
సాక్షి, హైదరాబాద్: మార్కెట్‌లో ఉల్లి ధరలు కొండెక్కడంతో.. ధరల నియంత్రణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమీక్ష చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నార్సీ బిల్లును కేంద్రం అత్యవసరంగా ఆమోదించింది కానీ, నిత్యావసరాల ధరలను మాత్రం ఎందుకు నియంత్రించలేకపోతోందని విమర్శించారు. ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేలేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతోనే ధరలు మరింతగా పెరుగుతున్నాయని, ధరలను నియంత్రించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఉల్లి బ్లాక్ మార్కెట్ తరలకుండా చేయడంతోపాటు ధరల స్థిరీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక లంబాడీలకు, ఆదివాసీలకు మధ్య నడుస్తున్న గొడవను బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ప్రోత్సహిస్తున్నాయని మల్లు రవి ఆరోపించారు.