
5 నెలల కనిష్టానికి టోకు ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ జూలైలో తగ్గింది. ఈ నెలలో ఈ రేటు 5.19 శాతంగా నమోదయ్యింది. జూన్‌లో ఈ రేటు 5.43 శాతం. అంటే టోకు ధరలు వార్షికంగా చూస్తే (2013 సంబంధిత నెలలతో పోల్చిచూస్తే ధరల పెరుగుదల తీరు) జూన్‌లో 5.43 శాతం ఉంటే, అది జూలైలో 5.19 శాతానికి తగ్గిందన్నమాట. టోకు ధరలకు సంబంధించిన మూడు ప్రధాన విభాగాల్లో ఒకటైన ఆహార ద్రవ్యోల్బణం రేటు మాత్రం పెరగడం ఆందోళన కలిగించే విషయం.
ఈ నిర్దిష్ట విభాగంలో ధరల స్పీడ్ జూన్‌లో 8.14 శాతం ఉంటే, జూలైలో ఇది 0.29 బేసిస్ పాయింట్లు ఎగసి (100 బేసిస్ పాయింట్లు 1 శాతానికి సమానం) 8.43 శాతంగా నమోదయ్యింది. మొత్తంగా చూస్తే జూన్ నెలతో పోల్చితే, జూలై నెలలో ఇంధనం-విద్యుత్ విభాగం ద్రవ్యోల్బణం తగ్గడం మొత్తం టోకు సూచీపై కొంత సానుకూల ప్రభావం చూపింది.
నిత్యావసరాల ధరలు ఇలా...
వార్షిక ప్రాతిపదికన కూరగాయల ధరలు జూలైలో స్వల్పంగా తగ్గినట్లు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. అంటే 2013 జూలై నెలతో పోల్చితే 2014 జూలై నెలలో కూరగాయల ధరలు టోకుగా 1.27 శాతం తక్కువగానే ఉన్నాయి. ఉల్లిపాయల ధరలు సైతం 8.13 శాతం తగ్గాయి. తృణధాన్యాలు (4.46%), పప్పు దినుసులు (3.31%), బియ్యం (6.85%), పండ్లు (31.71%), గోధుమలు (1.02%), ఆలూ (46.41%), పాలు (10.46%), ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం,చేపల (2.71) ధరలు పెరిగాయి.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసర ధరల తీవ్రత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా సరఫరాల వైపు సమస్యల పరిష్కరించకపోతే, వినియోగదారునికి నిత్యావసర వస్తువు చేరే సరికి అది మరింత భారమవుతుందన్న ఆందోళన ఉంది. సరఫరాల సమస్య పరిష్కారమయితేనే ఆహార ద్రవ్యోల్బణం దిగివస్తుందని, ఇందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక రంగం కోరుతోంది.
మూడు విభాగాల తీరిది...
{పైమరీ ఆర్టికల్స్‌లో వార్షిక తీరున టోకు ద్రవ్యోల్బణం జూలైలో 6.78%గా ఉంది. (జూన్‌లో 5.43%) ఇందులో రెండు ప్రధాన కేటగిరీలైన ఫుడ్ ఆర్టికల్స్ 8.43%గా ఉంది. మరో కేటగిరీ నాన్- ఫుడ్ ఆర్టికల్స్ రేటు 3.32%గా ఉంది.
ఇంధనం, విద్యుత్ రేటు 7.4%గా ఉంది (జూన్‌లో 9.04 శాతం) తయారీ విభాగం రేటు 3.67 శాతంగా నమోదయ్యింది. (జూన్‌లో 3.61 శాతం)