న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులు, ఇంధనం, ప్రాథమిక లోహాల ధరలు తగ్గుదల ప్రభావం మొత్తంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) క్షీణతకు దారితీస్తోంది. క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, టెక్స్‌టైల్స్ ధరలు కూడా జూలై తగ్గుదలను నమోదుచేసుకున్నాయి. ఆయా అంశాల నేపథ్యంలో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో అసలు పెరుగుదల లేకపోగా మైనస్ 4.12 శాతంగా నమోదయ్యింది.
ఇలాంటి పరిస్థితిని ప్రతి ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. గత ఏడాది జూన్ నెల్లో హై బేస్ ఎఫెక్ట్ (16.23 శాతం) కూడా తాజా ప్రతిద్రవ్యోల్బణం పరిస్థితికి ఒక కారణం. ఈ తరహా పరిస్థితి నెలకొనడం వరుసగా ఇది మూడవనెల కావడం గమనార్హం. ఇక ఇంతటి స్థాయిలో ప్రతిద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్టం కావడం మరో విషయం. 2015 అక్టోబర్లో మైనస్ 4.76 ప్రతిద్రవ్యోల్బణం రికార్డయ్యింది.
మేలో 4.3 శాతం ఉన్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 4.8 శాతానికి పెరిగిన నేపథ్యంలోనే టోకు ధరలు భారీగా తగ్గడం గమనార్హం. అయితే ఆర్థికవ్యవస్థకు కీలకమైన రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) రేటు నిర్ణయానికి సెంట్రల్ బ్యాంక్ వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్నే ప్రామాణికంగా తీసుకునే సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment