సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా సబ్సిడీ ధరలకే రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు విక్రయిస్తోంది. ఈ విషయంలో వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖలు, రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో సీఎం కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. వారం రోజులుగా రాష్ట్రంలో ఉల్లిధరలు కిలో రూ.80 నుండి రూ.100 వరకూ పెరగడంతో ఈ అధిక ధరలను అదుపుచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గేంత వరకూ రైతు బజార్లలో అమ్మకాలు చేపట్టాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది.
ధరలను పెంచేందుకు అక్రమంగా ఎవరైనా ఉల్లిపాయలు నిల్వ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంతైనా సామాన్యులకు రైతు బజార్లలో రూ.25 కే కిలో చొప్పున అమ్మాలని సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అక్రమంగా ఉల్లిపాయల నిల్వ చేస్తే వారిపై మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు రోజుకు 500 నుంచి 1,200 క్వింటాళ్ల ఉల్లిపాయలు సేకరించి మార్కెటింగ్ శాఖ ద్వారా రైతు బజార్లకు తరలిస్తున్నారు. ప్రతీ కిలో మీద రూ. 50కి పైగా ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చి రైతు బజార్లకు సరఫరా చేస్తోంది.
రాష్ట్రానికి షోలాపూర్ ఉల్లిపాయలు
కర్నూలు మార్కెట్‌లో ఉల్లి నిల్వలు తగ్గిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంది. షోలాపూర్ మార్కెట్‌కు ఉల్లి నిల్వలు అధికంగా వస్తున్నాయనే సమాచారం తెలుసుకున్న మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న అక్కడికి తమ సిబ్బందిని పంపించారు. బుధవారం నుంచి అక్కడ ఉల్లిని కొనుగోలు చేసి రోడ్డు మార్గంలో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఉల్లి ధరల హోరు కొనసాగుతోంది. మంగళవారం క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.10,220 పలికింది.
భారం ఎంతైనా కిలో ఉల్లి రూ.25కే
Published Wed, Dec 4 2019 4:35 AM | Last Updated on Wed, Dec 4 2019 11:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment