి రైతుకు రూ.10 దక్కుతుంటే.. అది మార్కెట్‌లో వినియోగదారుడు కొనుగోలుచేసే సమయానికి రూ.80-100 వరకు ఎందుకు పెరిగిపోతోందో అర్థం కావడంలేదన్నారు. ఉల్లి మార్కెట్ నిర్వహణలో ఏదో గూడుపుఠాణీ జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సాధారణంగా వంటల్లో ఉల్లి, టమాట తప్పనిసరిగా వినియోగిస్తారని, అటువంటి నిత్యావసరాల రేట్లు మాత్రమే అనూహ్యంగా పెరిగిపోతుండటం గమనార్హమన్నారు.
ఉల్లి రేటు మార్కెట్‌లో కిలోకు రూ.60-70 మధ్య ఉండగా, టమాట ధర కిలోకు రూ.70-80 మధ్య పలుకుతోందని ఆయన వివరించారు. పంట దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలు ధర పెరుగుదలలో ప్రభావం చూపుతున్నాయని అన్వర్ చెప్పారు. సాధారణంగా ఈ సీజన్‌లో పండ్ల ధరలు పెరుగుతాయి. అయితే దీనికి వ్యతిరేకంగా కూరగాయల ధరలు పెరగడంలో దళారుల పాత్రపై తాము దృష్టిపెట్టినట్లు మంత్రి తెలిపారు.