స్ఫూర్తితో ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్బర్గ్
ఈ ఏడాదిన్నరలో ఎంతోమంది మహిళలు.. కేవలం ఇంటిని చూసుకోవడం కోసం ఉద్యోగాలు మానేయవలసి వచ్చింది! వాళ్లను మళ్లీ ఉద్యోగాలలోకి రప్పించడం కోసం బెంగళూరు ‘లీన్‌ఇన్’ కంపెనీలో నెట్‌వర్క్ లీడర్‌గా పని చేస్తున్న స్ఫూర్తి అనే యువతి ఇంటింటికీ వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఒప్పించి ఆ ఉద్యోగినులను మళ్లీ ఆఫీసులకు రప్పిస్తోంది. ఇల్లు చేదోడుగా ఉంటే స్త్రీ ఆ ఇంటికి ఎంత చేయూతగా ఉంటుందో కొన్ని కుటుంబాలను ఉదాహరణగా చూపిస్తోంది. ఆమె చేస్తున్న ఈ ప్రయత్నంతో.. చీకటి పడగానే ఒకటొకటిగా ఇళ్లలోని లైట్లు వెలిగిన విధంగా తిరిగి ఉద్యోగాలలో చేరుతున్న మహిళల చిరునవ్వుతో కుటుంబాలు కాంతిమంతం అవుతున్నాయి. ఫేస్‌బుక్ సీవోవో కూడా స్ఫూర్తి చేస్తున్న ప్రయత్నానికి ముగ్ధురాలై ఆమె గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందనగా స్ఫూర్తిదాయకమైన పోస్ట్ పెట్టారు.
షెరిల్ శాండ్బర్గ్ (51) వాషింగ్టన్‌లో ఉంటారు. ‘ఫేస్‌బుక్’ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆమె. ఇక స్ఫూర్తి బెంగళూరులో ఉంటుంది. అక్కడి ‘లీన్‌ఇన్’ కంపెనీలో స్ఫూర్తి నెట్‌వర్క్ లీడర్. మహిళలకు మద్దతుగా ఉండి, వారిని వారి లక్ష్యాలకు నడిపించే లాభాపేక్ష లేని సంస్థ లీన్‌ఇన్. శాండ్బర్గే స్వయంగా ఈ సంస్థను ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించారు. దాదాపు అన్ని దేశాల్లోనూ లీన్‌ఇన్ ఉంది. అయితే బెంగళూరులోని లీన్‌ఇన్‌లో మాత్రమే స్ఫూర్తి వంటి అమ్మాయి ఉంది! ఇలా చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఉద్యోగినులకు ఇంటి పనిలో ఏమాత్రం సహాయం లభించకపోగా, వారు గడప దాటితే గృహ భ్రమణం ఆగిపోయే పరిస్థితి అన్ని దేశాలలో ఉన్నప్పటికీ.. మనదేశంలో మరికాస్త ఎక్కువ అనిపించేలా గత ఏడాదిన్నరగా అనేక మంది మహిళలు కుటుంబం కోసం ఉద్యోగాలు మాని ఇంటికే పరిమితం అవవలసి వచ్చింది.
స్ఫూర్తి వారందరినీ తిరిగి ఆఫీసులకు మళ్లించారు! అందుకే ఆమె శాండ్బర్గ్ దృష్టిలో పడ్డారు. స్ఫూర్తితో పాటు మహిళా ఉద్యోగులు కొందరు చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. స్ఫూర్తి ప్రయత్నాన్ని ప్రశంసించారు. నిజానికి ఇది స్ఫూర్తికి.. కంపెనీ అప్పగించిన బాధ్యత కాదు. ఆమెకై ఆమె చొరవ తీసుకుని ఇల్లిల్లూ తిరిగి సాధించిన ఘనత. అవును ఘనతే. బడి మానిన పిల్లల్ని తిరిగి బళ్లో చేర్పించడం వంటిదే.. ఉద్యోగం మానిన మహిళల్ని తిరిగి ఆఫీస్‌కి రప్పించడం! ఇంట్లో అనుకూలత లేకనే కదా ఆడపిల్లలు చదువు మానినా, గృహిణులు ఉద్యోగం మానినా. స్ఫూర్తి ఏం చేసిందంటే.. చక్కగా చదువుతోంది కదా ఎంత కష్టమైనా గాని పిల్లను బడి మాన్పించకండి అని తల్లిదండ్రులకు టీచర్‌లు చెప్పే విధంగానే.. ‘‘ఇంటిపనిలో మీరూ ఓ చెయ్యేస్తే ఆమెకు ఉద్యోగం మానే పరిస్థితి రాదు కదా..’’ అని కుటుంబ సభ్యులకు నచ్చ చెబుతోంది.
స్ఫూర్తి మాట్లాడ్డం మృదువుగా, ఒప్పించేలా ఉంటుంది. లీన్‌ఇన్‌లో పనిచేసేవాళ్లంతా ఇదే విధంగా ఉంటారు. లీన్‌ఇన్‌లో ప్రధానంగా వాళ్లు చేస్తుండే పని ఆలోచన–ఆచరణ. మహిళలకు మద్దతుగా ఉండటం కోసం, మహిళల్ని వాళ్ల లక్ష్యాలకు దగ్గరగా చేర్చడం కోసం, మహిళల్ని సాధికార సాయుధులుగా మలచడం కోసం వర్తమాన సామాజిక అనుకూలతలు, ప్రతికూలతలను అనుసరించి ఒక ప్రణాళికను ఆలోచిస్తారు. ఆలోచనను ఆచరణలో పెడతారు. లాక్‌డౌన్‌లో ఉద్యోగినులకు ఇటు ఇంటిపనీ, అటు ఆఫీస్ పనీ ఎక్కువైంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగాలు మానేయడం మొదలుపెట్టారు! ఇంటికి ఆర్థికం గా నష్టం. సమాజానికి అభివృద్ధి పరంగా నష్టం. ఈ సంగతిని త్వరగా కనిపెట్టి, త్వరగా చక్కదిద్దడానికి కార్యోన్ముఖం అయింది స్ఫూర్తి.
ఈ ఏడాదిన్నరలో బెంగళూరులో ఉద్యోగం మానేసిన వారు వందల్లో ఉన్నారని ఒక సర్వే ద్వారా తెలుసుకున్న స్ఫూర్తి వాళ్లను తిరిగి ఉద్యోగాలకు చేర్చడానికి ఒక నెట్‌వర్క్‌ను సిద్ధం చేసి వాళ్ల ఇళ్లకు పంపించింది. ఉద్యోగం మానిన వారిలో స్ఫూర్తి కో–వర్కర్స్ కూడా ఉన్నారు! వాళ్ల బాధ్యతను తను తీసుకుంది స్ఫూర్తి. వాళ్లంతా ఇప్పుడు ఉద్యోగాల్లోకి వచ్చేశారు. వెళ్లిన చోట స్ఫూర్తి చెప్పిన మాట ఒకటే. ‘‘చూడండి.. మీరు తనకు ఇంటి పనిలో సహాయం చేస్తుంటే.. ఆఫీస్ పనిని ఆమె సునాయాసంగా చేయగలదు. ఏ ఇల్లయినా ఒక ఉద్యోగాన్ని అనవసరంగా ఎందుకు కోల్పోవాలి?’’ అని ఇంటిల్లిపాదినీ ఒప్పించింది. అలాగే పనిని షేర్ చేసుకునే నమూనా ఇళ్లు ఎంత ఆనందంగా గడుపుతున్నాయో ఉదాహరణలు ఇచ్చింది.
‘‘థ్యాంక్యూ స్ఫూర్తీ.. ఇలాంటి క్లిష్ట సమయంలో మనం ఎలా ఉండాలో చూపించావు’ అనే మాటతో ఇన్‌స్టాగ్రామ్‌లో శాండ్బర్గ్ తన అభినందన పోస్ట్‌ను ముగించారు.
ఫేస్‌బుక్ సీవోవో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో స్ఫూర్తి (ఎడమ నుంచి రెండు)
Comments
Please login to add a commentAdd a comment