ఉల్లి ధరలకు పగ్గాలేయండి
న్యూఢిల్లీ: ఉల్లి ధరల కృత్రిమ పెంపును అరికట్టాలని, ఉల్లికి తాత్కాలికంగా నెలకొన్న కొరతను ఆసరాగా తీసుకుని మార్కెట్లలో దీని ధరలను కృత్రిమంగా పెం చేందుకు ప్రయత్నించే అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. దేశంలోని పలుచోట్ల హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో గత జూలై నుంచి ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలో ఉల్లి రిటైల్ ధర కిలో రూ.80కి చేరుకుంది. ఉల్లికి తాత్కాలికంగా ఏర్పడిన కొరతను ఆసరాగా తీసుకుని, మార్కెట్లలో కృత్రిమంగా ధరలు పెంచేందుకు యత్నించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారి ఒకరు బుధవారం మీడియాకు చెప్పారు.
ఉల్లిని ఎక్కువగా నిల్వచేసే మహారాష్ట్రను, సరఫరా స్థిరంగా ఉండేలా చూడాలని కోరినట్లు తెలిపారు. గత ఏడాది ఉల్లి నిల్వల్లో 90 శాతానికి పైగా ఖాళీ అయిపోయాయని, ప్రస్తుతం 3-4 లక్షల టన్నులు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉన్నాయని, అందువల్లే ధరలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వినియోగం కోసం 27.5 లక్షల టన్నుల ఉల్లిపాయలను సిద్ధం చేయగా, వాటిలో 15.5 లక్షల టన్నులను మహారాష్ట్ర గోదాముల్లోనే నిల్వచేసినట్లు తెలిపారు..
గుజరాత్, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడులలోని గోదాముల్లో 1-2 లక్షల టన్నుల చొప్పున నిల్వ చేశామని తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నందున మరి కొంతకాలం ధరలు ఎక్కువగానే ఉండవచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలో ఖరీఫ్ ప్రారంభంలో సాగుచేసిన ఉల్లి కోతలు సాగుతున్నాయని, రానున్న కొద్దిరోజుల్లో ఈ పంట మార్కెట్‌కు రావచ్చని తెలిపారు. దేశంలోని ఉల్లి ధరలపై ప్రభావం చూపే నాసిక్‌లోని లాసల్‌గావ్ మండీలో ధరలు విపరీతంగా పెరిగినందునే హోల్‌సేల్ మార్కెట్లలో ధరలు పెరిగాయని వర్తకులు చెబుతున్నారు.