వాషింగ్టన్: ఫేస్‌బుక్‌కు తాను రాజీనామా చేయనని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మంగళవారం మరోసారి స్పష్టం చేశారు. ఫేస్‌బుక్ సీవోవో (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) షెరిల్ శాండ్‌బర్గ్‌ను కూడా ఆయన వెనకేసుకొచ్చారు. ‘ఈ కంపెనీకి షెరిల్ ఎంతో కీలకమైన వ్యక్తి. మాకున్న ఎన్నో సమస్యలను ఆమె మోస్తున్నారు. వాటిని పరిష్కరించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు’ అని జుకర్‌బర్గ్ అన్నారు. గత దశాబ్దకాలంగా ఆమెతో కలిసి తాను పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాననీ, మరికొన్ని దశాబ్దాలపాటు తామిద్దరం కలిసే పనిచేస్తామని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం అంశం మొదలుకుని ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్‌కు నిత్యం ఏదో ఒక సమస్య వచ్చిపడుతుండటం తెలిసిందే.
నకిలీ వార్తలు, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం, నిబంధలన ఉల్లంఘనలకు జరిమానాలు ఎదుర్కోవడం తదితర సమస్యలతో ఫేస్‌బుక్ సతమతమవుతోంది. అయితే వారం రోజుల క్రితం న్యూయార్క్ టైమ్స్ పత్రిక భారీ కథనం రాస్తూ ఫేస్‌బుక్ తమ ప్రత్యర్థి కంపెనీలపై బురదజల్లేందుకు వాషింగ్టన్‌కు చెందిన ఓ ప్రజా సంబంధాల కంపెనీని నియమించుకుందని వెల్లడించింది. ప్రత్యర్థి కంపెనీలకు వ్యతిరేకంగా ఆ సంస్థ కథనాలు రాయించి ప్రాచుర్యంలోకి తెచ్చిందంది. ఈ కంపెనీకి రిపబ్లికన్ పార్టీతో సంబంధాలున్నాయని తెలిపింది. అలాగే అమెరికా ఎన్నికల్లో ఫేస్‌బుక్ ద్వారా రష్యా జోక్యానికి సంబంధించి ఆ సంస్థకు ముందే సమాచారం ఉన్నా తగిన రీతిలో స్పందించలేదని ఆరోపించింది. ఫేస్‌బుక్ పెద్దలు ఆలస్యంగా స్పందించారనీ, నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
అవన్నీ అబద్ధాలే: జుకర్‌బర్గ్, షెరిల్
జుకర్‌బర్గ్, శాండ్‌బర్గ్‌లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఖండించారు. వాషింగ్టన్ కంపె నీని ఫేస్‌బుక్ నియమించుకున్న సమాచారమే తమకు తెలీదనీ, ఆ పత్రికలో కథనం చదివిన తర్వాతనే తెలుసుకున్నామని వారిద్దరు చెప్పారు. ఇప్పుడు ఆ కంపెనీతో తమ సంస్థ సంబంధాలను రద్దు చేసుకుందని తెలిపారు. అలాగే రష్యా జోక్యం గురించి కూడా తమకు ముం దుగా తెలీదనీ, అంతా తెలి సినా మౌనంగా ఉన్నామనడం సరికా దని చెప్పారు. జుకర్‌బర్గ్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలని కొంతకాలంగా ఆ సంస్థ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుండటం తెలిసిందే.
కొత్త ఫీచర్ ‘యువర్ టైమ్’
ఫేస్‌బుక్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పనులు మానుకుని గంటల తరబడి ఫేస్‌బుక్‌కు అతుక్కుపోయే చాలా మందికి ఇది ఉపయోగడనుంది. ఫేస్‌బుక్‌ను మీరు ఎంతసేపు వాడుతున్నారో రోజువారీ, వారం వారీ లెక్కలను ఈ కొత్త ఫీచర్ మీకు తెలియజేస్తుంది. అంతేకాదు.. రోజుకు ఎంతసేపు మీరు ఫేస్‌బుక్‌ను వాడాలనుకుంటున్నారో ముందే నిర్ణయించి ఆ విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకుంటే.. ఆ సమయం పూర్తి కాగానే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం ఫేస్‌బుక్‌ను బ్రౌజ్ చేస్తున్నారంటూ మీకు హెచ్చరికలు కూడా వస్తాయి. ఈ కొత్త ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకునేందుకు ఫేస్‌బుక్ యాప్‌లో ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’లోకి వెళితే ‘యువర్ టైమ్ ఆన్ ఫేస్‌బుక్’ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీరు ఫేస్‌బుక్‌లో ఇప్పటివరకు గడిపిన సమయం కనిపించడంతోపాటు, రోజూ ఎంతసేపు బ్రౌజ్ చేయాలనుకుంటే అంత సమయం సెట్ చేసుకోవచ్చు. ఏ రోజైనా మీరు అంత కన్నా ఎక్కువ సమయం ఫేస్‌బుక్‌పై గడుపుతున్నట్లయితే వెంటనే మీకు ఫేస్‌బుక్ నుంచి హెచ్చరికలు వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment