పేట్రేగిన ఉల్లి
♦ ఢిల్లీ ధరలతో వ్యాపారుల పోటీ
♦ రిటైల్ మార్కెట్లో కిలో రూ.70-80
♦ సబ్సిడీ ఉల్లికి జనం బారులు
సాక్షి, సిటీబ్యూరో : ఉల్లి ధర జనాలను హడలెత్తిస్తోంది. ఢిల్లీలో ఉల్లి ధర కిలో రూ.100కు చేరువవుతోందన్న వార్త నగరంలోని రిటైల్ వ్యాపారుల్లో అత్యాశను రేపింది. దీంతో ఒక్కరోజు వ్యవధిలోనే కిలోపైఅదనంగా రూ.10-15 పెంచేశారు. మలక్‌పేటలోని హోల్‌సేల్ మార్కెట్లో గ్రేడ్ -1 ఉల్లి కేజీ ధర రూ.67 పలకడంతో వెంటనే రిటైల్ వ్యాపారులు పెంచేశారు. నిన్న మొన్నటి వరకు కేజీ రూ.65కు లభించిన మహారాష్ట్ర ఉల్లి ఇప్పుడు రూ.80కి, కర్నూలు ఉల్లి కిలో రూ.50 నుంచి రూ.60కి ఎగబాకాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి నగరానికి ఉల్లి దిగుమతి తగ్గిపోవడంతో పాటు కర్నూలునుంచి కూడా సరఫరా నిలిచిపోయింది.
మహారాష్ట్రలో స్థానికంగానే ఉల్లికి మంచి ధర పలుకుతుండటంతో రైతులు ఇక్కడికి పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. నగరంలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్‌కు నిత్యం 16-18వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతయ్యేది. మంగళవారం 14వేల క్వింటాలు మాత్రమే వచ్చింది. ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధర లు పెంచేశారు. నిన్నటి వరకు కేజీ రూ.50 ఉన్న గ్రేడ్-2 నీరుల్లి (కర్నూలు) ధర ఒక్కరోజులోనే రూ.60కి చేరింది. తోపుడు బండ్ల వారైతే... థర్డ్ గ్రేడ్ ఉల్లిని గ్రేడింగ్ చేసి కాస్త పెద్దవి కేజీ రూ.70, చిన్నవి రూ. 60 వంతున విక్రయిస్తున్నారు. టీవీలు, పత్రికల్లోని కథనాలను చూసి నగరానికి ఉల్లి సరఫరా ఆగిపోయిందని... ధరలు ఢిల్లీ తరహాలోనే ఉంటాయని కొందరు వ్యాపారులు ప్రచారం చేస్తున్నారు.
కిక్కిరిసిన రైతుబజార్లు
సబ్సిడీ ఉల్లి కోసం జనం పోటెత్తుతుండటంతో నగరంలోని రైతుబజార్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి సోమవారం సబ్సిడీ ఉల్లి కౌంటర్లను మూసేస్తుంటారు. ఇది తెలియని కొందరు సోమవారం ఉల్లి కోసం వచ్చి సరుకు అయిపోయిందని ప్రచారం మొదలెట్టారళు. దీన్ని నమ్మిన గృహిణులు మంగళవారం ఉదయాన్నే కౌంటర్ల వద్ద క్యూలు కట్టారు. స్కూల్‌కు వెళ్లాల్సిన పిల్లలను కూడా క్యూలైన్‌లో నిలబెట్టి ఉల్లి కొనుగోలు చేశారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు నిరంతరాయంగా విక్రయాలు సాగించినా రద్దీని నియంత్రించలేక పోతున్నామని రైతుబజార్ సిబ్బంది వాపోతున్నారు. కావాల్సినంత సరుకు ఉందనీ పదే... పదే మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నా... ఎవరూ పట్టించుకోవట్లేదని, పోలీసుల సహకారంలో విక్రయిస్తున్నామని చెబుతున్నారు.
కృత్రిమ కొరత
కొందరు ఉల్లి వ్యాపారులు ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వినికిడి. కర్నూలు ఉల్లి వారం రోజులకు మించి నిల్వ ఉండ దు. మహారాష్ట్ర ఉల్లి నెల రోజుల వరకు బాగుంటుంది. కొందరు వ్యాపారులు నాణ్యమైన మహారాష్ట్ర ఉల్లిని అక్రమంగా నిల్వ చేసి ధరలు పెంచేశారని తెలుస్తోంది. వర్షాలు, ఇతర కారణాలతో ఒక్కరోజు దిగుమతులు ఆగిపోతే... ఆ కొరతను బూచిగా చూపి ధరలు పెంచుతుండటం నగరంలో పరిపాటి. ఈ తరుణంలో మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించడంతో పాటు, ఉల్లి ధరలకు కళ్లెం వేయకపోతే పరిస్థితి మరింత భారమయ్యే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే సెప్టెంబర్ నాటికి నగరంలో ఉల్లి కేజీ రూ.100కు చేరినా ఆశ్చర్య పడాల్సిందేమీ లేదని మార్కెటింగ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.