ఫోర్బ్స్ శక్తివంత మహిళల జాబితా..
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన 100 మంది మహిళల జాబితాలో ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ చందా కొచర్‌లకు స్థానం లభించింది. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో ఉన్న ఈ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలకు చోటుదక్కింది. భట్టాచార్యకు 36వ ర్యాంకు, కొచర్‌కు 43వ ర్యాంకు లభించాయి. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా 92వ స్థానంలో నిలిచారు. పెప్సీకో చీఫ్ ఇంద్రా నూయి 13వ స్థానంలో, సిస్కో చీఫ్ టెక్నాలజీ, స్ట్రాటజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్ 71వ స్థానంలో ఉన్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ ఎల్లెన్ (రెండో స్థానం), మానవతావాది మెలిండా గేట్స్ (3), హిల్లరీ క్లింటన్ (6), జనరల్ మోటార్స్ తొలి మహిళా సీఈఓ మేరీ బారా (7), అమెరికా తొలి మహిళ మిషెల్ ఒబామా, ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బెర్గ్(9) తొలి పది స్థానాలో ఉన్నారు.
దాదాపు 38 వేల కోట్ల డాలర్ల ఆస్తులు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథిగా భట్టాచార్య ఆసియా ఉపఖండంలోనే అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్నారని ఫోర్బ్స్ ప్రశంసించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్, ట్రెజరీ, రిటైల్ ఆపరేషన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వంటి వివిధ రంగాల్లో ఆమె విశేష సేవలందించారని తెలి పింది. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన 12,500 కోట్ల డాలర్ల ఆస్తులను చందా కొచర్ పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇక్కట్లను ఎదుర్కొన్న ఐసీఐసీఐ బ్యాంకును ఆమె గాడిన పెట్టారని తెలిపింది.