కొండెక్కిన కూరగాయల ధరలు
వర్షాలకు తగ్గిన ఉత్పత్తులు
దిగిరాని టమాటా
విజయవాడ : కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. రైతు బజార్లలో నాసిరకం కూరగాయలు అమ్ముతున్నారు. గత కొద్దిరోజులుగా కూరలు ధరలు పెరుగుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రైవేటు మార్కెట్‌లో ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తూ జేబులు గుల్లజేస్తున్నారు. ఇరవై రోజుల కంటే కూరల ధరలు బాగా పెరిగాయి. విజయవాడ నగరంలో 5, జిల్లాలో 13 రైతుబజార్లు వున్నాయి. నగరంలో ఐదు రైతు బజార్లకు రోజుకు 5,500 క్వింటాళ్ల కూరగాయలు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వస్తుంటాయి.
కొద్ది రోజులుగా వెయ్యిన్నర క్వింటాళ్ల సరుకు మాత్రమే వస్తోంది. ఇదే విధంగా జిల్లాలో రైతు బజార్లలో కూడా సగానికి సగం ఉత్పత్తులు పడిపోయాయి. దీంతో ప్రవేటు మార్కెట్లలో రేట్లు విపరీతంగా పెంచేశారు. ఇక ఇళ్ల వద్ద పావు కిలో రూ.15 చొప్పున, కిలో అరవై రూపాయలకు విక్రయిస్తున్నారు. నెల రోజులుగా అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న టమాటా ధరలు ఇంకా దిగిరాలేదు. రైతు బజార్లలో ఇంకా కిలో రూ. 38లకు విక్రయిస్తున్నారు. ప్రైవేటు మార్కెట్‌ల్లో రూ. 60, షాపింగ్ మార్కెట్‌ల్లో రూ. 100కు విక్రయిస్తునే ఉన్నారు. ప్రైవేటు వ్యాపారులు రైతు బజార్ల రేట్లు కంటే అదనంగా మరో రెండు రెట్లు పెంచి కిలో రూ.60లకు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు.