ఉల్లి.. కమీషన్ల లొల్లి
కర్నూలు(అగ్రికల్చర్) : ఉల్లి రైతులను కమీషన్ ఏజెంట్లు దోపిడీ చేస్తున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌కు ఉల్లి భారీగా వస్తోంది. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు 2 శాతం కమీషన్ ఉండగా ఉల్లికి మాత్రం 4 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. అయితే కమీషన్ ఏజెంట్లు రైతులకు ఇచ్చే బిల్లులో మాత్రం 2శాతం తీసుకుంటున్నట్లుగా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం ఉల్లి ధరలు పెరిగి పోయాయి. క్వింటాల్ ధర రూ 4000 పైగా ఉంది. అంటే ఒక క్వింటాల్ పైనే కమీషన్ రూపంలో రూ. 40 వసూలు చేస్తున్నారు. ఉల్లిని వేలంపాట ద్వారా కొనుగోలు చేస్తారు.
ఏ ధరకు పోయినా రైతుకు డబ్బు చెల్లించేటపుడు క్వింటాళుపై రూ. 20 ప్రకారం కోత విధించి చెల్లిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇలా చేస్తునే యథావిధిగా కూలీల చేత చెడిన వాటిని వ్యర్థాలను ఏరీ వేయిస్తున్నారు. క్వింటాలుకు 2 నుంచి 3 కిలోలు ఏరీ వేయిస్తుడటంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఈ విషయం మార్కెట్ కమిటీ అధికారలకు తెలిసినా పట్టించుకోరు. ఎందకంటే సీజన్ మామూలు కింద ఏటా రూ 5లక్షల నుంచి 6 లక్షలు ముట్ట చెబుతుండటమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్‌లో ఉల్లిని విక్రయించిన రైతులు శ్యాంపల్ కింద ప్యాకెట్ ఉల్లి సమర్పించుకోవాల్సింది.
కాటాదారులు, ఉల్లిని క్లీన్ చేసిన మహిళా కూలీలు 10 కిలోలకు పైగా రైతును అడగకుండానే తీసుకుంటున్నారు. వేలంపాట నిర్వహించే సెక్యూరిటీ సిబ్బందికి మరో 10 కిలోలు సమర్పించుకుంటున్నారు. కాటాదారులు, ఇతర హమాలీలకు నిబంధనల ప్రకారం కూలి చెల్లిస్తునే అదనంగా ఇచ్చుకుంటున్నామని రైతులు వాపోతున్నారు. కర్నూలు మార్కెట్‌లో అడుగడుగునా దగా చేస్తుడటంతో రైతులు తాడేపల్లిగూడేనాకి వెలుతున్నట్లు సమాచారం. ఇప్పటికైన మార్కెట్ కమిటీ అధికారులు చర్యలు తీసుకొని ఉల్లి దోపడీని అరికట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.