ఉల్లీ.. చిక్కవే తల్లీ | Start Subsidy Scheme | Sakshi
Sakshi News home page

ఉల్లీ.. చిక్కవే తల్లీ

Published Thu, Aug 6 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

ఉల్లీ.. చిక్కవే తల్లీ

ఉల్లీ.. చిక్కవే తల్లీ

- సబ్సిడీ పథకం ప్రారంభం
- కేజీ రూ.20కి విక్రయం
- రైతుబజార్లకు పోటెత్తిన జనం
సాక్షి, సిటీబ్యూరో:
ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలోని అన్ని రైతుబజార్లలో బుధవారం సబ్సిడీ ఉల్లి కౌంటర్లను అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు సబ్సిడీ ఉల్లి కౌంటర్లను ప్రారంభించారు. కేజీ రూ.20 వంతున... ఒక్కో వినియోగదారుడికి రెండేసి కిలోల చొప్పున ఉల్లిని అందిస్తున్నారు. గ్రేటర్‌లోని 9 రైతుబజార్లతో పాటు వివిధ ప్రాంతాల్లోని 34 ఔట్‌లెట్స్, మేడ్చెల్, మేడిపల్లి రైతుబజార్లలో బుధవారం నుంచి సబ్సిడీ ఉల్లి పథకం ప్రారంభమైంది. తొలిరోజు ఈ కేంద్రాలకు మొత్తం 29 టన్నుల (290 క్వింటాళ్లు) ఉల్లిని మార్కెటింగ్ శాఖ అధికారులు సరఫరా చేశారు.

సరూర్‌నగర్‌లో మంత్రి హరీష్‌రావు, కూకట్‌పల్లిలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎర్రగడ్డలో మంత్రి తలసాని శ్రీనివాస్, మెహిదీపట్నంలో మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఫలక్‌నుమాలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, అల్వాల్‌లో మంత్రి పద్మారావు, వనస్థలిపురంలో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, రామకృష్ణాపురంలో ఎమ్మెల్యే శ్రీనివాస్, మీర్‌పేటలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేడిపల్లి, మేడ్చెల్  రైతుబజార్లలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సబ్సిడీ ఉల్లి కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉల్లి ధరలు కిందికుదిగివచ్చే వరకు ఈ సబ్సిడీ కౌంటర్లను కొనసాగిస్తామని ప్రకటించారు. ఎక్కడా కూడా కొరత రాకుండా మార్కెటింగ్ శాఖ అధికారులు పక్కాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 

పోటెత్తిన జనం
బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.40-45 పలుకుతోంది. దీంతో సబ్సిడీ ఉల్లికి విపరీతమైన గిరాకీ ఎదురైంది. రైతుబ జార్లలో సబ్సిడీ ధరపై ఉల్లిని విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం ముందుగానే ప్రకటించడంతో గ్రేటర్‌లోని అన్ని రైతుబ జార్లకు జనం పోటెత్తారు. ఉదయం 8గంటలకే కౌంటర్ల వద్ద బారులు తీరారు. మెహిదీపట్నం, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, సరూర్‌నగర్ , ఫలక్‌నుమా, వనస్థలిపురం, అల్వాల్ రైతుబజార్లలో వినియోగదారుల రద్దీ అధికం కావడంతో ఉదయం 9 నుంచి రాత్రి 7గంటల వరకు నిరాటంకంగా విక్రయాలు కొనసాగించారు. ఒక్కో రైతుబ జార్‌కు 4-7 టన్నుల చొప్పున ఉల్లిని అధికారులు అందించారు. అయితే... సాయంత్రం 4 గంటలకే కొన్ని రైతుబజార్లలో సరుకు ఖాళీ అయిపోయింది. దీంతో రంగంలోకి దిగిన మార్కెంటింగ్ శాఖ డిప్యూటీ డెరైక్టర్లు వై.ఎస్.పద్మహర్ష, ఎల్లయ్యలు ఒక్కో టన్ను చొప్పున అదనంగా సరఫరా చేశారు. విక్రయాల్లో అవకతవకలకు తావులేకుండా రైతుబ జార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతుబజార్లు అందుబాటులో లేని ప్రాంతాలకు సైతం సబ్సిడీ ఉల్లిని సరఫరా చేసేందుకు వివిధ ప్రాంతాల్లో 34 ఔట్‌లెట్స్ ఏర్పాటు చేశారు.  

కొరత రానివ్వం: జి.లక్ష్మీబాయ్, మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు
సబ్సిడీ ఉల్లికి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మిగ తా జిల్లాలకు కూడా తగినంత సరుకును సేకరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్మాల్ ఫార్మర్స్ అగ్రీ బిజినెస్ కన్‌సార్టియా నుంచి పెద్దమొత్తంలో ఉల్లి దిగుమతి చేసుకొంటున్నాం. ధరలు ఎంత పెరిగినా కేజీ రూ.20కే అందిస్తాం. నాసిక్ నుంచి గురువారం మరో 3వేల క్వింటాళ్ల సరుకు తెప్పిస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి, ఎనతల ప్రాంతంలోని రైతుల నుంచి, మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్ నుంచి ఉల్లిని సేకరిస్తున్నాం. సబ్సిడీ ఉల్లి పక్కదారి పట్టకుండా నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. ఏదైనా గుర్తింపు కార్డును చూపిన వినియోగదారులకే ప్రస్తుతం అందిస్తున్నాం. నగరం నలుమూలకు సరఫరా చేసి ఉల్లికి కొరత లేకుండా చూస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement