
సాక్షి, అమరావతి: ఉల్లి ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన సోమవారం ఉల్లి ధరలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల్లో మహారాష్ట్ర నుంచి ఉల్లిని తెప్పించి రైతు బజార్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా ఉల్లి పంటలు దెబ్బతినడం వల్లే ధరలు పెరిగాయని తెలిపారు. కొందరు వ్యాపారులు ఉల్లికి కృత్రిమ కొరత సృష్టించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి మోపిదేవి హెచ్చరించారు.
ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి..
మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలులో వరదల నేపథ్యంలో ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. నెల రోజుల కిందట రైతు బజార్‌లో రూ.20 పలికిన ఉల్లిపాయల ధర ప్రస్తుతం 38కి చేరుకుంది. బహిరంగ విపణిలో రూ.55 నుంచి రూ.60 పలుకుతోంది. దక్షిణాది రాష్ట్ర్రాల్లో గతంలో పోలిస్తే ప్రస్తుతం ఉత్పత్తి తగ్గింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు మందగించింది. ఉల్లి ధరల పెరుగుదల నియంత్రించడానికి ప్రభుత్వం దృష్టిసారించింది.
Comments
Please login to add a commentAdd a comment