ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‍బర్గ్ (ఫైల్ ఫోటో)
శాన్ఫ్రాన్సిస్కో : ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‍బర్గ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. నిశ్చితార్థం చేసుకున్నట్లు సోమవారం ప్రకటించారు. ఫేస్‌బుక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టరైన తొలి మహిళగా, టెక్నాలజీ రంగంలో అతి శక్తివంతమైన మహిళగా ఖ్యాతి గడించిన షెరిల్ భర్త పోయిన దాదాపు ఐదేళ్ల తర్వాత పునర్వివాహ నిశ్చితార్థం చేసుకున్నట్లు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రా పోస్ట్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఫేస్‌బుక్ సీఈవో తర్వాత తన ప్రతిభతో నెంబర్ 2 ఎగ్జిక్యూటివ్‌గా కొనసాగుతున్నారు షెరిల్.
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టామ్ బెర్న్‌తాల్‌ని మనువాడబోతున్నట్టు వెల్లడించారు. "ఎంగేజ్‌మెంట్..టామ్ బెర్న్‌తాల్ నువ్వే నా సర్వస్వం. ఇంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించలేను" అంటూ ఆమె తన ప్రేమను ప్రకటించారు. అటు ఈ శుభపరిణామంపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్పందించారు. మీరు ఒకరికొకరు అద్భుతంగా ఉన్నారు, చాలా సంతోషమంటూ శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు షెరిల్ హితులు, సన్నిహితులు, ఇతర వ్యాపార వర్గాల అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి.
శాండ్‌బర్గ్‌కు ఆమె మునుపటి వివాహం నుండి ఇద్దరు పిల్లలుండగా, ఇప్పటికే విడాకులు తీసుకున్న బెర్న్‌తాల్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. దీనికి సింబాలిక్‌గా వారి ఐదుగురు పిల్లలలో ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం వహించేలా ఐదు వజ్రాలతో పొదిగిన రింగ్‌ను రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. డేవిడ్ గోల్డ్‌బర్గ్ సోదరుడు ద్వారా ఒకరినొకరు పరిచయమైన ఈ జంట గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారట. లాస్ ఏంజెల్స్‌కు చెందిన కెల్టెన్ గ్లోబల్ ఫౌండర్, సీఈవో బెర్న్‌తాల్ , ప్రముఖ నటుడు, జాన్ బెర్న్‌తాల్ సోదరుడు.
కాగా 1969 ఆగస్టు 28 న జన్మించిన శాండ్‌బర్గ్ 51 వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఫెమినిస్ట్ బెస్ట్ సెల్లర్ "లీన్ ఇన్" రచయిత అయిన షెరిల్ భర్త, ఆన్‌లైన్ పోలింగ్ సంస్థ సర్వేమన్‌కీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గోల్డ్‌బర్గ్ (47) మెక్సికోలో 2015 లో ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment