డెయిరీ.. ఆపసో‘పాలు’!
20 శాతం దాకా తగ్గిన ఉత్పత్తి
• అధికమైన తయారీ వ్యయం
• ఇటీవలే రేట్లు పెంచిన పాల కంపెనీలు
• మరోమారు ధర పెరిగే అవకాశం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాల సరఫరా రోజురోజుకూ తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతోంది. చేస్తున్న వ్యయానికి తగ్గట్టుగా గిట్టుబాటు ధర రాకపోవడంతో పాడి రైతుల ఆసక్తి సన్నగిల్లుతుండడమే ప్రస్తుత పరిస్థితికి కారణం అవుతోంది. పెద్ద నోట్ల రద్దుతో రైతులకు రుణ లభ్యత క్లిష్టమైంది. చేతిలో డబ్బులు లేకపోవడంతో పశువులను విక్రయిస్తున్నారు. వచ్చిన సొమ్మును వ్యవసాయంపై ఖర్చు చేస్తున్నారు. ఇంకేముంది పాల డిమాండ్–సరఫరాలో అంతరం అధికమవుతోంది. ఇప్పటికే 20 శాతం దాకా ఉత్పత్తి పడిపోయింది. దీంతో విక్రయ కంపెనీలు పాల రేట్లను పెంచాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోమారు ధరలు పెంచాల్సిందేనని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.
ఒకదాని వెంట ఒకటి..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అమూల్, నందిని బ్రాండ్ల రాకతో పాల విపణిలో ఒక్కసారిగా కుదుపు వచ్చింది. తక్కువ ధరతో ఇవి ఎంట్రీ ఇవ్వడమే కారణం. ఈ బ్రాండ్ల ప్రవేశంతో ఇప్పటికే ఇక్కడ వ్యాపారం సాగిస్తున్న బ్రాండ్లు ధరలను తగ్గించాయి. ఆ తర్వాత పోటీపడి మరీ ఆఫర్లు ఇచ్చాయి. మార్కెట్ స్థిరపడగానే ఒకదాని వెంట ఒకటి తిరిగి రేట్లను పెంచుతూ పోయాయి. తిరిగి ఇటీవలే విజయ బ్రాండ్ లీటరు టోన్డ్ మిల్క్ ధరను రూ.38 నుంచి రూ.40కి చేసింది. నార్ముల్ సైతం రూ.2 పెంచడంతో ధర రూ.40కి చేరింది. తిరుమల పాల ధర రూ.40 నుంచి రూ.42 అయింది. ఇతర కంపెనీలు వీటి బాట పట్టనున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకు 28 లక్షల లీటర్ల పాల డిమాండ్ ఉంది. ఇందులో 22 లక్షల లీటర్లు ప్యాకెట్లలో అమ్ముడవుతున్నాయి.
లాభాలు తగ్గడంతో..
దాణా, పశుగ్రాసం, కూలీ రేట్లు.. ఇలా అన్నీ పెరుగుతూనే ఉన్నాయని నల్లగొండ–రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ యూనియన్ (నార్ముల్) చైర్మన్ జితేందర్‌రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘రైతులకు వ్యవసాయమే తొలి ప్రాధాన్యత. ఆ తర్వాతే పాడి. పెద్ద నోట్ల రద్దుతో రైతు వద్ద డబ్బులు లేకుండా పోయాయి. వ్యవసాయానికి ఖర్చు చేయడానికి చిల్లిగవ్వ లేక పశువులను అమ్ముకుంటున్నారు. ఇవన్నీ పాల ఉత్పత్తి తగ్గడానికి కారణమయ్యాయి. నగదు సరఫరా లేక పశువులను కొనేవారూ కొన్ని ప్రాంతాల్లో కరువయ్యారు’ అని అన్నారు.
పాల విక్రయ ధర పెరగకపోవడం, రైతుకు చెల్లించే ధరలో మార్పు లేకపోవడంతో కంపెనీల లాభాలు కుచించుకుపోయాయని చెప్పారు. దేశంలో రైతుకు ఒక లీటరుకు అధికంగా రూ.34 చెల్లిస్తున్న కంపెనీ తమదేనని గుర్తు చేశారు. ఇన్నాళ్లూ మార్కెట్లో పోటీ ఉండడంతో నెట్టుకొచ్చాం. తప్పనిసరి పరిస్థితుల్లో ధర పెంచామని ఆయన వెల్లడించారు. తమ సంస్థ రోజుకు 1,35,000 లీటర్ల పాలను సేకరించేదని, ఇప్పుడు సరఫరా తగ్గడంతో ఇది 1,15,000 లీటర్లకు వచ్చి చేరిందన్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 20 శాతం దాకా సరఫరా తగ్గిందని వెల్లడించారు.
కష్టాల్లో రైతన్న..
‘వ్యయాలు తడిసిమోపెడు అవుతున్నాయి. దాణా ధరలు దిగిరావడం లేదు. ప్రభుత్వం ప్రతి లీటరుకు చెల్లించే రూ.4 ప్రోత్సాహం ఇప్పుడు అందడం లేదు. ఆగస్టు నుంచి ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన మొత్తం బకాయి ఉంది. ప్రైవేటు డెయిరీలు లీటరుకు పాల నాణ్యతనుబట్టి రూ.24–27 చెల్లిస్తున్నాయి. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే సమస్య ఇక్కడి దాకా వచ్చేది కాదు’ అని మహబూబ్‌నగర్ జిల్లా చుక్మాపూర్ రైతు ఎలుక రామకృష్ణారెడ్డి అన్నారు.
లీటరుకు రూ.35 వస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యయాలకు తగ్గట్టుగా విక్రయ ధర పెరగకపోవడంతో కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతోందని జెర్సీ బ్రాండ్‌తో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న క్రీమ్‌లైన్ డెయిరీ ప్రొడక్ట్స్ ఎండీ కె.భాస్కర్ రెడ్డి తెలిపారు. పాల సరఫరా తగ్గితే మరోమారు ధరలను సవరించాల్సి వస్తుందని అన్నారు. పాడి రైతులకూ లాభసాటి తగ్గిందని అన్నారు. కొన్ని కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయని గుర్తు చేశారు. పాడి రైతుల విషయంలో ప్రభుత్వమే రంగంలోకి దిగి పెద్దన్న పాత్ర పోషించాలన్నారు.