‘ఉద్వేగ అధ్యయనం’పై ఫిర్యాదు
ఫేస్‌బుక్ చర్య అనైతికమన్న ‘ఎపిక్’
వాషింగ్టన్: ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ రెండేళ్ల కిందట తన యూజర్లపై నిర్వహించిన మానసిక ఉద్వేగ అధ్యయనం చ ట్టవిరుద్ధమని ఫిర్యాదు దాఖలైంది. ఇది మోసం, నైతిక ప్రమాణాలకు విరుద్ధమని, ఫేస్‌బుక్ ఉద్దేశపూర్వకంగా ప్రజల మనసులతో చెలగాటమాడిందని డిజిటల్ హక్కుల బృందం ఎలక్ట్రానిక్ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎపిక్) ఇటీవల యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
ఈ అధ్యయనానికి యూజర్ల అనుమతి తీసుకోలేదని, ఈ ప్రయోగం ఫేస్‌బుక్ నిబంధనలకే విరుద్ధమని పేర్కొంది. దీనికి నష్టపరిహారం చెల్లించాలని, అధ్యయనానికి అనుసరించిన పద్ధతులేంటో తెలపాలని డిమాండ్ చేసింది. 2012లో వారం పాటు 7 లక్షల మంది యూజర్లపై ఫేస్‌బుక్ రెండు వర్సిటీలతో కలిసి అధ్యయనం చేసింది. యూజర్ల వ్యక్తిగత సమాచారంలోని ఉద్వేగ సంబంధ సమాచారాన్ని మార్చి పంపండం వల్ల వారిపై ప్రభావం ఉంటుందో లేదో తేల్చడానికి దీన్ని చేపట్టారు. ఈ మార్పులు యూజర్లను ప్రభావితం చేస్తాయని, ప్రతికూల(నెగిటివ్) ఉద్వేగ సమాచారమున్న సందేశాలను తక్కువగా చదివిన యూజర్లు ప్రతికూల అప్‌డేట్లను తమ పేజీల్లో రాసే అవకాశం తక్కువని తేలింది. అయితే అధ్యయనం పద్ధతి నిర్వహించిన తీరు సరిగ్గా లేదని, అందుకు క్షమాపణ చెబుతున్నామని సంస్థ సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ వివరణ ఇచ్చారు.