ఈ ఏడాది చివరికల్లా 8,650 పాయింట్లకు నిఫ్టీ!
ముంబై: ఈ ఏడాది చివరికల్లా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ ‘నిఫ్టీ’ 8,650 పాయింట్లకు చేరే అవకాశమున్నదని ఆర్‌బీఎస్ ప్రైవేట్ వెల్త్ అంచనా వేసింది. ఇందుకు ప్రభుత్వ సంస్కరణలు, వర్థమాన మార్కెట్లలో ఇండియాకున్న సానుకూలతలు దోహదం చేస్తాయని పేర్కొంది. డిసెంబర్‌కల్లా నిఫ్టీ 7,700 పాయింట్లను తాకవచ్చునంటూ ఈ జనవరిలో ఆర్‌బీఎస్ అంచనా వేసిన విషయం విదితమే. అయితే ఇండియా మార్కెట్లు అత్యంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొంటూ తాజాగా అంచనాలను దాదాపు 1,000 పాయింట్ల వరకూ పెంచడం గమనార్హం.
ఆర్థిక వ్యవస్థ పుంజుకునే పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లపట్ల బుల్లిష్‌గా ఉన్నట్లు తెలిపింది. దేశీ స్టాక్స్‌పట్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) చూపుతున్న ఆసక్తి కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 10న వెలువడనున్న బడ్జెట్ మార్కెట్లకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. వెరసి డిసెంబర్‌కల్లా నిఫ్టీ 8,650 పాయింట్లను తాకే చాన్స్ ఉన్నదని ఆర్‌బీఎస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ రాజేష్ చెరువు చెప్పారు.
2003నాటి పరిస్థితులు: ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని, ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటులకు చెక్ పడుతుందని రాజేష్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన మార్కెట్లతో పోలిస్తే దేశీ స్టాక్స్ చౌకగానే ట్రేడవుతున్నాయన్నారు. వెరసి 2003 నాటి దీర్ఘకాలిక బుల్‌ట్రెండ్ పరిస్థితులకు అవకాశముందని వ్యాఖ్యానించారు. మోడీ సర్కారు తీసకొస్తున్న సంస్కరణలు ఇతరత్రా అంశాలతో ఇండియా మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.