దిగిరాని ఉల్లి ధరలు
క్వింటాలుకు గరిష్టంగా రూ. 4,300
కనిష్టంగా రూ. 3 వేలు
దేవరకద్ర : ఉల్లి ధరలు దిగి రావడం లేదు. ఒక వారం కొంత వరకు ధరలు దిగినా, మరో వారం మరింత పెరుగుతున్నాయి. దేవరకద్ర మార్కెట్‌లో ప్రతి బుధవారం జరిగే ఉల్లిపాయల బహిరంగ వేలం జోరందుకుంది. ధరలు బాగా పెరగడంతో రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ధరలు పెరగడంతో పండించిన ఉల్లిని వెంటనే మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. బుధవారం జరిగిన వేలంలో గతవారం కన్నా మరింత అధికంగా ధర పలికింది. వరుసగా ఐదు వారాల నుంచి ఉల్లి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. వందలాది బస్తాల ఉల్లిని రైతులు మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. జిల్లాలోని గద్వాల, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఉల్లిపాయల వేలంలో పాల్గొన్నారు. వ్యాపారులు, కొనుగోలుదారులు, రైతులతో మార్కెట్ అంతా సందడిగా మారింది.
గత వారం కన్నా రూ. 300 అధికం
దేవరకద్ర మార్కెట్‌లో ఉల్లి వేలం జోరుగా సాగింది. గత వారం వచ్చిన ధర కన్నా రూ. 3 వందలు అధిక ధర పలికింది. గత వారం క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 4 వేలు ధర ఉంది. ఈ వారం రూ. 4300 ల వరకు ధరలు వచ్చాయి. కనిష్టంగా రూ. 3 వేల వరకు వేలంలో ధరలు పలికాయి. ఇక చిన్నపేడుగా ఉన్న ఉల్లికి ఈ వారం ఏకంగా రూ. 2 వేల వరకు ధరలు పలికాయి. ఉల్లి ధరలు బాగా పెరగడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఆనందంలో మునిగి పోయారు.