సాక్షి,ముంబై: దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుముఖ పట్టాయి. బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 180 రూపాయల మేర పడిపోయింది. తద్వారా వరుస రెండు రోజుల లాభాలకు చెక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో స్టాకిస్టు, రిటైలర్ల కోనుగోళ్లు పడిపోవడంతో పసిడి ధర క్షీణతను నమోదు చేసింది. అటు వెండి కూడా వెండి ధర 540 రూపాయల మేర పడిపోయింది. స్టాండర్డ్ బంగారం (99.5 స్వచ్ఛత) రూ. 180 తగ్గి రూ .30,305 వద్ద ముగిసింది. 99.9 స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములకి 30,455 రూపాయల వద్ద ముగిసింది. వెండి కిలో 540 రూపాయలు పడిపోయి రూ .38,730 వద్ద ముగిసింది.
గత సెషన్‌లో రెండు నెలల్లో అతిపెద్ద వన్డే నష్టాన్ని పోస్ట్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బంగారం పతనమైంది. విదేశీ మార్కెట్లో శుక్రవారం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి దాదాపు 11 డాలర్లు(0.8 శాతం) క్షీణించి 1337 డాలర్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో వెండి మరింత అధికంగా ఔన్స్ 2.6 శాతం పడిపోయి 16.71 డాలర్ల వద్ద నిలిచింది. వెరసి గత వారం పసిడి ధర 1.1 శాతం నష్టపోగా.. వెండి 3.6 శాతం పడిపోయింది.
ముఖ్యంగా శుక్రవారం జనవరి నెలకు అమెరికా ఉపాధి గణాంకాలు వెలువడ్డాయి. 2009 తరువాత తొలిసారి అత్యంత వేగవంత వృద్ధిని అందుకుంటూ 2 లక్షల ఉద్యోగ కల్పన జరిగినట్లు వెల్లడైంది. దీంతో ఇకపై కంపెనీలు పెరగనున్న సిబ్బంది వ్యయాలకు అనుగుణంగా ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశమున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీయనుంది. మరోవైపు ఈ ఏడాది 2 శాతం లక్ష్యాన్ని చేరగలదని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ గత వారం నిర్వహించిన పాలసీ సమీక్షలో ఇప్పటికే పేర్కొనడంతో వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక వ్యవస్థ పటిష్టత వంటి అంశాలు ఇటీవల నీరసించిన డాలర్ బాగా పుంజుకుంది. ఈ ప్రభావంతో అంతర్జాతీయంగానూ, దేశీయంగా పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment