ధరలు తగ్గే వరకూ ఉల్లి విక్రయాలు
Published Wed, Sep 18 2013 3:44 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
తాండూరు, న్యూస్‌లైన్: ఉల్లి ధర దిగొచ్చేవరకూ జంటనగరాల్లోని అన్ని రైతు బజారుల్లో కిలో రూ.28 చొప్పున విక్రయాలు కొనసాగిస్తామని ప్రాంతీయ ఉప మార్కెటింగ్ సంచాలకులు(ఆర్‌డీడీఎం) ఈ.మల్లేశం స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తాండూరు మార్కెట్ కమిటీని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు జంట నగరాల్లోని అన్ని రైతు బజారుల్లో 2,500 క్వింటాళ్లు, మెదక్ జిల్లా (సిద్దిపేట, సంగారెడ్డి), మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో 500 క్వింటాళ్ల ఉల్లి విక్రయించామని తెలిపారు. కిలో రూ.25-39 ధరకు విక్రయించినట్టు చెప్పారు. ప్రస్తుతం రూ.28లకు కిలో ఉల్లి విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. మలక్‌పేట మార్కెట్‌లో బిడ్డింగ్‌లో ధర అధికంగా ఉండటం వల్ల వికారాబాద్, తాండూరు మార్కెట్‌లలో ఇటీవల ఉల్లి విక్రయాలు ఆగిపోయాయని, మరో రెండు రోజుల్లో మళ్లీ ప్రారంభమవుతాయని చెప్పారు.
జంటనగరాలకు రోజుకు సుమారు 10వేల బస్తాల ఉల్లి అవసరం ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని 70మార్కెట్ కమిటీలకు రూ.104కోట్ల మార్కెట్ ఫీజు లక్ష్యమన్నారు. ఇందులో ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.37.50కోట్ల మార్కెట్ ఫీజు వసూలు అయినట్టు చెప్పారు. లక్ష్యంలో 20శాతం నిధులను ఆయా మార్కెట్ యార్డుల అభివృద్ధి, రైతుల సౌకర్యాలకు వెచ్చించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర లభించకపోతే మార్క్‌ఫెడ్, నాఫెడ్ ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. తాండూరులో మినుముల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు మార్క్‌ఫెడ్‌కు ఇటీవలే లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. ఈ సీజన్‌లో తాండూరు యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు ప్రతిపాదనలు పంపించనున్నట్టు వెల్లడించారు.
జిల్లాలో లక్ష ఎకరాల్లో పత్తి సాగైందని, సుమారు 15-20 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. తాండూరులో కొత్త మార్కెట్‌యార్డు ఏర్పాటుకు రాజీవ్ స్వగృహ ఇళ్లకు కేటాయించిన స్థలంలో 20ఎకరాలు ఇవ్వాలని మార్కెటింగ్ శాఖ కమిషనర్.. ఆర్‌ఎస్‌జీ అధికారులకు లేఖ రాశారన్నారు. సోయాబీన్, కందులు, పత్తి పంటలకు మద్దతు ధరలు, మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాలపై కమిషనర్ ఆదేశాల మేరకు కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. సమావేశంలో తాండూరు మార్కెట్ కమిటీ ఇన్‌చార్జి కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement