
రఘరామ్ రాజన్ సమక్షంలో ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఉర్జిత్ పటేల్
చడీచప్పుడు లేకుండా గవర్నర్‌గా అధికారిక బాధ్యతల్లోకి...
ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్... ఎలాంటి మీడియా హడావుడి లేకుండా మంగళవారం అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. గత గవర్నర్లకు భిన్నంగా చడీచప్పుడుకాకుండా ఈ కార్యక్రమం పూర్తయింది. అంతేకాదు తొలిరోజు విధుల్లోకి హాజరైన తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించకపోవడం గమానార్హం. రఘురామ్ రాజన్ మూడేళ్ల క్రితం బాధ్యతలు స్వీకరించినప్పుడు అదేరోజు మీడియాతో మాట్లాడటమే కాకుండా.. ఆర్‌బీఐకి సంబంధించి పలు కీలక సంస్కరణలను కూడా ప్రకటించడం తెలిసిందే.
వాస్తవానికి కొత్త గవర్నర్‌కు ఇప్పుడున్న గవర్నర్ బాధ్యతలను అప్పగించే కార్యక్రమం.. పూర్తిగా బహిరంగంగా జరుగుతుంది. మీడియా హడావుడి, ఫొటోలతో చాలా సందడిగా ఉంటుంది. గతంలో దువ్వూరి నుంచి రాజన్ బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా ఇదే ఆనవాయితీ కొనసాగింది. అయితే, ఈ నెల 4న(ఆదివారం)తో రాజన్ పదవీకాలం ముగియడంతో అదేరోజు అధికారికంగా బాధ్యతలను చేపట్టినట్లేనని.. ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, సోమవారం వినాయక చవితి సెలవు కావడంతో అధికారికంగా బాధ్యతల స్వీకరణ, తొలిరోజు విధుల్లోకి హాజరు కార్యక్రమాలు మంగళవారం జరిగాయని ఆర్‌బీఐ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆర్‌బీఐయే విడుదల చేయడం విశేషం.
ఎందుకిలా...
ఎలాంటి హడావుడీ లేకుండ పటేల్ బాధ్యతలు చేపట్టడానికి వెనుక కీలక సంకేతాలు ఉన్నాయంటున్నారు కొంతమంది పరిశీలకులు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల గురించి కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడిన మాజీ గవర్నర్ రాజన్ తరహాలో ఇకపై ఆర్‌బీఐ గవర్నర్ వ్యవహరించబోరనేదానికి నిరాడంబరంగా పటేల్ బాధ్యతల స్వీకరణకే ప్రధాన సంకేతమని వారు అంటున్నారు. రాజన్ తొలిరోజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
తన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం తెలిసిందే. అంతేకాదు ఆతర్వాత కూడా పలు అంశాలపై నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెల్లడించారు కూడా. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటమే కాకుండా వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వం రాజన్‌ను గవర్నర్‌గా రెండో విడత కొనసాగించకపోవడానికి ఈ వివాదాస్పద వ్యాఖ్యలే కారణమన్న వాదనలూ ఉన్నాయి.
ఇక పటేల్ విషయానికొస్తే.. ఇప్పటివరకూ ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. 2013 జనవరి నుంచి ఆర్‌బీఐలోనే డిప్యూటీ గవర్నర్‌గా పనిచేస్తూ వస్తున్న ఉర్జిత్‌ను ఈ ఏడాది జనవరిలో అదే పదవిలో మరోసారి నియమించారు. చివరకు రాజన్ వారసుడిగా, 24వ గవర్నర్‌గా ఆయన బాధ్యతలను చేపట్టారు. డాక్టర్ పటేల్‌గా ఆర్‌బీఐలో సుపరిచితుడైన ఉర్జిత్.. ఆర్‌బీఐలో పలు కీలక కమిటీలకు నేతృత్వం వహించారు.
అంతేకాదు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీల్లోనూ పనిచేయడం గమనార్హం. మరోపక్క, ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నిర్ణయాలకు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రామాణికంగా చేసింది ఉర్జిత్ పటేల్ కమిటీయే కావడం గమనార్హం. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రాజన్ చేసిన పోరాటం, అదేవిధంగా బ్యాం కుల మొండిబకాయిల సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలను పటేల్ ఎలా కొనసాగిస్తారనేది ఆసక్తికరమైన అంశం.
అలా అయితే అక్టోబర్‌లో రేటు కోత: సిటీ
ఆగస్టు నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం లోపునకు పడిపోతే, అక్టోబర్‌లో రెపో రేటుకోత పావుశాతం ఉంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం సిటీగ్రూప్ తన తాజా నివేదికలో అంచనావేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో- ప్రస్తుతం 6.5%గా ఉంది. జూలై రిటైల్ ద్రవ్యోల్బణం 6.1%. అయితే ఆగస్టులో ఈ రేటు 5%కి తగ్గొచ్చనేది సిటీ గ్రూప్ అంచనా. తగిన వర్షపాతం, సరఫరాల సమస్య మెరుగుపడ్డం దీనికి కారణాలు కావచ్చని పేర్కొంది.
డిప్యూటీ గవర్నర్ల బాధ్యతల్లో మార్పులు
ఉర్జిత్ పటేల్ ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కొందరు డిప్యూటీ గవర్నర్ల పర్యవేక్షణా విభాగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకూ ఉర్జిత్ పటేల్ పర్యవేక్షించిన పరపతి విధాన శాఖను అత్యంత సీనియర్ అయిన ఆర్.గాంధీకి మార్చారు. రేటు నిర్ణయానికి సంబంధించి ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీలో ఆర్‌బీఐ తరఫున ముగ్గురు సభ్యుల్లో ఒకరిగా గాంధీని నియమించే వీలుందని సమాచారం.
మరో డిప్యూటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ యూనిట్, కార్పొరేట్ సర్వీసెస్, రిస్క్ మోనిటరీ శాఖలను పర్యవేక్షిస్తారు. డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా బ్యాంకింగ్ పర్యవేక్షణ, హెచ్‌ఆర్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్, గణాంకాలు, సమాచార నిర్వహణ విభాగాలను చూస్తారు. కాగా పటేల్ స్థానంలో కేంద్రం కొత్త డిప్యూటీ గవర్నర్‌ను నియమించాల్సి ఉంది.