Sheryl Sandberg
-
Sheryl Sandberg: మాజీ బాయ్ ఫ్రెండ్కోసమే మెటాకు షాక్?
న్యూఢిల్లీ: ఫేస్బుక్ మెటా సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ ఆకస్మిక నిష్క్రమణ టెక్ వర్గాల్లో సంచలనం రేపింది. సంస్థనుంచి వైదొలగుతున్నట్టు ఆకస్మికంగా ప్రకటించారు. అయితే భవిష్యత్తును ఇంకా నిర్ణయించుకోనప్పటికీ, ప్రధానంగా కుటుంబానికి, సేవా కార్యక్రమాలకు తన సమయాన్ని కేటాయిస్తానని ఫేస్బుక్లో తెలిపారు. అలాగే ఎగ్జిక్యూటివ్ బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగుతాని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ప్రతీ కష్టమైన, కీలకమైన సమయాల్లో అండగా నిలిచారంటూ మార్క్ జుకర్‌బర్గ్‌ను ప్రశంసించారు. 2008లో ఉద్యోగంలో చేరినప్పుడు, ఐదేళ్లపాటు పనిచేస్తా అనుకున్నాను. కానీ పద్నాలుగేళ్లు జర్నీ కొనసాగింది. తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభిచేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. మాజీ బాయ్ ఫ్రెండ్ కోసమేనా? ఎవరీ బాబీ కోటిక్? అయితే మార్క్ జుకర్‌బర్గ్ సన్నిహితురాలు, తొలినాళ్లలో ఫేస్బుక్ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన షెరిల్ శాండ్‌బర్గ్ 14 సంవత్సరాల తరువాత కంపెనీనీ వీడటం చాలామందికి ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో షెరిల్ నిర్ణయానికి మాజీ ప్రియుడు బాబీ కోటిక్ కారణమా అనే ఊహాగానాలు మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. శాండ్‌బెర్గ్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నప్పటికీ ఇటీవలికాలంలో వచ్చిన తీవ్ర ఆరోపణలు ఈ పరిణామానికి దారితీశాయని విశ్లేషకులు అభిప్రాయం. తన స్నేహితుడు, యాక్టివిజన్ బ్లిజార్డ్ ప్రస్తుత సీఈవో బాబీ కోటిక్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తిప్పి కొట్టేందుకు తన పలుకు బడిని ఉపయోగించి శాయశక్తులా కృషి చేశారంటూ ఇటీవల ఆరోపణలు చెలరేగాయి. ఈ మేరకు 2022 ఏప్రిల్‌లో, వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే దీనిపై అంతర్గత విచారణ చేపట్టినప్పటికీ, ఆరోపణలన్నింటినీ మెటా బహిరంగంగానే ఖండించింది. జేవియర్ ఒలివాన్ (ఫైల్ ఫోటో) షెరిల్ శాండ్‌బర్గ్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు? ఒక శకం ముగిసిందంటూ షెరిల్ రాజీనామాను సోషల్‌మీడియా వేదికగా ప్రకటించిన జుకర్‌బర్గ్ ప్రస్తుతం శాండ్‌బర్గ్ ప్లేస్‌లో ఇంకా ఎవరిని ప్లాన్ చేయలేదని తొలుత పేర్కొన్నారు. కానీ ఆ తరువాత చీఫ్ గ్రోత్ ఆఫీసర్ జేవియర్ ఒలివాన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రత్యేక ఫేస్బుక్ పోస్ట్‌లో వెల్లడించారు. -
ఇంటింటికీ రిక్వెస్ట్; ఆఫీసుకు పంపండి
ఈ ఏడాదిన్నరలో ఎంతోమంది మహిళలు.. కేవలం ఇంటిని చూసుకోవడం కోసం ఉద్యోగాలు మానేయవలసి వచ్చింది! వాళ్లను మళ్లీ ఉద్యోగాలలోకి రప్పించడం కోసం బెంగళూరు ‘లీన్ఇన్’ కంపెనీలో నెట్వర్క్ లీడర్‌గా పని చేస్తున్న స్ఫూర్తి అనే యువతి ఇంటింటికీ వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఒప్పించి ఆ ఉద్యోగినులను మళ్లీ ఆఫీసులకు రప్పిస్తోంది. ఇల్లు చేదోడుగా ఉంటే స్త్రీ ఆ ఇంటికి ఎంత చేయూతగా ఉంటుందో కొన్ని కుటుంబాలను ఉదాహరణగా చూపిస్తోంది. ఆమె చేస్తున్న ఈ ప్రయత్నంతో.. చీకటి పడగానే ఒకటొకటిగా ఇళ్లలోని లైట్లు వెలిగిన విధంగా తిరిగి ఉద్యోగాలలో చేరుతున్న మహిళల చిరునవ్వుతో కుటుంబాలు కాంతిమంతం అవుతున్నాయి. ఫేస్బుక్ సీవోవో కూడా స్ఫూర్తి చేస్తున్న ప్రయత్నానికి ముగ్ధురాలై ఆమె గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందనగా స్ఫూర్తిదాయకమైన పోస్ట్ పెట్టారు. షెరిల్ శాండ్‌బర్గ్ (51) వాషింగ్టన్లో ఉంటారు. ‘ఫేస్బుక్’ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆమె. ఇక స్ఫూర్తి బెంగళూరులో ఉంటుంది. అక్కడి ‘లీన్ఇన్’ కంపెనీలో స్ఫూర్తి నెట్వర్క్ లీడర్. మహిళలకు మద్దతుగా ఉండి, వారిని వారి లక్ష్యాలకు నడిపించే లాభాపేక్ష లేని సంస్థ లీన్ఇన్. శాండ్బర్గే స్వయంగా ఈ సంస్థను ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించారు. దాదాపు అన్ని దేశాల్లోనూ లీన్ఇన్ ఉంది. అయితే బెంగళూరులోని లీన్ఇన్లో మాత్రమే స్ఫూర్తి వంటి అమ్మాయి ఉంది! ఇలా చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఉద్యోగినులకు ఇంటి పనిలో ఏమాత్రం సహాయం లభించకపోగా, వారు గడప దాటితే గృహ భ్రమణం ఆగిపోయే పరిస్థితి అన్ని దేశాలలో ఉన్నప్పటికీ.. మనదేశంలో మరికాస్త ఎక్కువ అనిపించేలా గత ఏడాదిన్నరగా అనేక మంది మహిళలు కుటుంబం కోసం ఉద్యోగాలు మాని ఇంటికే పరిమితం అవవలసి వచ్చింది. స్ఫూర్తి వారందరినీ తిరిగి ఆఫీసులకు మళ్లించారు! అందుకే ఆమె శాండ్‌బర్గ్ దృష్టిలో పడ్డారు. స్ఫూర్తితో పాటు మహిళా ఉద్యోగులు కొందరు చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. స్ఫూర్తి ప్రయత్నాన్ని ప్రశంసించారు. నిజానికి ఇది స్ఫూర్తికి.. కంపెనీ అప్పగించిన బాధ్యత కాదు. ఆమెకై ఆమె చొరవ తీసుకుని ఇల్లిల్లూ తిరిగి సాధించిన ఘనత. అవును ఘనతే. బడి మానిన పిల్లల్ని తిరిగి బళ్లో చేర్పించడం వంటిదే.. ఉద్యోగం మానిన మహిళల్ని తిరిగి ఆఫీస్‌కి రప్పించడం! ఇంట్లో అనుకూలత లేకనే కదా ఆడపిల్లలు చదువు మానినా, గృహిణులు ఉద్యోగం మానినా. స్ఫూర్తి ఏం చేసిందంటే.. చక్కగా చదువుతోంది కదా ఎంత కష్టమైనా గాని పిల్లను బడి మాన్పించకండి అని తల్లిదండ్రులకు టీచర్లు చెప్పే విధంగానే.. ‘‘ఇంటిపనిలో మీరూ ఓ చెయ్యేస్తే ఆమెకు ఉద్యోగం మానే పరిస్థితి రాదు కదా..’’ అని కుటుంబ సభ్యులకు నచ్చ చెబుతోంది. స్ఫూర్తి మాట్లాడ్డం మృదువుగా, ఒప్పించేలా ఉంటుంది. లీన్ఇన్లో పనిచేసేవాళ్లంతా ఇదే విధంగా ఉంటారు. లీన్ఇన్లో ప్రధానంగా వాళ్లు చేస్తుండే పని ఆలోచన–ఆచరణ. మహిళలకు మద్దతుగా ఉండటం కోసం, మహిళల్ని వాళ్ల లక్ష్యాలకు దగ్గరగా చేర్చడం కోసం, మహిళల్ని సాధికార సాయుధులుగా మలచడం కోసం వర్తమాన సామాజిక అనుకూలతలు, ప్రతికూలతలను అనుసరించి ఒక ప్రణాళికను ఆలోచిస్తారు. ఆలోచనను ఆచరణలో పెడతారు. లాక్డౌన్లో ఉద్యోగినులకు ఇటు ఇంటిపనీ, అటు ఆఫీస్ పనీ ఎక్కువైంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగాలు మానేయడం మొదలుపెట్టారు! ఇంటికి ఆర్థికం గా నష్టం. సమాజానికి అభివృద్ధి పరంగా నష్టం. ఈ సంగతిని త్వరగా కనిపెట్టి, త్వరగా చక్కదిద్దడానికి కార్యోన్ముఖం అయింది స్ఫూర్తి. ఈ ఏడాదిన్నరలో బెంగళూరులో ఉద్యోగం మానేసిన వారు వందల్లో ఉన్నారని ఒక సర్వే ద్వారా తెలుసుకున్న స్ఫూర్తి వాళ్లను తిరిగి ఉద్యోగాలకు చేర్చడానికి ఒక నెట్‌వర్క్‌ను సిద్ధం చేసి వాళ్ల ఇళ్లకు పంపించింది. ఉద్యోగం మానిన వారిలో స్ఫూర్తి కో–వర్కర్స్ కూడా ఉన్నారు! వాళ్ల బాధ్యతను తను తీసుకుంది స్ఫూర్తి. వాళ్లంతా ఇప్పుడు ఉద్యోగాల్లోకి వచ్చేశారు. వెళ్లిన చోట స్ఫూర్తి చెప్పిన మాట ఒకటే. ‘‘చూడండి.. మీరు తనకు ఇంటి పనిలో సహాయం చేస్తుంటే.. ఆఫీస్ పనిని ఆమె సునాయాసంగా చేయగలదు. ఏ ఇల్లయినా ఒక ఉద్యోగాన్ని అనవసరంగా ఎందుకు కోల్పోవాలి?’’ అని ఇంటిల్లిపాదినీ ఒప్పించింది. అలాగే పనిని షేర్ చేసుకునే నమూనా ఇళ్లు ఎంత ఆనందంగా గడుపుతున్నాయో ఉదాహరణలు ఇచ్చింది. ‘‘థ్యాంక్యూ స్ఫూర్తీ.. ఇలాంటి క్లిష్ట సమయంలో మనం ఎలా ఉండాలో చూపించావు’ అనే మాటతో ఇన్‌స్టాగ్రామ్‌లో శాండ్‌బర్గ్ తన అభినందన పోస్ట్‌ను ముగించారు. ఫేస్బుక్ సీవోవో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో స్ఫూర్తి (ఎడమ నుంచి రెండు) -
ఫియాన్సికి ఫేస్బుక్ సీఓఓ భావోద్వేగ లేఖ
వాషింగ్టన్: ఫేస్బుక్ రెండో అత్యున్నత అధికారి షెరిల్ శాండ్‌బర్గ్ తన కాబోయే భర్త టామ్ బెర్న్తాల్‌కు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. మొదటి భర్త చనిపోయిన బాధలో ఉన్న తనకు తోడుగా నిలిచి.. తన జీవితంలో మరో సారి ప్రేమను వికసింపజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు షెరిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘2015లో నా భర్త డేవ్ చనిపోయారు. దాంతో నా ప్రపంచం అంతా తలకిందులు అయిపోయింది. డేవ్ నన్ను ఎంతో ప్రేమించాడు. నా జీవితంలో అంతలా ప్రేమించే వ్యక్తిని మళ్లి కలుస్తానని అనుకోలేదు. కానీ డేవ్ సోదరుడు రాబ్ నా గురించి చాలా ఆలోచించాడు. దానిలో భాగంగానే తన స్నేహితుడు టామ్ బెర్న్తాల్‌ని నాకు పరిచయం చేశాడు. ఆ తర్వాత నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది’’ అన్నారు. ‘‘డేవ్‌ని కోల్పోయి బాధపడుతున్న నన్ను టామ్ ఓదార్చాడు. నాకు ధైర్యం చెప్పాడు. డేవ్ నన్ను ఎంతలా ప్రేమించేవాడో.. టామ్ అంతకన్నా ఎక్కువ ప్రేమను పంచాడు. టామ్‌తో కలిసి ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. తన ప్రేమ నాలో ఉన్న పాత ఆలోచనల్ని తప్పని నిరూపించింది. మనల్ని ప్రేమించిన వారు దూరమైతే బాధపడటం సహజం. కానీ వారి కన్నా అధికంగా ప్రేమించే వారు తారసపడితే.. వారితో ముందుకు సాగడం ఎంతో ఉత్తమం. వారి ప్రేమ మన సంతోషాల్ని తిరిగి తెస్తుంది. నా విషయంలో ఇదే జరిగింది. రెండు కుటుంబాల ఆమోదంతో మేం కొత్త మార్గంలో ముందుకు సాగనున్నాం. ఈ దారి కృతజ్ఞతలు, ఆశవాదంతో నిండింది. జీవితంలో ప్రేమించిన వారిని కోల్పోయి నిరాశలో కూరుకుపోయిన వారిలో ఈ లెటర్ నమ్మకం నింపుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. తన బహిరంగ లేఖలో షెరిల్ శాండ్‌బర్గ్ తన కాబోయే భర్త టామ్‌కు గల అనేక మంచి లక్షణాలను వివరించారు. భాగస్వామిగా, తన బిడ్డలకు మంచి తండ్రిగా ఉంటాడని తెలిపారు. తన పిల్లల జీవితాలలో పాలుపంచుకున్నందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు. "నిజం, నువ్వు నా జీవితంలోకి రాక ముందు నేను చాలా అలసిపోయాను టామ్... కానీ నిన్ను కలిశాక మనం ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నాము" అంటూ రాసుకొచ్చారు. మొదటి భర్తను కోల్పోయిన బాధ తన హృదయంలో అలాగే ఉంటుందని ఒప్పుకున్నారు షెరిల్. "మీకు నా బాధ తెలుసు, మీరు దానిని అర్థం చేసుకుని, గౌరవించారు. ఈ విషయం మిమ్మల్ని మరింత ప్రేమించేలా చేసింది" అన్నారు షెరిల్. ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయిన షెరిల్ శాండ్‌బర్గ్, టామ్‌తో తన నిశ్చితార్థం జరిగినట్లు గతేడాదే ప్రకటించారు. టామ్ బెర్న్తాల్ మార్కెటింగ్ సంస్థ కెల్టన్ గ్లోబల్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. చదవండి: సోషల్‌మీడియాకు భారీ షాక్! కొత్త నిబంధనలు ఫేస్బుక్ వర్సెస్ ఆస్ట్రేలియా -
నువ్వే నా సర్వస్వం - ఫేస్బుక్ సీవోవో
శాన్ఫ్రాన్సిస్కో : ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‌బర్గ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. నిశ్చితార్థం చేసుకున్నట్లు సోమవారం ప్రకటించారు. ఫేస్బుక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టరైన తొలి మహిళగా, టెక్నాలజీ రంగంలో అతి శక్తివంతమైన మహిళగా ఖ్యాతి గడించిన షెరిల్ భర్త పోయిన దాదాపు ఐదేళ్ల తర్వాత పునర్వివాహ నిశ్చితార్థం చేసుకున్నట్లు ఫేస్బుక్, ఇన్స్ట్రా పోస్ట్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఫేస్బుక్ సీఈవో తర్వాత తన ప్రతిభతో నెంబర్ 2 ఎగ్జిక్యూటివ్‌గా కొనసాగుతున్నారు షెరిల్. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టామ్ బెర్న్తాల్‌ని మనువాడబోతున్నట్టు వెల్లడించారు. "ఎంగేజ్మెంట్..టామ్ బెర్న్తాల్ నువ్వే నా సర్వస్వం. ఇంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించలేను" అంటూ ఆమె తన ప్రేమను ప్రకటించారు. అటు ఈ శుభపరిణామంపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్పందించారు. మీరు ఒకరికొకరు అద్భుతంగా ఉన్నారు, చాలా సంతోషమంటూ శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు షెరిల్ హితులు, సన్నిహితులు, ఇతర వ్యాపార వర్గాల అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి. శాండ్బర్గ్కు ఆమె మునుపటి వివాహం నుండి ఇద్దరు పిల్లలుండగా, ఇప్పటికే విడాకులు తీసుకున్న బెర్న్తాల్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. దీనికి సింబాలిక్‌గా వారి ఐదుగురు పిల్లలలో ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం వహించేలా ఐదు వజ్రాలతో పొదిగిన రింగ్‌ను రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. డేవిడ్ గోల్డ్బర్గ్ సోదరుడు ద్వారా ఒకరినొకరు పరిచయమైన ఈ జంట గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారట. లాస్ ఏంజెల్స్‌కు చెందిన కెల్టెన్ గ్లోబల్ ఫౌండర్, సీఈవో బెర్న్తాల్ , ప్రముఖ నటుడు, జాన్ బెర్న్తాల్ సోదరుడు. కాగా 1969 ఆగస్టు 28 న జన్మించిన శాండ్‌బర్గ్ 51 వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఫెమినిస్ట్ బెస్ట్ సెల్లర్ "లీన్ ఇన్" రచయిత అయిన షెరిల్ భర్త, ఆన్లైన్ పోలింగ్ సంస్థ సర్వేమన్కీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గోల్డ్బర్గ్ (47) మెక్సికోలో 2015 లో ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. View this post on Instagram Engaged!!! @tom_bernthal, you are my everything. I could not love you more. A post shared by Sheryl Sandberg (@sherylsandberg) on Feb 3, 2020 at 10:00am PST -
ఫేస్బుక్ లైవ్‌లపై ఇక ఆంక్షలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోప్యతా ఉల్లంఘనల ఆందోళన, న్యూజిలాండ్ నరమేధం సంఘటన తరువాత పలు సంస్కరణలకు పూనుకుంటోంది. ఇటీవల శ్వేత జాతీయవాద, వేర్పాటువాద పోస్టులను, ప్రసంగాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించిన సంస్థ తాజాగా మరో దిద్దుబాటు చర్యకు శ్రీకారం చుట్టింది. ఇక పై ఫేస్బుక్ లైవ్‌లను మానిటర్ చేయనుంది. ఈ మేరకు కొన్ని ఆంక్షలు విధించాలని కూడా నిర్ణయించింది. అంటే ఇకపై ఫేస్బుక్ లైవ్‌లపై ఒక కన్నేసి ఉంచుతుందన్నమాట. క్రైస్ట్‌చర్చ్ ఊచకోత సంఘటన లైవ్ స్ట్రీమింగ్పై రేగిన దుమారం నేపథ్యంలో తన ప్లాట్‌పాంపై ప్రత్యక్ష ప్రసారాలను కట్టడి చేయనుంది. ఈ మేరకు ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బెర్గ్ శుక్రవారం తన బ్లాగ్‌లో ప్రకటించారు. ప్రామాణిక ఉల్లంఘనలులాంటి అంశాలపై ఆధారఫడి ఫేస్బుక్లో ఎవరు లైవ్‌కు వెళ్లవచ్చు అనే విషయాన్ని ఫేస్బుక్ పరిశీలిస్తుందని ఆమె వెల్లడించారు. చదవండి : న్యూజిలాండ్ సంచలన నిర్ణయం మృతుల్లో ఐదుగురు భారతీయులు -
రాజీనామా చేయను
వాషింగ్టన్: ఫేస్‌బుక్‌కు తాను రాజీనామా చేయనని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మంగళవారం మరోసారి స్పష్టం చేశారు. ఫేస్బుక్ సీవోవో (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) షెరిల్ శాండ్బర్గ్ను కూడా ఆయన వెనకేసుకొచ్చారు. ‘ఈ కంపెనీకి షెరిల్ ఎంతో కీలకమైన వ్యక్తి. మాకున్న ఎన్నో సమస్యలను ఆమె మోస్తున్నారు. వాటిని పరిష్కరించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు’ అని జుకర్‌బర్గ్ అన్నారు. గత దశాబ్దకాలంగా ఆమెతో కలిసి తాను పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాననీ, మరికొన్ని దశాబ్దాలపాటు తామిద్దరం కలిసే పనిచేస్తామని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం అంశం మొదలుకుని ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్‌కు నిత్యం ఏదో ఒక సమస్య వచ్చిపడుతుండటం తెలిసిందే. నకిలీ వార్తలు, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం, నిబంధలన ఉల్లంఘనలకు జరిమానాలు ఎదుర్కోవడం తదితర సమస్యలతో ఫేస్బుక్ సతమతమవుతోంది. అయితే వారం రోజుల క్రితం న్యూయార్క్ టైమ్స్ పత్రిక భారీ కథనం రాస్తూ ఫేస్బుక్ తమ ప్రత్యర్థి కంపెనీలపై బురదజల్లేందుకు వాషింగ్టన్కు చెందిన ఓ ప్రజా సంబంధాల కంపెనీని నియమించుకుందని వెల్లడించింది. ప్రత్యర్థి కంపెనీలకు వ్యతిరేకంగా ఆ సంస్థ కథనాలు రాయించి ప్రాచుర్యంలోకి తెచ్చిందంది. ఈ కంపెనీకి రిపబ్లికన్ పార్టీతో సంబంధాలున్నాయని తెలిపింది. అలాగే అమెరికా ఎన్నికల్లో ఫేస్బుక్ ద్వారా రష్యా జోక్యానికి సంబంధించి ఆ సంస్థకు ముందే సమాచారం ఉన్నా తగిన రీతిలో స్పందించలేదని ఆరోపించింది. ఫేస్బుక్ పెద్దలు ఆలస్యంగా స్పందించారనీ, నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అవన్నీ అబద్ధాలే: జుకర్‌బర్గ్, షెరిల్ జుకర్‌బర్గ్, శాండ్బర్గ్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఖండించారు. వాషింగ్టన్ కంపె నీని ఫేస్బుక్ నియమించుకున్న సమాచారమే తమకు తెలీదనీ, ఆ పత్రికలో కథనం చదివిన తర్వాతనే తెలుసుకున్నామని వారిద్దరు చెప్పారు. ఇప్పుడు ఆ కంపెనీతో తమ సంస్థ సంబంధాలను రద్దు చేసుకుందని తెలిపారు. అలాగే రష్యా జోక్యం గురించి కూడా తమకు ముం దుగా తెలీదనీ, అంతా తెలి సినా మౌనంగా ఉన్నామనడం సరికా దని చెప్పారు. జుకర్‌బర్గ్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలని కొంతకాలంగా ఆ సంస్థ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. కొత్త ఫీచర్ ‘యువర్ టైమ్’ ఫేస్బుక్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పనులు మానుకుని గంటల తరబడి ఫేస్‌బుక్‌కు అతుక్కుపోయే చాలా మందికి ఇది ఉపయోగడనుంది. ఫేస్‌బుక్‌ను మీరు ఎంతసేపు వాడుతున్నారో రోజువారీ, వారం వారీ లెక్కలను ఈ కొత్త ఫీచర్ మీకు తెలియజేస్తుంది. అంతేకాదు.. రోజుకు ఎంతసేపు మీరు ఫేస్‌బుక్‌ను వాడాలనుకుంటున్నారో ముందే నిర్ణయించి ఆ విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకుంటే.. ఆ సమయం పూర్తి కాగానే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం ఫేస్‌బుక్‌ను బ్రౌజ్ చేస్తున్నారంటూ మీకు హెచ్చరికలు కూడా వస్తాయి. ఈ కొత్త ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకునేందుకు ఫేస్బుక్ యాప్‌లో ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’లోకి వెళితే ‘యువర్ టైమ్ ఆన్ ఫేస్బుక్’ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీరు ఫేస్బుక్లో ఇప్పటివరకు గడిపిన సమయం కనిపించడంతోపాటు, రోజూ ఎంతసేపు బ్రౌజ్ చేయాలనుకుంటే అంత సమయం సెట్ చేసుకోవచ్చు. ఏ రోజైనా మీరు అంత కన్నా ఎక్కువ సమయం ఫేస్‌బుక్‌పై గడుపుతున్నట్లయితే వెంటనే మీకు ఫేస్బుక్ నుంచి హెచ్చరికలు వస్తాయి. -
టెక్నాలజీ రంగంలో టాప్ లేడీస్
ప్రస్తుతం టెక్నాలజీ రంగం ప్రపంచాన్ని శాసిస్తోంది. రోజుకో కొత్త ఆవిష్కరణతో మానవ అవసరాలన్నింటినీ తీర్చేందుకు సిద్ధమంటోంది. సెల్‌ఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్.. ఇవి లేని జీవితాన్ని ప్రస్తుతం మనం ఊహించలేం. వీటి సాయంతో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఆన్లైన్లోనే షాపింగ్ చేసేస్తున్నాం. ఫోన్, కరెంట్ బిల్లులు కట్టేస్తున్నాం. గంటల కొద్దీ లైన్లో నిలబడకుండా టికెట్ రిజర్వ్ చేసుకుంటున్నాం. డబ్బు పంపిస్తున్నాం, అందుకుంటున్నాం. ఇలా మనం అనుభవిస్తున్న అన్ని సౌకర్యాలూ టెక్నాలజీ పుణ్యమే. ఇంతటి కీలక రంగంలో మహిళలూ కీలక పాత్ర పోషిస్తున్నారు. పెద్దపెద్ద సంస్థలను సైతం సమర్థంగా నిర్వహిస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. మన దేశంలో టెక్నాలజీ– బీపీవో రంగంలో 39 లక్షల మంది ఉద్యోగులుంటే అందులో 13 లక్షల మంది మహిళలేనని నాస్కామ్ ఇటీవలే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగ దిగ్గజాలైన ఐబీఎం మొదలు చాలా కంపెనీల్లో మహిళలు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. తమ పనితీరు, శక్తి సామర్థ్యాలతో దిగ్గజ సంస్థల్ని విజయతీరాల వైపు నడిపిస్తున్న మహిళల గురించి తెలుసుకుందాం.. సుశాన్ వోజ్సిస్కీ యూట్యూబ్ సీఈవో నేటి సాంకేతిక యుగంలో యూట్యూబ్ గురించి తెలియని వారుండరు. ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాంగా సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు అందరినీ ఆకట్టుకునే యూట్యూబ్ సంస్థను నడిపిస్తున్నదీ ఒక మహిళే. 1999లో గూగుల్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన సుశాన్ అనతి కాలంలోనే ఆ సంస్థ అడ్వర్టయిజింగ్ అండ్ కామర్స్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. యూట్యూబ్, డబుల్ క్లిక్‌లను గూగుల్ వశం చేసుకోవాలన్న ఐడియా కూడా ఆమెదే. ఈ రెండింటినీ గూగుల్ సొంతం చేసుకున్న తర్వాత కొన్నేళ్లపాటు వాటి బాధ్యతలను సుశాన్ చూశారు. 2014లో యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టి సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు. సఫ్రా కాట్జ్: ఒరాకిల్ కో సీఈవో సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ విజయాల్లో కీలక సూత్రధారి. ఇజ్రాయెల్‌లో పుట్టిన ఈమె ఆరేళ్లకే అమెరికా వచ్చేశారు. బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టి అనతికాలంలోనే బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్‌లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.1999లో ఒరాకిల్‌లో చేరి 2001 చివరికల్లా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరయ్యారు. 2004లో కంపెనీ ప్రెసిడెంట్‌గా, 2014 నుంచి మార్క్ హర్డ్‌తో కలిసి కంపెనీ కో సీఈవోగా కొనసాగుతున్నారు. షెరిల్ శాండ్‌బర్గ్ : ఫేస్‌బుక్‌కు సీవోవో టెక్నాలజీ రంగంలో శక్తివంతమైన మహిళల పేర్లు చెప్పుకోవాల్సి వస్తే కచ్చితంగా షెరిల్ శాండ్‌బర్గ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న ఫేస్‌బుక్‌కు సీవోవో (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)గా ఈమె ఉన్నారు. ఫేస్బుక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయిన తొలి మహి కూడా. ఈ సంస్థలో చేరకముందు గూగుల్‌లో పనిచేశారు. అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఫర్ ట్రెజరీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. పనిచేసే చోట ప్రధానంగా కనిపించే జెండర్ గ్యాప్, మహిళల సమస్యలపై.. లీన్ఇన్– ఉమెన్, వర్క్ అండ్ ద విల్ టు లీడ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఏంజెలా అహ్రెండస్: యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లగ్జరీ బ్రాండ్ బర్‌బెర్రీకి సీఈవోగా 2006 నుంచి ఎనిమిదేళ్లు ఈమె పనిచేశారు. తర్వాత టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థలో రిటైల్ అండ్ ఆన్లైన్ స్టోర్స్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. తన పనితీరుతో మేనేజ్మెంట్ను మెప్పించారు. అత్యధిక జీతం తీసుకునే ఉద్యోగి స్థాయికి ఎదిగారు. ఆమె వార్షిక వేతనం ఏకంగా 70 మిలియన్ డాలర్లు (మన రూపాయల్లో 467 కోట్లు). బ్రిటన్ ప్రధాని బిజినెస్ అడ్వయిజరీ కౌన్సిల్లో స్థానం దక్కించుకోవడం ఏంజెలా పనితీరుకు నిదర్శనం. గిన్నీ రొమెట్టీ: ఐబీఎం చైర్పర్సన్, సీఈవో ఈమె పేరు మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆమె సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐబీఎం సంస్థ గురించి చెప్పగానే ఆమె కార్యదక్షత ఏపాటిదో ఇట్టే అర్థమైపోతుంది. 2011 నుంచి అత్యున్నత బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తున్న ఆమె ఐబీఎం సంస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. అంతేకాకుండా వ్యాపార రంగంలో అత్యంత శక్తిమంత 50 మంది మహిళలతో ఫార్చ్యూన్ మ్యాగజైన్ రూపొందించే జాబితాలో వరుసగా పదేళ్లపాటు స్థానం సంపాదించుకోవడం ఆమె శక్తిసామర్థ్యాలకు నిదర్శనం. ఫోర్బ్స్ 2014లో ప్రకటించిన వరల్డ్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ జాబితాలో ఈమెకి చోటు దక్కింది. దేవయాని ఘోష్ : ఇంటెల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సెమీకండక్టర్స్, కంప్యూటర్ ప్రాసెసర్ల తయారీలో దిగ్గజ సంస్థ ఇంటెల్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు దేవయాని ఘోష్. అలాగే ఇంటెల్ దక్షిణాసియా రీజియన్‌కు ఎండీగా కూడా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో టెక్నాలజీ వాడకాన్ని మరింత పెంచాలన్న లక్ష్యంతో దక్షిణాసియాలోని పలు దేశాల ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నారు. ఫార్చ్యూన్ ఇండియా రూపొందించిన 50 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ ఇన్ ఇండియా జాబితాలో ఘోష్‌ది 11వ స్థానమంటే ఆమె శక్తి సామర్థ్యాలను అంచనా వేయొచ్చు. వనితా కుమార్: క్వాల్కామ్ వైస్ ప్రెసిడెంట్ క్వాల్కామ్ టెక్నాలజీకి సంబంధించిన కీలక వ్యూహ కర్తల్లో వనిత ఒకరు. మోడెం ఎస్డబ్ల్యూ ఇంటర్ఫేస్ టెక్నాలజీ టీమ్‌లను ప్రపంచవ్యాప్తంగా నడిపిస్తున్నారు. వైర్లెస్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం వనితా కుమార్ సొంతం. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, డిజైన్, డెవలప్మెంట్ రంగాల్లో బాగా పట్టున్న వనిత కంపెనీకి ఆయా విభాగాల్లో కీలక వ్యక్తిగా మారారు. క్వాల్కామ్ 5జీ, సెల్యులార్ ఐవోటీ ఎస్డబ్ల్యూ సాంకేతికతకు రోడ్‌మ్యాప్ తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. -
ఫేస్ బుక్ కీలక నిర్ణయం
న్యూయార్క్: తమ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కరుణ చూపింది. కనీస వేతనాల పెంపుతో పాటు ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఫేస్ బుక్ లో పనిచేస్తున్న అత్యధిక మంది కాంట్రాక్టు కార్మికులకు ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు మరింత ప్రయోజం చేకూరనుంది. తాజా నిర్ణయం ప్రకారం గంటకు సుమారు రూ.1000 కనీస వేతనం లభిస్తుంది. ఏడాదికి 15 వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. ఇక ప్రసవ సమయంలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా సుమారు రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది. ప్రత్యేకంగా తమ సంస్థ తరపున అమెరికాలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయని ఫేస్ బుక్ వెల్లడించింది. విశాల దృక్పథంతో కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు ప్రకటించామని ఫేస్ బుక్ సీఓఓ షెరిల్ శ్యాండ్‌బర్గ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు పోత్సాహకాలు ప్రకటిస్తే వారు సంతోషంగా ఉంటారని, ఫలితంగా పనితీరు మెరుగుపడుతుందని వివరించారు. మహిళలతో పాటు పురుషులకు పెరేంటల్ లీవు ఇస్తామని ప్రకటించడం విశేషం. -
‘ఉద్వేగ అధ్యయనం’పై ఫిర్యాదు
ఫేస్బుక్ చర్య అనైతికమన్న ‘ఎపిక్’ వాషింగ్టన్: ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్సైట్ ఫేస్బుక్ రెండేళ్ల కిందట తన యూజర్లపై నిర్వహించిన మానసిక ఉద్వేగ అధ్యయనం చ ట్టవిరుద్ధమని ఫిర్యాదు దాఖలైంది. ఇది మోసం, నైతిక ప్రమాణాలకు విరుద్ధమని, ఫేస్బుక్ ఉద్దేశపూర్వకంగా ప్రజల మనసులతో చెలగాటమాడిందని డిజిటల్ హక్కుల బృందం ఎలక్ట్రానిక్ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎపిక్) ఇటీవల యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ అధ్యయనానికి యూజర్ల అనుమతి తీసుకోలేదని, ఈ ప్రయోగం ఫేస్బుక్ నిబంధనలకే విరుద్ధమని పేర్కొంది. దీనికి నష్టపరిహారం చెల్లించాలని, అధ్యయనానికి అనుసరించిన పద్ధతులేంటో తెలపాలని డిమాండ్ చేసింది. 2012లో వారం పాటు 7 లక్షల మంది యూజర్లపై ఫేస్బుక్ రెండు వర్సిటీలతో కలిసి అధ్యయనం చేసింది. యూజర్ల వ్యక్తిగత సమాచారంలోని ఉద్వేగ సంబంధ సమాచారాన్ని మార్చి పంపండం వల్ల వారిపై ప్రభావం ఉంటుందో లేదో తేల్చడానికి దీన్ని చేపట్టారు. ఈ మార్పులు యూజర్లను ప్రభావితం చేస్తాయని, ప్రతికూల(నెగిటివ్) ఉద్వేగ సమాచారమున్న సందేశాలను తక్కువగా చదివిన యూజర్లు ప్రతికూల అప్డేట్లను తమ పేజీల్లో రాసే అవకాశం తక్కువని తేలింది. అయితే అధ్యయనం పద్ధతి నిర్వహించిన తీరు సరిగ్గా లేదని, అందుకు క్షమాపణ చెబుతున్నామని సంస్థ సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ వివరణ ఇచ్చారు. -
ప్రజాసంబంధాలే పాలనకు కీలకం
* తనను కలిసిన ఫేస్బుక్ సీవోవోతో ప్రధాని * ఫేస్బుక్ ద్వారా పర్యాటకులను ఆకర్షించడంపై చర్చ న్యూఢిల్లీ: ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగించడం పరిపాలనలో కీలకాంశమని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ప్రజలు, ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు, పరిపాలనకు ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్సైట్ ఫేస్బుక్ వంటి వేదికను పనిముట్టుగా ఉపయోగించుకోవచ్చన్నారు. భారత పర్యటనలో ఉన్న ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) షెరిల్ శాండ్‌బెర్గ్ గురువారం ఢిల్లీలో మోడీతో సమావేశమయ్యారు. భారత్‌లో ఫేస్‌బుక్‌ను మరింత విస్తరించడంపై తన ఆలోచనలను సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించే మోడీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మోడీ ఆమెతో మాట్లాడుతూ ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగించడం పరిపాలనలో ముఖ్యమన్నారు. అనంతరం ఈ భేటీ వివరాలను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దేశంలోకి మరింత మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఫేస్‌బుక్‌ను ఎలా ఉపయోగించాలో షెరిల్‌తో చర్చించానని, ఆమెతో భేటీ ఫలప్రదంగా సాగిందని పేర్కొన్నారు. మోడీతో భేటీలో ఫేస్బుక్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మార్న్ లెవిన్, పబ్లిక్ పాలసీ భారత విభాగం చీఫ్ అంఖీ దాస్ పాల్గొన్నారు. మరోవైపు మోడీతో భేటీ అనంతరం షెరిల్...కమ్యూనికేషన్లు, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. విద్య, ఆరోగ్యం, ఈ-గవర్నెన్స్ తదితర రంగాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై ఈ భేటీలో చర్చించినట్లు విలేకరులతో మాట్లాడుతూ షెరిల్ చెప్పారు. రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ తొమ్మిది భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న ఫేస్బుక్లో మరిన్ని భాషలను చేర్చాల్సిందిగా కోరానన్నారు. కాగా, ఫేస్బుక్లో 1.89 కోట్ల ‘లైక్’లతో అమెరికా అధ్యక్షుడు ఒబామా తర్వాత రెండో స్థానంలో నిలిచిన మోడీ... ట్విట్టర్లో 50.90 లక్షల మంది ‘ఫాలోవర్ల’తో ఒబామా, పోప్ తర్వాత మూడో అతిపెద్ద ప్రపంచ నేతగా నిలిచారు. మోడీతో అమెరికా సెనేటర్ సమావేశం అమెరికా సీనియర్ సెనేటర్ జాన్ మెక్కెయిన్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం పునరుత్తేజానికి మోడీతో కలిసి పనిచేయాలన్న బలమైన కోరిక అమెరికాలో వ్యక్తమవుతోందని చెప్పారు. ఇందుకు మోడీ బదులిస్తూ ద్వైపాక్షిక సంబంధాలను నూతన స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తున్నానన్నారు. సెప్టెంబర్‌లో అమెరికా పర్యటన కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. మోడీ కాశ్మీర్ పర్యటనకు భారీ భద్రత: ప్రధాని మోడీ శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లో తొలిసారి పర్యటిస్తుండటం, ఈ పర్యటనకు నిరసనగా హురియత్ కాన్ఫరెన్స్సహా వేర్పాటువాద గ్రూపులన్నీ శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలను చేపట్టాయి. ఈ పర్యటన సందర్భంగా మోడీ తొలుత జమ్మూలోని ఉధంపూర్ నుంచి కాత్రా వరకూ కొత్తగా నిర్మించిన 25 కి.మీ. రైలు మార్గంలో ప్రయాణించే తొలి రైలును కాత్రా స్టేషన్‌ను ప్రారంభిస్తారు. వైష్ణోదేవి ఆలయ దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఇకపై ఈ రైలు మార్గం ద్వారా నేరుగా కాత్రాలోని బేస్ క్యాంపునకు చేరుకోవచ్చు. -
ప్రధాని ‘పోస్టు’ అద్భుతం: ఫేస్బుక్ సీఓఓ షెరిల్
* ఫేస్బుక్ సీఓఓ షెరిల్ శ్యాండ్‌బర్గ్ * ఒబామా తర్వాత మోడీకే ఎక్కువమంది స్నేహితులు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన తల్లి దీవెనలను పొందుతున్న ఫొటోతో కూడిన పోస్టు అద్భుతమని, అది వ్యక్తిగతంగా తనకెంతో ఇష్టమైనదనిసామాజిక సంబంధాల వెబ్సైట్ ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) షెరిల్ శ్యాండ్‌బర్గ్ చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న షెరిల్ గురువారం ప్రధానితో భేటీ కానున్నారు. ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందిన రాజకీయవేత్తల్లో మోడీ రెండోస్థానంలో ఉన్నట్టు ఆమె తెలిపారు. ఆయనకు కోటీ ఎనభై లక్షల మందికి పైగా ఫేస్బుక్ స్నేహితులు ఉన్నారన్నారు. 4 కోట్ల మందికి పైగా స్నేహితులతో అమెరికా అధ్యక్షుడు ఒబామా మొదటి స్థానంలో ఉన్నట్టు ఓ ఇంటర్వూలో వెల్లడించారు. దేశంలో ఇటీవల ముగిసిన ఎన్నికలను ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియూ ప్రాధాన్యతను భారత రాజకీయవేత్తలు ఇప్పుడెలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నట్టు చెప్పారు. భారత్‌లో ఫేస్‌బుక్‌తో సంబంధాలు లేనివారు ఇంకా 100 కోట్ల మంది ఉన్నారని, వారిని కూడా ఫేస్‌బుక్‌లోకి తేవడమే తమ ముందున్న సవాలని అన్నారు. గోప్యత విషయంలో తాము జాగ్రత్తగా వ్యవహరిస్తామనే విషయూన్ని యూజర్లు అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నట్టు షెరిల్ చెప్పారు. మనో విశ్లేషణ ప్రయోగం గురించి యూజర్లకు తెలియజెప్పడంలో ఫేస్బుక్ విఫలమైందని ఆమె అంగీకరించారు. యూజర్ల భావోద్రేకాలను నియంత్రించేందుకు ప్రయత్నించారనడాన్ని ఆమె ఖండించారు. 2012లో యూజర్లకు తెలియకుండా వారి భావోద్రేకాలపై ఫేస్బుక్ నిర్వహించిన అధ్యయనంపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యూరుు. విద్య, అవకాశాల పరంగా ముందున్నప్పటికీ లింగ అసమానత అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతుల్లోనూ సమస్యగానే మిగిలిందని బుధవారం ఫిక్కీ మహిళా సంఘం ఏర్పాటు చేసిన సదస్సులో షెరిల్ చెప్పారు. -
ఫోర్బ్స్ శక్తివంత మహిళల జాబితా..
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన 100 మంది మహిళల జాబితాలో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ చందా కొచర్లకు స్థానం లభించింది. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో ఉన్న ఈ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలకు చోటుదక్కింది. భట్టాచార్యకు 36వ ర్యాంకు, కొచర్‌కు 43వ ర్యాంకు లభించాయి. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా 92వ స్థానంలో నిలిచారు. పెప్సీకో చీఫ్ ఇంద్రా నూయి 13వ స్థానంలో, సిస్కో చీఫ్ టెక్నాలజీ, స్ట్రాటజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్ 71వ స్థానంలో ఉన్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ ఎల్లెన్ (రెండో స్థానం), మానవతావాది మెలిండా గేట్స్ (3), హిల్లరీ క్లింటన్ (6), జనరల్ మోటార్స్ తొలి మహిళా సీఈఓ మేరీ బారా (7), అమెరికా తొలి మహిళ మిషెల్ ఒబామా, ఫేస్బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బెర్గ్(9) తొలి పది స్థానాలో ఉన్నారు. దాదాపు 38 వేల కోట్ల డాలర్ల ఆస్తులు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథిగా భట్టాచార్య ఆసియా ఉపఖండంలోనే అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్నారని ఫోర్బ్స్ ప్రశంసించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్, ట్రెజరీ, రిటైల్ ఆపరేషన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి వివిధ రంగాల్లో ఆమె విశేష సేవలందించారని తెలి పింది. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన 12,500 కోట్ల డాలర్ల ఆస్తులను చందా కొచర్ పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇక్కట్లను ఎదుర్కొన్న ఐసీఐసీఐ బ్యాంకును ఆమె గాడిన పెట్టారని తెలిపింది.