రిలయన్స్ రికార్డు లాభం
క్యూ1లో రూ. 5,957 కోట్లు
ఒక త్రైమాసికంలో బిలియన్ డాలర్లు ఆర్జించిన తొలి ప్రైవేట్ కంపెనీ
అధిక రిఫైనింగ్ మార్జిన్లు, షేల్ గ్యాస్ వ్యాపారం ఊతం
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయి నికర లాభాలు ఆర్జించాం. ప్రాంతీయంగా అంతటా రిఫైనింగ్ మార్జిన్లు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ.. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి దీన్ని సాధించగలిగాం. పెట్రోకెమికల్స్ విభాగం పనితీరు వ్యాపార వైవిధ్యంలో రిలయన్స్‌కి ఉన్న బలాన్ని తెలియజేస్తుంది. మరెన్నో కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నాం. పోటీ సంస్థల కన్నా ముందుండేందుకు ఇవి తోడ్పడతాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్లతో పాటు కొత్త మార్కెట్లకూ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించనున్నాం. - ముకేశ్ అంబానీ, సీఎండీ, ఆర్‌ఐఎల్
పెట్టుబడి ప్రణాళికలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 35,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు, ఇప్పటికే క్యూ1లో రూ. 8,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు రిలయన్స్ తెలిపింది. అలాగే, ఇంధన రిటైల్ వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో పునఃప్రారంభించేందుకు తగిన సమయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించింది. తమ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కార్యకలాపాలను త్వరలో ప్రారంభించే దిశగా ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు, ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపింది.
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రికార్డు లాభం ఆర్జించింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో 13.7% వృద్ధితో రూ. 5,957 కోట్లు నమోదు చేసింది. తద్వారా ఒక త్రైమాసికంలో ఒక బిలియన్ డాలర్ల మేర ఆర్జించిన తొలి ప్రైవేట్ సంస్థగా నిల్చినట్లయిందని కంపెనీ తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లాభం రూ. 5,237 కోట్లు. షేరువారీగా చూస్తే లాభం రూ. 17.8 నుంచి రూ. 20.3కి చేరినట్లవుతుందని కంపెనీ తెలిపింది. మరోవైపు టర్నోవరు 7.2% వృద్ధితో రూ. 1,07,905 కోట్లకు చేరింది. అధిక రిఫైనింగ్ మార్జిన్లు, పెట్రోకెమికల్ వ్యాపార ఆదాయం పెరగడం, అమెరికాలో షేల్ గ్యాస్ వ్యాపారం పుంజుకోవడం రికార్డు ఫలితాలకు తోడ్పడ్డాయని సంస్థ చైర్మన్ ముకేశ్ తెలిపారు.
8.4 డాలర్లుగా జీఆర్‌ఎం..
ముడిచమురును శుద్ధి చేసి ఇంధనంగా మార్చినందుకు గాను కంపెనీకి ప్రతి బ్యారెల్‌పై లభించే స్థూల రిఫైనింగ్ మార్జిను (జీఆర్‌ఎం) 8.4 డాలర్ల నుంచి 8.7 డాలర్లకు పెరిగింది. అయితే, జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 9.3 డాలర్ల నుంచి తగ్గింది. మరోవైపు, రిఫైనరీ వ్యాపారం ఆదాయాలు 7.2%, పెట్రోకెమికల్ విభాగం ఆదాయాలు 9.3% మేర ఎగిశాయి. చమురు, గ్యాస్ ఉత్పత్తి విభాగం ఆదాయం అత్యధికంగా 27.3% మేర ఎగిసింది. అమెరికాలోని షేల్ గ్యాస్ వ్యాపారం పుంజుకోవడమే ఇందుకు కారణం. కాగా పెట్రోకెమికల్ వ్యాపారం నుంచి 25,398 కోట్లు. చమురు, గ్యాస్ వ్యాపార విభాగం ఆదాయాలు రూ. 3,178 కోట్లు వచ్చాయి.
మరిన్ని విశేషాలు..
* 7.2 శాతం వృద్ధితో రూ. 98,081 కోట్లకు రిఫైనరీ వ్యాపార ఆదాయం.
* జామ్‌నగర్ రిఫైనరీలో 16.7 మిలియన్ టన్నుల మేర చమురు ప్రాసెసింగ్ జరిగింది.
* కేజీ-డీ6 క్షేత్రంలో 1 శాతం క్షీణించి 0.53 మిలియన్ బ్యారెళ్లకు తగ్గిన చమురు ఉత్పత్తి, 15 శాతం క్షీణించి 42 బిలియన్ ఘనపు అడుగులకు క్షీణించిన గ్యాస్ ఉత్పత్తి.
* పన్నులకు ముందు రూ. 81 కోట్ల మేర లాభాలు నమోదు చేసిన రిటైల్ వ్యాపారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 148 నగరాల్లో 1,723 స్టోర్ల కార్యకలాపాలు. టర్నోవర్ 15శాతం వృద్ధితో రూ.3,999 కోట్లకు అప్.
* కంపెనీ నగదు నిల్వలు రూ. 81,559 కోట్లు.
* మార్చి 31 నాటితో పోలిస్తే రూ. 1,38,761 కోట్ల నుంచి జూన్ 30 నాటికి రూ. 1,35,769 కోట్లకు తగ్గిన రుణభారం.
* దేశీయంగా చమురు, గ్యాస్ విభాగం నుంచి కంపెనీకి రూ. 1,557 కోట్లు మాత్రమే రాగా.. అమెరికా షేల్ గ్యాస్ ద్వారా అంతకన్నా ఎక్కువగా రూ. 1,617 కోట్లు వచ్చాయి.