టోకు ధరలు జనవరిలో తగ్గాయి. 2014 జనవరితో పోల్చిచూస్తే, 2015లో అసలు పెరక్కపోగా 0.39 శాతం క్షీణించాయి.
* 2014 జనవరితో పోల్చితే
* గడచిన నెలలో క్షీణత
* మైనస్ 0.39 శాతంగా నమోదు
న్యూఢిల్లీ: టోకు ధరలు జనవరిలో తగ్గాయి. 2014 జనవరితో పోల్చిచూస్తే, 2015లో అసలు పెరక్కపోగా 0.39 శాతం క్షీణించాయి. ఇది ఐదేళ్ల కనిష్ట స్థాయి. 3 నెలల్లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం క్షీణతలోకి జారడం ఇది రెండోసారి. నవంబర్‌లో తొలి అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం రేటు ‘జీరో’ అయినప్పటికీ, తాజాగా దీనిని -0.17 శాతంగా సవరించారు. తాజా సమీక్షా కాలంలో మూడు విభాగాల రేట్లూ తగ్గినా ఆహార ధరలు పెరిగాయి.
నిత్యావసరాలు... ఇంకా భారమే!
నిత్యావసర వస్తువుల టోకు బాస్కెట్ ధరల రేటు వార్షికంగా తగ్గినప్పటికీ (2014 జనవరిలో 8.85 శాతం స్పీడ్- 2015 ఇదే నెలలో 8 శాతం) ఇది ఇంకా సామాన్యుడికి ఇబ్బందికరమైన స్థాయిలో ఆరు నెలల గరిష్ట స్థాయిలో ఉంది. 2014 డిసెంబర్‌తో పోల్చినా... 2015 డిసెంబర్‌లో కూరగాయల ధరల పెరుగుదల (19.74 శాతం) రేటు అధికంగానే ఉన్నట్లు సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బియ్యం ధరలు సైతం 4 శాతం పెరిగాయి.
- ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ సూచీ 6.80 శాతం నుంచి 3.27 శాతానికి తగ్గింది.
- ఇంధనం, విద్యుత్ సూచీ స్పీడ్ 9.82 శాతం నుంచి 10.69 శాతం క్షీణతలోకి జారింది.
- తయారీ రంగం స్పీడ్ 2.96 శాతం నుంచి 1.05 శాతానికి పడిపోయింది.