రూ.20కే కిలో ఉల్లి
- రైతుబజార్లలో రాయితీపై విక్రయం
- 5 నుంచి అధికారికంగా ప్రారంభం
సాక్షి, సిటీబ్యూరో : ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు ఎట్టకేలకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది. నగరంలోని అన్ని రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కేజీ రూ.20ల ప్రకారం రాయితీ ధరపై ఉల్లిని అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 5 నుంచి కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఫలక్‌నుమా, మీర్‌పేట్, రామకృష్ణాపురం, అల్వాల్, మేడిపల్లి రైతుబజార్లతో పాటు వివిధ ప్రాంతాల్లోని 36 ఔట్‌లెట్స్ ద్వారా సబ్సిడీ ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధానంగా ఉల్లి, టమోటా ధరలకు కళ్లెం వేస్తే మిగతా కూరగాయల ధరలు పెరగకుండా నియంత్రించవచ్చేనే ఉద్దేశంతో గత జూన్ 24న అన్ని రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి హోల్‌సేల్ ధరకే (నో లాస్... నో ప్రాఫిట్ ప్రాతిపదికన) విక్రయాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటిని తప్పించి అదే కౌంటర్లలో సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభించేందుకు రైతుబ జార్ సిబ్బంది సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఉల్లి కేజీ రూ.40-45లు పలుకుతోంది. వినియోగదారుల రద్దీ అధికంగా ఉండే ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లకు రోజుకు 2 నుంచి 3 టన్నులు, అలాగే చిన్న రైతుబజార్లకు 1-2 టన్నుల ఉల్లి సరఫరా చేయాలని నిర్ణయించారు.
ఉదయం 9గం.ల నుంచి రాత్రి 7గంటల వరకు సబ్సిడీ ఉల్లి కౌంటర్లు తె రచి ఉంచి, ఒక్కో వినియోగదారుడికి 2 కేజీల చొప్పున విక్రయించాలని ప్లాన్ చేశారు. కర్నూలు, మహారాష్ట్ర, కర్ణాటకలకు ప్రత్యేక అధికారుల బృందాలను పంపి పెద్దమొత్తంలో ఉల్లిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
కొరత రానివ్వం : ఉల్లి ధర లు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో సబ్సిడీ ధరలపై ఉల్లిని అందుబాటులో ఉంచుతామని మార్కెటింగ్ శాఖ అడిషనల్ డెరైక్టర్ లక్ష్మీబాయి తెలిపారు. రైతుబజార్లు లేని ప్రాంతాలకు మొబైల్ వ్యాన్లు, మన కూరగాయల వాహనాల ద్వారా సబ్సిడీ ఉల్లి సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. హోల్‌సేల్ ట్రేడర్స్‌తో సమావేశం నిర్వహించి పెద్దమొత్తంలో సరుకు సేకరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కొరత రాకుండా చూస్తే ధరలు వాటంతటవే దిగివస్తాయని, వ్యాపారులు కూడా ధరలు పెంచేందుకు సాహసించరని తెలిపారు.