దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 5 కోట్ల మంది చిరు వ్యాపారుల కోసం రిలయన్స్ జియో (Reliance jio) కీలక నిర్ణయం తీసుకుంది. జియో భారత్ ఫోన్లలో (Jio Bharat Phone) ‘జియో సౌండ్ పే’ (Jio Sound Pay) అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఫీచర్‌తో జియో భారత్ వినియోగదారులు ప్రతి యూపీఐ పేమెంట్‌కి తాము ఎంపిక చేసుకున్న భాషలో కన్ఫర్మేషన్ మెసేజ్ ఉచితంగా వినొచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
టెక్నాలజీని మరింత అందిపుచ్చుకుంటూ ప్రతి భారతీయుడి సాధికారతే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో ఇన్ఫోకామ్ లిమిటెట్ ప్రెసిడెంట్ సునీల్ దత్ పేర్కొన్నారు. ప్రస్తుతం కిరాణా షాప్‌లు, టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు తదితర చిన్న తరహా వ్యాపారాలు చేస్తున్న వారంతా పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని కోసం ప్రతి నెలా రూ.125 చెల్లిస్తున్నారు. తాజాగా తీసుకొచ్చిన ‘జియో సౌండ్ పే’ ఫీచర్‌తో ఎలాంటి సౌండ్ బాక్సులు అవసరం లేకుండానే ఫోన్‌లోనే కన్ఫర్మేషన్ మెసేజ్ వినొచ్చు. దీనివల్ల వ్యాపారులకు ఏడాదికి రూ.1500 వరకు ఆదా అవుతుందని జియో ప్రకటనలో వెల్లడించింది.
భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జియోసౌండ్‌పేలో "వందేమాతరం" ఆధునిక సంస్కరణలను కూడా ప్రారంభించింది. ఈ ఆత్మీయ నివాళి సమకాలీన సంగీత అంశాలతో క్లాసిక్ మెలోడీలను మిళితం చేస్తుంది. వినియోగదారులు తమ దినచర్యకు దేశభక్తిని జోడించి మైజియో యాప్ లేదా జియో సావన్ ద్వారా ఈ రెండిషన్‌లను వారి జియోట్యూన్‌లుగా సెట్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment