నిజజీవితంలో కన్నీళ్లు తెప్పిస్తున్నా.. నెట్‌లో మాత్రం ఉల్లి నవ్వులు పూయిస్తోంది. ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న కొద్దీ సోషల్ మీడియాలో కార్టూన్లు, జోకులు పేలుతున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్వీటర్ ఎందులో అయినా ఇప్పుడు ఉల్లి హాట్ టాపిక్‌గా మారింది. డైమండ్ రింగులకు బదులుగా ‘ఉల్లి’ పొదిగిన ఆభరణాలను చూసి జనం తెగ నవ్వుకుంటున్నారు.
ఫొటోషాప్ ఎఫెక్ట్: చూడు తమ్ముడూ.. ఇయ్యల రేపట్ల చేతిలో ఉల్లిగడ్డ ఉన్నోడే శ్రీమంతుడు. (హీరో మహేష్‌బాబు శ్రీమంతుడు పోస్టర్‌కు ఎఫెక్ట్)
ఉల్లిగడ్డలు కొనేందుకు భార్యాభర్తలు కూరగాయల దుకాణానికి వెళ్లారు. భార్యాభర్తలు: రెండు కిలోల ఉల్లిగడ్డలు ఇవ్వండి..
షాప్ ఓనర్: పాన్ నంబర్ ప్లీజ్..!
వ్యంగ్యాస్త్రం: ఓ ఇంట్లో దోపిడీకి వచ్చిన దొంగ భార్యాభర్తలిద్దరినీ తాడుతో బంధించాడు. ఎన్ని డబ్బులైనా ఇస్తాం.. మమ్మల్ని వదిలేయమని భార్యాభర్తలు వేడుకుంటున్నారు. ‘పైసలు ఎవ్వడికి కావాలి.. కుక్కను కొడితే రాల్తాయ్.. ఓన్లీ ఉల్లిగడ్డలు..’ అని దొంగ కామెంట్.
ఓ ఫొటో: ఒక ఉల్లిగడ్డ తాడుకు వేలాడుతోంది. దాన్ని కన్నార్పకుండా చూసుకుంటూ.. ఆనందంగా లొట్టలేసుకుంటూ ‘అహా నా పెళ్లంట’ సినిమాలో కోట శ్రీనివాసరావును తలపించేలా అన్నం పళ్లెం పట్టుకున్నాడో సగటు జీవి.
ఓ వీడియో: అందమైన భార్య. సూటుబూటు ధరించిన భర్త. ఎంతో ప్రేమతో కానుకగా ఓ గిఫ్ట్ ప్యాక్ తెచ్చి భార్యకు అందించాడు. గోల్డ్ షాప్ నుంచి తెచ్చినట్లుగా ఉన్న ఆ ప్యాక్‌లో ఏముందో అని చకచకా ప్యాక్ విప్పింది భార్య. అందులో ‘ఉల్లి పొదిగిన ఉంగరం’ ఉంది. అంతే ఆనందంతో ఆ భార్య తన భర్తను హత్తుకుంది.
నెట్‌లో నవ్వుల ఉల్లి..
Published Mon, Aug 24 2015 10:47 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM
Advertisement
Advertisement