=ప్రైవేటు మార్కెట్‌లో రూ.60
=రైతుబజార్లలో రూ.40
=పడిపోయిన అమ్మకాలు
=టమోటా ధర పైపైకి
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఉల్లి ధరలు కొండెక్కి దిగనంటున్నాయి. మార్కెట్‌లో మంచి రకం ఉల్లి కనుమరుగైంది. అధిక రేటుతో కొనుగోలు చేసిన నాసిరకం ఉల్లి ఘాటు లేకుండా చప్పగా ఉంటోందని ప్రజలు చెబుతున్నారు. సరకు బాగుండకపోయినా సన్న బియ్యం ధరలతో పోటీ పడి ఉల్లిపాయల రేట్లు పెరగటంతో జనం వాటి వాడకాన్ని తగ్గించేశారు. దాంతో ఉల్లి అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దాదాపు నాలుగో వంతు అమ్మకాలు మాత్రమే జరుగుతున్నాయి. ఢిల్లీలో కిలో ఉల్లి ధర దాదాపు వంద రూపాయలు పలుకుతుండగా, విజయవాడ మార్కెట్లో మంచి రకం ఉల్లి రూ.60, నాసిరకం రూ.45కి విక్రయిస్తున్నారు.
రైతు బజార్లలో మాత్రం నాసిరకం కిలో రూ.32, ఓ మోస్తరు రకం రూ.40కి విక్రయిస్తున్నారు. గత సంవత్సరం రూ.12 నుంచి రూ.15 వరకు విక్రయాలు జరిగిన ఉల్లి ఈ ఏడాది రూ.25 నుంచి రూ.30తో ప్రారంభమై బహిరంగ మార్కెట్లో రూ.60కి పెరిగి దిగనంటోంది. ఈ నేపథ్యంలో గత రెండు మాసాల నుంచి విజయవాడ మార్కెట్లోకి నాసిరకం సరకే వస్తోందని హోల్‌సేల్ వ్యాపారులు చెపుతున్నారు. మంచి రకం రాకపోవటం, ధరలు పెరగటంతో జిల్లా వ్యాప్తంగా అమ్మకాలు పడిపోయాయని చెపుతున్నారు.
భారీగా తగ్గిన దిగుమతులు...
రెండు మాసాల క్రితం వరకు విజయవాడ మార్కెట్‌కు ప్రతిరోజు అహ్మద్‌నగర్, నాసిక్, సోలాపూర్, కర్నూలు నుంచి ఉల్లిపాయలు దిగుమతి అయ్యేవి. గతంలో రోజుకు వంద లారీల సరుకు ఇక్కడకు దిగుమతయ్యేది. ప్రస్తుతం రోజుకు 25 లారీల సరకు మాత్రమే దిగుమతి అవుతోంది. ఒక్కో లారీకి 10 నుంచి 15 టన్నులు వస్తుంది. ఈ లెక్కన వంద లారీలకు 1500 టన్నుల ఉల్లి ప్రతిరోజు హోల్‌సేలర్స్ దిగుమతి చేసుకునేవారు. ప్రస్తుతం 25 లారీలలో 375 టన్నుల సరకు మాత్రమే వస్తోంది. అహ్మద్‌నగర్‌లో ఉల్లి ఉత్పత్తిలో ఆలస్యం అవటంతో మంచి రకం రావటం లేదని చెపుతున్నారు. ఇతర రాష్ట్రాలలో వరదలు, వర్షాలు ఉత్పత్తుల పడిపోవటానికి కారణమని పేర్కొంటున్నారు. మరో నెలరోజుల వరకు ఇదేపరిస్థితి ఉంటుందని హోల్‌సేల్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టమోటా ధరలు పైపైకి ...
లోకల్ మార్కెట్‌లో ఉత్పత్తులు తగ్గటంలో టమోటా ధరలు పైపైకి వెడుతున్నాయి. ప్రస్తుతం టమోటా ధర రైతు బజార్లలో కిలో రూ.34 ఉండ గా, ప్రైవేటు మార్కెట్లలో ఈ నెల మొదటి వారంలో కిలో రూ.15 ఉండగా, ఆ తరువాత నుంచి పెరుగుతూ వచ్చింది. విజయవాడ పరిసర ప్రాంతాలకు మదనపల్లినుంచి టమోటా వస్తోంది. అక్కడ నుంచి సరకు చెన్నైకి అధిక రే టుకు ఎగుమతి చేస్తున్నారు. దాంతో మనకు సరకు రావటంలేదని వ్యాపారులు చెపుతున్నారు. లోకల్‌గా దిగుమతులు డిసెంబర్ వరకు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో టమోటా ధర కూడా కిలో రూ.50 లేదా రూ.60కి చేరవచ్చని భావిస్తున్నారు.