క్షీణతలోనే టోకు ధరలు
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో వరుసగా 15వ నెలలోనూ అసలు పెరగకపోగా.. క్షీణతలో (మైనస్) కొనసాగింది. - 0.9 శాతం క్షీణత నమోదయ్యింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తక్కువగా ఉండడం, ఈ ప్రభావం ప్రధానంగా కమోడిటీ ఆధారిత తయారీ ఉత్పత్తుల మీదా ఉండడం, దేశంలో మందగమన ధోరణి అన్నీ కలిసి టోకు ద్రవ్యోల్బణాన్ని 15 నెలలుగా క్షీణతలో ఉంచుతున్నాయి. అయితే సెప్టెంబర్ నుంచి క్రమంగా టోకు ద్రవ్యోల్బణం క్షీణ బాట నుంచి పెరుగుదల దారికి మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తుండడం గమనార్హం.
డిసెంబర్‌లో ఈ రేటు -0.73 శాతంగా నమోదయ్యింది. నవంబర్‌లో ఈ రేటు -2.04 శాతం. అక్టోబర్, సెప్టెంబర్‌లలో ఈ రేటు -4 శాతం వరకూ ఉంది. టోకు ద్రవ్యోల్బణంలోని ప్రధాన మూడు భాగాలనూ పరిశీలిస్తే... ఆహార, ఆహారేతర ఉత్పత్తులకు సంబంధించి ప్రైమరీ ఆర్టికల్స్ విభాగంలో 4.63 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఇందులో భాగమైన ఒక్క ఆహార విభాగాన్ని తీసుకుంటే టోకున ద్రవ్యోల్బణం 6.02 శాతంగా ఉంది. ఆహారేతర విభాగంలో ద్రవ్యోల్బణం 4.63 శాతంగా నమోదయ్యింది.