ఉల్లి ధరలకు కళ్లెం
సాక్షి, సిటీబ్యూరో : మహారాష్ట్ర నుంచి పెద్దమొత్తంలో ఉల్లిని దిగుమతి చేసుకోవడం ద్వారా ధరలకు కళ్లెం వేస్తామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ జి.వెంకట్‌రాంరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని అన్ని రైతుబజార్లలో సబ్సిడీ ధరలపై ఉల్లిని అందుబాటులో ఉంచుతున్నామని ఆయన తెలిపారు. రైతుబజార్లు అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా సంచార రైతుబజార్ల ద్వారా ఉల్లి సరఫరా చేసి ధరల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మిర్చి ధరలకు కూడా పగ్గాలు వేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం ఒంగోలు జిల్లాలో పచ్చిమిర్చి పంట దిగుబడి మొదలైందనీ, అక్కడి నుంచి నగరానికి దిగుమతి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకట్‌రామ్‌రెడ్డి తెలిపిన వివరాలు...
ఉల్లి కొరతకు కారణం...
గత ఏడాదితో పోలిస్తే ఈసారి దేశంలో ఉల్లి ఎగుమతులు పెరిగాయి. అదే స్థాయిలో దిగుమతులు తగ్గాయి. ఫలితంగా కొరత ఏర్పడింది. దీనికితోడు మహారాష్ట్ర, కర్ణాట కల్లో వర్షాల కారణంగా పంట దెబ్బతింది. ఇప్పుడు కోత కోయలేని పరిస్థితి. దీంతో హైదరాబాద్‌కు దిగుమతి తగ్గిపోయింది. ఇదే అదనుగా వ్యాపారులు సరుకు నిల్వ చేసి ధరలు పెంచేశారు. డిమాండ్, సరఫరా ల మధ్య అంతరం పెరిగి ధరలు అనూ హ్యంగా పెరిగాయి.
సరఫరా ఒక్కసారిగా పడిపోవడానికి కారణం?
కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి సరఫరా అయ్యేది నీరుల్లి. ఎక్కువ కాలం నిల్వ ఉండదు. మహారాష్ట్ర ఉల్లి నాణ్యమైనది. ప్రస్తుతం మహారాష్ట్రలోనే ధరలు అధికంగా ఉండటంతో వ్యాపారులు సరుకు నిల్వ చేస్తున్నారు. దీంతో నగరానికి రోజుకు 20-25 లారీలకు మించి సరుకు రావట్లేదు. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఆయా ప్రాంతాల నుంచి రవాణా ఆగిపోయింది. దీంతో నగరానికి దిగుమతులు పడిపోయి కొరత ఏర్పడింది.
కొరత అధిగమించేందుకు ప్రణాళిక?
మార్కెటింగ్ శాఖ నుంచి ఇద్దరు అధికారులను మహారాష్ట్రలోని నాసిక్, షోలాపూర్ లకు పంపుతున్నాం. క్షేత్రస్థాయిలోనే ఉల్లి కొనుగోలు చేసి నేరుగా నగరానికి దిగుమతి చేసుకుంటాం. అక్కడ గ్రేడ్-2 రకం ఉల్లి కేజీ రూ.34. దీనికి రవాణా చార్జీలు కలిపి ఇక్కడ కేజీ రూ.35 ప్రకారం రైతుబ జార్లలో విక్రయిస్తాం. అక్కడ ధర తగ్గితే ఆ మేరకు తగ్గించి ఇక్కడ అమ్ముతాం. ప్రస్తు తం నగరంలోని మహబూబ్‌మాన్షన్ మా ర్కెట్‌కు వచ్చే సరుకులో రోజుకు 60-100 క్వింటాళ్లు సేకరించి హోల్‌సేల్ ధరకంటే రూ.1 అదనంగా (రవాణా చార్జి) రేటు నిర్ణయించివినియోగదారులకు అందిస్తున్నాం.
ధరల నియంత్రణకు తీసుకున్న చర్యలు?
మహారాష్ట్ర నుంచి దిగుమతులు మరింత పెంచుతాం. మా సిబ్బంది అక్కడ ఉంటారు గనుక రోజుకు ఎంత అవసరమో వారికి సమాచారం ఇచ్చి ఆ మేరకు సరుకు తెప్పిస్తాం. ఉల్లి అందుబాటులో ఉంటే ధరలు వాటంతట అవే దిగివస్తాయి. ప్రస్తుతం హోల్‌సేల్ ధరకే కేజీ రూ.34లకు సరఫరా చేస్తామని ఖమ్మం నుంచి ఓ వ్యా పారి ముందుకు వచ్చారు. నాణ్యత ఉంటే నగరానికి తెప్పిస్తాం. మార్కెట్లో సమృద్ధిగా ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న అక్రమ నిల్వలు బయటకు వస్తాయి. అప్పుడు ధరలు అదుపులోకి వస్తాయి.
పచ్చిమిర్చి కొరతను ఎలా తీరుస్తారు. ధరల మాటేమిటి ?
నిజానికి స్థానికంగా పచ్చిమిర్చి దిగుబడి పూర్తిస్థాయిలో లేదు. దీనికితోడు సీమాంధ్ర ఉద్యమం వల్ల నగరానికి దిగుమతులు నిలి చిపోయాయి. స్థానికంగా కొత్త పంట వచ్చిదంటే.. ధరలు దిగివస్తాయి. సెప్టెంబర్‌లో కొత్త పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ధరలను అదుపులో పెట్టేం దుకు ఒంగోలు నుంచి మిర్చి దిగుమతి చేసుకొంటాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. అక్కడ ఉద్యమ ప్రభావం ఉన్నా... రాత్రి పూట సరుకు తెప్పించేందుకు చర్యలు తీసుకొంటాం.