న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2018 జూలైలో 5.09 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 జూలైతో పోల్చితే 2018 జూలైలో ఈ బాస్కెట్ మొత్తం ధర 5.09 శాతం పెరిగిందన్నమాట. ఫుడ్ ఆర్టికల్స్ ప్రత్యేకించి పండ్లు, కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. 2017 జూలైలో టోకు ద్రవ్యోల్బణం 1.88 శాతం ఉంటే, 2018 జూన్‌లో 5.77 శాతంగా ఉంది.
టోకున ఆహార ఉత్పత్తుల ధరలు...
♦ ప్రైమరీ ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో 2018 జూన్ నెలలో 1.8 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, జూలై నెలలో అసలు ధర పెరక్కపోగా –2.16 శాతం తగ్గింది.
♦ ఫుడ్ ఆర్టికల్స్‌లో కూరగాయల ధరలు జూన్‌లో 8.12% పెరిగితే, జూలై నెలలో –14.07% తగ్గాయి.
♦ పండ్ల ధరలు జూన్‌లో 3.87 శాతం పెరిగితే, తరువాతి నెలలో 8.81 శాతం తగ్గాయి.
♦పప్పు దినుసుల కేటగిరీలో ధరలు –17.03 శాతం క్షీణించాయి. అంతక్రితం నెలలో ఈ క్షీణత –20.23 శాతంగా ఉంది.
♦ కూరగాయలు, పండ్లు, పప్పు దినుసుల ధరలు తగ్గడం వల్ల ప్రైమరీ ఫుడ్ ఆర్టికల్స్ విభాగం 3 నెలల తరువాత మళ్లీ ‘డిస్‌ఇన్‌ఫ్లెషన్’లోకి జారుకుంది.
♦ నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగానికి వస్తే, ద్రవ్యోల్బణం 3.81 శాతం నుంచి 3.96 శాతానికి పెరిగింది.
♦ ఇంధనం, తయారీ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు భారీగా 18.10 శాతంగా ఉంది.
♦ డబ్ల్యూపీఐ సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం రేటు 4.26 శాతం.
రిటైల్ ధరలు తగ్గే చాన్స్: బ్యాంక్ ఆఫ్ అమెరికా
కాగా వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.8గా నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్ మంగళవారం వెలువరించిన ఒక నివేదికలో అభిప్రాయపడింది.
ద్రవ్యోల్బణం తన లక్ష్యానికి అనుగుణంగా ఉండటంతో (2 ప్లస్, 2 మైనస్‌కు లోబడి 4 శాతం వద్ద) అక్టోబర్ పాలసీ సందర్భంగా బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు రెపో (ప్రస్తుతం 6.5 శాతం)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పెంచకపోవచ్చని కూడా అభిప్రాయపడింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 4.17 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఇది తొమ్మిది నెలల కనిష్ట స్థాయి.
Comments
Please login to add a commentAdd a comment