
రేటు కోతకు ‘ద్రవ్యోల్బణం’ మార్గం!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు- రెపో
టోకు సూచీ వరుసగా 16వ నెలలోనూ క్షీణత
♦ ఫిబ్రవరిలో -0.91 శాతంగా నమోదు
♦ రిటైల్ ద్రవ్యోల్బణమూ దిగువ బాటలోనే
♦ జనవరిలో 5.69 శాతంగా ఉన్న సూచీ ఫిబ్రవరిలో 5.18 శాతానికి డౌన్
♦ రేటుకోతకు ఇది తగిన సమయమని పారిశ్రామిక వర్గాల సూచన
♦ పారిశ్రామిక ఉత్పత్తి సైతం ‘మైనస్‌లో ఉన్న విషయం ప్రస్తావన
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు- రెపో (ప్రస్తుతం 6.75 శాతం) తగ్గింపునకు తగిన పరిస్థితులను తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు సృష్టిస్తున్నాయి. సోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం -0.91 శాతంగా నమోదయ్యింది. ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదల నమోదుకాకుండా మైనస్‌లోనే కొనసాగుతుండడం ఇది వరుసగా 16వ నెల. 2015 జనవరిలో ఈ రేటు -0.90 శాతం. 2016 ఫిబ్రవరిలో ఈ రేటు - 2.17 శాతం. ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం 2016 ఫిబ్రవరిలో (2015 ఇదే నెలతో పోల్చిచూస్తే) 5.18 శాతంగా నమోదయ్యింది.
ఈ ఏడాది జనవరిలో ఇది 5.69 శాతం. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) మూడు నెలలుగా క్షీణబాటన కొనసాగుతుండడం, దీనికితోడు తాజాగా టోకు, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం సానుకూల రీతిన నమోదుకావడం వంటి అంశాలు ఆర్‌బీఐ రెపో రేటు కోతకు మార్గం సుగమం చేస్తున్నాయని నిపుణుల విశ్లేషణ. దీనితో ఆర్థిక విశ్లేషకులు, విధాన నిర్ణేతల దృష్టి ఏప్రిల్ 5న ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం వైపునకు మళ్లింది. రేటు కోతకు ఇది తగిన సమయమని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 5 లేదా ఆ లోపే పావుశాతం రేటు కోత ఖాయమన్న అంచనాలూ వెలువడుతున్నాయి.
టోకున ‘మూడు’ భాగాలనూ చూస్తే...
ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్-ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 1.58 శాతంగా నమోదయ్యింది. 2015 ఫిబ్రవరిలో ఈ రేటు 1.01 శాతం. ఒక్క ఫుడ్ ఆర్టికల్స్‌ను చూస్తే... వార్షికంగా ఈ రేటు 7.83 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. జనవరిలో ఈ రేటు 6.02 శాతం. అయితే నాన్ ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో ద్రవ్యోల్బణం క్షీణత నుంచి (-5.64 శాతం) నుంచి బయటపడి 5.88 శాతంగా నమోదయ్యింది.
ఫ్యూయల్ అండ్ పవర్: క్షీణ రేటు -14.77 శాతం నుంచి - 6.40 శాతానికి చేరింది.
తయారీ: మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వరకూ వాటా ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణంలో - 0.58 శాతం క్షీణత నమోదయ్యింది. 2015 ఫిబ్రవరిలో ఈ విభాగం ద్రవ్యోల్బణం 0.26 శాతం.
పరిశ్రమల మాట ఇదీ...
ఫిక్కీ: తదుపరి రేటు కోత అవసరం. అంతేకాదు ఇప్పటి వరకూ రేటు కోత ద్వారా అందిన ప్రయోజనాలను కంపెనీలు, వినియోగదారులకు బ్యాంకింగ్ బదలాయించాలి. పెట్టుబడులు, వినియోగం విభాగాలు ఇంకా బలహీనంగా ఉన్న విషయాన్ని విధాన నిర్ణేతలు గుర్తెరగాలి.
అసోచామ్: స్థూల దేశీయోత్పత్తి పెరిగితేనే.. 2016-17లో ద్రవ్యలోటు 3.5 శాతం లక్ష్యసాధన సాధ్యమవుతుంది. రేటు కోత ద్వారానే చక్కటి వృద్ధి సాధ్యమవుతుంది.
రిటైల్ ‘ఊరట’
జనవరిలో 5.69 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.18 శాతానికి తగ్గింది. విభాగాల వారీగా చూస్తే...
♦ ఆహారం, పానీయాల ద్రవ్యోల్బణం 5.52 శాతంగా ఉంది. వేర్వేరుగా కొన్ని ముఖ్య ఆహార ఉత్పత్తులను చూస్తే... పప్పుదినుసుల ధరల పెరుగుదల 38 శాతంగా ఉంటే... కూరగాయల విషయంలో ద్రవ్యోల్బణం 0.7 శాతంగా నమోదయ్యింది. మాంసం చేపల ధరలు 7 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 10 శాతం ఎగశాయి. గుడ్ల ధరలు 6 శాతం పెరిగాయి. అయితే పండ్ల ధరలు మాత్రం 0.72 శాతం తగ్గాయి.
♦ పాన్, పొగాకు, ఇతర మత్తుప్రేరిత ఉత్పత్తుల సూచీ 8.39 శాతం ఎగసింది.
♦ దుస్తులు, పాదరక్షల ధరలు 5.52 శాతం ఎగశాయి
♦ హౌసింగ్ విషయంలో పెరుగుదల 5.33 శాతంగా ఉంది.
♦ ఇంధనం,లైట్ విషయంలో ద్రవ్యోల్బణం 4.59 శాతం పెరుగుదల నమోదయ్యింది.