మళ్లీ ఉల్లి లొల్లి! | Onion prices sour again! | Sakshi
Sakshi News home page

మళ్లీ ఉల్లి లొల్లి!

Published Thu, Sep 19 2013 11:49 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Onion prices sour again!

తగ్గినట్టే తగ్గి మళ్లీ చెట్టెక్కుతున్న ఉల్లిగడ్డల ధరల ముందు సర్కారే ఓడిపోయింది. జూలై మొదటి వారం నుంచి పెరుగుతూ వచ్చి కిలో రూ.100వరకూ చేరుకున్న ఉల్లిగడ్డల ధరను సాధారణ స్థాయికి తెస్తామని, పక్షం రోజుల్లోనే అంతా సర్దుకుంటుందని గత నెలలో కేంద్ర ప్రభుత్వం చెప్పినా వాస్తవం వేరుగా ఉంది. కేవలం పక్షం రోజులపాటు అదుపులో ఉన్నట్టు కనబడిన ధరలు కాస్తా క్రమేపీ పెరుగుతూపోయాయి. నిరుడుతో పోలిస్తే ఇప్పుడు ఉల్లి ధర 245 శాతం మించి పెరిగింది. హైదరాబాద్‌లో కిలో రూ.60 వరకూ పలుకుతున్న ఉల్లి ధర ఢిల్లీలో మళ్లీ రూ.80కి చేరుకుంది.

ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. అక్రమ నిల్వదారులు కృత్రిమ కొరత సృష్టించడంవల్లా, స్పెక్యులేటర్లవల్లా ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అందరూ చెప్పినా ప్రభుత్వం ఆ దిశగా చేసిందేమీ లేదు. ఫలానాచోట కరువున్నది గనుక ఉల్లి దిగుబడి తగ్గిందని, మరోచోట భారీ వర్షాలున్నాయి గనుక రవాణా నిలిచిపోయిందని గత నెలలో చెప్పినట్టే కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ ఇప్పుడూ చెబుతున్నారు. సెప్టెంబర్ మొదటివారం నుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని ఉల్లి పంట చేతికొస్తుందని ఇక ఖాయంగా ధరలు పడిపోతాయని  అప్పుడు చెప్పగా... మరో 2, 3వారాల్లో వాటి ధరలు దిగొస్తాయని ఇప్పుడు అంటున్నారు.

ఏం చెప్పినా, ఏం చేసినా మార్కెట్ తన దోవలో తాను పోయింది. యథాప్రకారం మళ్లీ ధరలు పెరుగుతుండటంతో యూపీఏ ప్రభుత్వానికి ఇప్పుడు జ్ఞానోదయమైనట్టుంది. ఢిల్లీలో నవంబర్‌లో ఎన్నికలు సమీపిస్తుండగా వచ్చిన ఈ సంకటాన్ని అధిగమించడానికి ఇప్పుడు నానా తంటాలూ పడుతోంది. రాష్ట్రాల్లో అక్రమ నిల్వదారులపైనా, స్పెక్యులేటర్లపైనా కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు బుధవారం తాఖీదులిచ్చింది. రెండు నెలలక్రితం అందరూ హెచ్చరించినప్పుడే ఇలాంటి చర్యలకు ఉపక్రమించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. కొత్త పంట చేతికి రానప్పుడు అందుబాటులో ఉంటుందని మహారాష్ట్ర గిడ్డంగుల్లో నిల్వచేసిన ఉల్లిగడ్డల్లో 90 శాతం ఇప్పుడు ఖాళీకాగా, మార్కెట్‌లో మాత్రం దాని జాడ కనిపించడంలేదు. ఫలితంగా ధరలు పెరిగాయి. ఇప్పటికి కూడా అక్రమ నిల్వదారుల వల్లనే కొరత ఏర్పడి ఉండొచ్చన్న విషయంలో కేంద్రానికి ఇంకా నమ్మకం కలిగినట్టులేదు. వర్షాలు కురుస్తున్న కారణంగా రవాణా సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడి ఉండొచ్చన్న అభిప్రాయంతోనే ఉంది. అందువల్లే ఎక్కడ రవాణా స్తంభించినా తమ దృష్టికి తీసుకురావాలంటూ తాజా తాఖీదులో రాష్ట్రాలను కోరింది. మరోపక్క ఢిల్లీలోని కాంగ్రెస్ అభిప్రాయం మరోలా ఉంది. వచ్చే ఎన్నికల్లో తమ విజయావకాశాలను దెబ్బతీయడానికి మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఉల్లి అక్రమనిల్వలను ప్రోత్సహిస్తున్నదని ఆరోపిస్తోంది.  బీజేపీ అధిష్టానమే ఇందుకు ఆదేశాలిచ్చిందని చెబుతోంది.

  ఉల్లిగడ్డ ధర ఇంతగా మండుతున్నా రైతులకు మిగిలేది పెద్దగా ఉండటం లేదు. ప్రపంచంలో ఉల్లి దిగుబడుల్లో మన దేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్నా ఉత్పాదకత విషయంలో మాత్రం బాగా వెనకబడి ఉంది. అధిక దిగుబడినిచ్చే వంగడాలను రైతులకు అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో చైనా, పాకిస్థాన్‌లనుంచి వచ్చే ఉల్లిగడ్డల ధర కిలోకు రూ.18-20 మధ్య ఉంటే మన ఉల్లి ధర రూ.50 వరకూ ఎగబాకుతోంది. దిగుబడి తక్కువగా ఉండటం, పొలంనుంచి మార్కెట్‌కు చేరేలోగా 35 శాతం సరుకు పాడవడం వంటి కారణాలవల్ల అంత ధర పెడితేగానీ గిట్టుబాటయ్యే పరిస్థితి ఉండదు. బాధ్యతగల ప్రభుత్వాలైతే ఉల్లి రైతులకు ఏంచేస్తే పరిస్థితులు మెరుగుపడతాయని ఆలోచిస్తాయి. వారికి హైబ్రిడ్ వంగడాలను ఇవ్వడం దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకూ ఏమేమి అవసరమో చూస్తాయి. కానీ, ఈ విషయంలో ప్రభుత్వంనుంచి ప్రతిసారీ రైతుకు నిరాదరణే ఎదురవుతున్నది. పంట చేతికొచ్చే సమయానికి వారు ఏదో ధరకు అమ్ముకుని నష్టపోతుండగా, దళారులు మాత్రం సరుకును నిల్వచేసి డిమాండు పెరిగినప్పుడు అధిక ధరలకు అమ్మి లాభాలు ఆర్జిస్తున్నారు. నాసిక్ సమీపంలో ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో కేవలం ఉల్లిగడ్డల కోసమే నిర్మించిన అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ రైతులకు ఉపయోగపడటమే లేదు. అలాంటి యూనిట్ ఒకటి ఉన్నదన్న సంగతి కూడా ఉల్లి రైతుల్లో చాలామందికి తెలియదు. గిడ్డంగుల పరిస్థితి కూడా అంతే.

అక్రమ నిల్వదారులవల్లనో, పంట దెబ్బతినడంవల్లనో ఏటా కొరత ఏర్పడటం, ధరలు చుక్కలనంటడం రివాజుగా మారినా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.  ఉల్లిగడ్డల ధరలు పెరిగినప్పుడల్లా దాని కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ను పెంచడం ద్వారా ఎగుమతులను నివారించడానికి చూస్తున్న కేంద్రం మరోసారి ఆ పనే చేసింది. గత నెలలో ఎంఈపీని 650 డాలర్లు చేయగా, దాన్ని ఇప్పుడు 900 డాలర్లకు పెంచింది.  అయితే, గత నెలలో 650 డాలర్లు చేశాక ఉల్లి ఎగుమతులు తగ్గింది 29,000 టన్నులు మాత్రమే. ఇప్పుడు తాజాగా చేసిన పెంపువల్ల ఫలితం ఉంటుందో, లేదో చూడాల్సి ఉంది. అయితే, పీకలమీదికొచ్చినప్పుడల్లా ఇలాంటి చర్యలు తీసుకుంటే అంతర్జాతీయ మార్కెట్‌లో మన పరువుపోవడం మినహా ఒరిగేదేమీ ఉండదు. మరోపక్క రాగల నెలల్లో మూడు లక్షల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవడానికి వాణిజ్య విభాగం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల భయంలేకపోతే ఈమాత్రం హడావుడికూడా ఉండేది కాదు. ప్రాప్తకాలజ్ఞతను వదిలి ఇప్పటికైనా యూపీఏ ప్రభుత్వం లోపం ఎక్కడున్నదో గ్రహించాలి. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలేమిటో ఆలోచించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement