టోకు ధరల ఊరట...
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో ఊరట కలిగించింది. కేవలం 3.74 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 ఆగస్టుతో పోల్చితే 2014 ఆగస్టులో టోకు ధరలు కేవలం 3.74 శాతం మాత్రమే పెరిగాయన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో వార్షిక ద్రవ్యోల్బణం ఐదేళ్లలో ఇదే మొదటిసారి. (2009 అక్టోబర్‌లో ఈ సూచీ 1.8 శాతంగా నమోదయ్యింది) 2014 జూలై నెలలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 5.19 శాతం. 2013 ఆగస్టు నెలలో ఈ రేటు 6.99 శాతంగా ఉంది.
ఆహార ధరలు తగ్గడమే కారణం!
ఆగస్టు నెలలో ఉల్లి, కూరగాయలుసహా ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గడమే మొత్తం ద్రవ్యోల్బణం దిగిరావడానికి కారణం. టోకు ధరల సూచీలోని మొత్తం మూడు విభాగాల్లో ఒక సబ్- కేటగిరీగా ఉన్న ఆహార ఉత్పత్తుల సూచీ అతి తక్కువగా నమోదయ్యింది. జూలైలో ఈ రేటు 8.43 శాతం ఉంటే, ఇది ఆగస్టులో భారీగా 3.28 శాతం పడిపోయి 5.15 శాతానికి చేరింది.
వేర్వేరుగా చూస్తే కూరగాయలు (4.88 శాతం), ఉల్లిపాయలు(44.70 శాతం), ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల(5.87 శాతం) ధరలు గత యేడాది ఆగస్టులో పోల్చిచూస్తే 2014 ఆగస్టులో పెరగకపోగా తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అయితే భారీగా పెరిగిన ఆహార ఉత్పత్తుల్లో ఆలూ (61.61%), పండ్లు (20.31%), పాలు (12.18%) ఉన్నాయి. పప్పు దినుసులు (7.81%), బియ్యం (5.44%) ఉన్నాయి. కాగా తాజా గణాంకాల నేపథ్యంలో వడ్డీరేట్లు తగ్గించాలని పారిశ్రామిక ప్రతినిధులు కొందరు డిమాండ్ చేస్తున్నారు.
3 ప్రధాన విభాగాల తీరు...
మూడు ప్రధాన విభాగాల్లో ఒకటైన ప్రైమరీ ఆర్టికల్స్ వార్షిక ద్రవ్యోల్బణం రేటు 3.89 శాతంగా ఉంది. ఇందులో ఒక సబ్-కేటగిరీగా ఉన్న నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 4.19 శాతంగా ఉంది. మరో సబ్ కేటగిరీ పైన పేర్కొన్న ఆహార ఉత్పత్తులకు (ద్రవ్యోల్బణం 5.15%) సంబంధించింది.
ఇంధన-విద్యుత్ కేటగిరీలో ద్రవ్యోల్బణం 4.54%.
మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల విభాగం వాటా 3.45 శాతం.