ఇంకా చుక్కల్లోనే ఉల్లిపాయల ధర!
Published Tue, Aug 27 2013 2:12 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: ఉల్లిపాయల ధరలు సామాన్యుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆశించిన రీతిలో సరఫరా లేనికారణంగా కిలో ఉల్లిపాయలు సోమవారం అత్యధికంగా రూ. 70 పలికాయి. గత కొద్దిరోజులు పంట పండించే ఆయా ప్రాంతాలనుంచి టోకు మార్కెట్‌కు ఉల్లిపాయలు రావడం బాగా తగ్గిపోయిందని ఆనియన్ మర్చంట్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్ర బుధిరాజ్ తెలి యజేశారు.
గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మరికొన్నాళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందన్నారు. గతంలో ప్రతి రోజూ 60 నుంచి 70 ఉల్లి లారీలు వచ్చేవని, ప్రస్తుతం 40 నుంచి 50 మాత్రమే వస్తున్నాయన్నారు. సరఫరా తగ్గిపోవడంతో నాణ్యతనుబట్టి చిల్లర వర్తకులు కిలో ఉల్లిపాయలను రూ.55 నుంచి రూ. 70 మధ్య విక్రయిస్తున్నారన్నారు. కాగా ధరలను నియంత్రించేందుకుగాను ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలంటూ నాఫెడ్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది.
కాగా ఉల్లిపాయలు నగర మార్కెట్‌లో ఇటీవల అత్యధికంగా రూ. 80 కూడా పలికిన సంగతి విదితమే. ఇక జాతీయ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో కిలో ఉల్లిపాయలు రూ. 50 పలుకుతున్నాయి. మరోవైపు నాఫెడ్ సంస్థ తన ఔట్‌లెట్లలో కిలో ఉల్లిపాయలను రూ. 40కి విక్రయిస్తోంది.
Advertisement