ఉల్లి @ 80
రైతు బజార్లలో విక్రయాలు బంద్
దిగిరాని ఉల్లి ధరలు
మూడు రోజుల్లో రూ. 30 పెరుగుదల
విజయవాడ : విజయవాడలో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఉల్లి ధరలను రోజురోజుకు పెంచేస్తున్నారు. సోమవారం నగరంలో ప్రైవేటు మార్కెట్లలో ఉల్లిపాయలు కేజీ రూ. 80 ధర పలికింది. వ్యాపారులు మూడు రోజులుగా రోజుకు రూ. 10 చొప్పున సోమవారం నాటికి రూ.30 పెంచేశారు. మూడు రోజుల నుంచి నగరంలో రైతుబజార్లలో ఉల్లి విక్రయాలు బంద్ అయ్యాయి. జిల్లాలోని 17 రైతు బజార్లలో సోమవారం ఉల్లిపాయల విక్రయాలు జరుగలేదు. కర్నూల్ నుంచి ఉత్పత్తి తగ్గిపోవటంతో మార్కెటింగ్ అధికారులు రైతు బజార్లకు మూడు రోజుల నుంచి ఉల్లి సరఫరా చేయలేకపోతున్నారు. దాంతో ప్రైవేటు మార్కెట్‌లో వ్యాపారులు కేజీ రూ.50 నుంచి రూ. 80కి పెంచేశారు. ఉల్లిపాయలు దొరక్క ప్రజలు షాపులు, మార్కెట్లకు పరుగులు తీశారు.
రెండు రకాల గ్రేడులు
వ్యాపారులు ఉల్లిపాయలను రెండు రకాలుగా గ్రేడ్ చేసి అధిక రేటు వసూలు చేస్తున్నారు. ఎందుకూ పనికిరాని నాసిరకం ఉల్లిని కేజీ రూ. 50కి విక్రయిస్తున్నారు. మంచి రకం ఉల్లి కేజీ రూ. 80 వసూలు చేస్తున్నారు. రైతు బజార్లలో కేజీ రూ. 20కి సరఫరా చేసిన ఉల్లిని బయటి మార్కెట్‌లో రూ. 50కి విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉల్లిధరలు మరింతగా పెరగవచ్చని వ్యాపారులు చెపుతున్నారు. వచ్చే నెలాఖరు వరకు ఉల్లిపాయల కొరత ఇలానే ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. వచ్చే నెలాఖరునాటికి సోలాపూర్‌లో ఉల్లి పంట వస్తుందని, అప్పటికి గాని ఉల్లిపాయల ఉత్పత్తులు పెరిగి ధర తగ్గే అవకాశం ఉంటుందని చెపుతున్నారు.
రైతు బజార్ల చుట్టూ తిరుగుతున్న ప్రజలు
బయటి మార్కెట్‌లో ఉల్లి కొనుగోలు చేయలేక సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు రైతు బజార్ల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ అధికారులు, సిబ్బంది రేపు రండి మాపు రండని ప్రజలకు చెప్పి పంపుతున్నారు. కొందరు ప్రజలు రైతు బజార్లలోకి ఎప్పడు వస్తుందో తెలుసుకుని ఉరుకులు, పరుగులతో క్యూలెన్లలో ఉల్లి కోసం కాపు కాస్తున్నారు.