
రూపాయి... 4 నెలల గరిష్టానికి
డాలర్‌తో 30 పైసలు వృద్ధి... 66.52కి చేరిక
ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ శకం ప్రారంభమైన రోజే ఫారెక్స్ మార్కెట్లో రూపాయి కూడా ర్యాలీ జరిపింది. మంగళవారం ఒక్కరోజే డాలర్‌తో రూపాయి 30 పైసలు బలపడి నాలుగు నెలల గరిష్ట స్థాయి అయిన 66.52కి చేరుకుంది. గత శుక్రవారం డాలర్‌తో రూపాయి 66.82 వద్ద ముగిసింది. అమెరికాలో బలహీన ఉద్యోగ గణాంకాలు వెల్లడైన దరిమిలా ఫెడ్ వడ్డీ రేట్ల భయాందోళనలు తగ్గిపోవడం రూపాయి ర్యాలీకి దోహదపడింది. విదేశీ బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలు జరపడం సెంటిమెంట్‌ను బలపరిచింది. రూపాయి డాలర్‌తో లాభపడడం వరుసగా ఇది ఐదో రోజు కావడం గమనార్హం.
ఈ ఏడాది మే 11న రూపాయి ముగింపు 66.56గా ఉండగా ఆ తర్వాత గరిష్ట స్థాయికి చేరుకోవడం మళ్లీ ఇదే. మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం తెరుచుకున్న ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 66.53 వద్ద ప్రారంభమైంది. ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ ఇన్నింగ్స్ ప్రారంభం కావడంతో సానుకూల సెంటిమెంట్ చోటు చేసుకుంది. ఇంట్రాడేలో ఒక దశలో 66.47 వరకూ వెళ్లిన రూపాయి చివరికి 66.52 వద్ద క్లోజ్ అయింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే 30 పైసలు (0.45శాతం) లాభపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీకితోడు ఆసియా కరెన్సీలతోనూ డాలర్ బలహీనపడడం, విదేశీ నిధుల రాక రూపాయి బలపడడానికి కారణాలుగా ఓ ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.