తయారీపైనే దృష్టి.. ప్రమాదకరం | RBI governor's word of caution on 'Make in India' campaign | Sakshi
Sakshi News home page

తయారీపైనే దృష్టి.. ప్రమాదకరం

Published Sat, Dec 13 2014 1:34 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

తయారీపైనే దృష్టి.. ప్రమాదకరం - Sakshi

తయారీపైనే దృష్టి.. ప్రమాదకరం

‘మేక్ ఇన్ ఇండియా’పై ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ వ్యాఖ్యలు
చైనాను అనుసరించడం మంచిదికాదు...
ఇరు దేశాల్లో పరిస్థితులు భిన్నమైనవి...


న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టారు. చైనాలో సత్ఫలితాలిచ్చిందన్న కారణంతో మనం కూడా తయారీ రంగాన్నే ఎక్కువగా ప్రోత్సహించడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. శుక్రవారమిక్కడ ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఎగుమ తి ఆధారిత వృద్ధి బాటను ఎంచుకున్న చైనాను  అనుసరిస్తూ.. మేక్ ఇన్ ఇండియా పేరుతో కేవలం తయారీ రంగంపైనే అధికంగా దృష్టికేంద్రీకరించడం ప్రమాదకరం. ఇలా నిర్ధిష్టంగా ఒకే రంగాన్ని ప్రోత్సహించాల్సి న అవసరం లేదని నేను భావిస్తున్నా. చైనాతో మన దే శాన్ని పోలిస్తే... కాలమాన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా భిన్నమైనవి. అయితే, దేశీ మార్కెట్ కోసం తయారీని ప్రోత్సహించేలా ‘మేక్ ఫర్ ఇండియా’గా  మార్చితే బాగుంటుంది’ అని రాజన్ పేర్కొన్నారు.

మనకు సరిపడదు...: భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ   ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. విదేశీ కంపెనీలు భారత్‌లో తమ తయారీ ప్లాంట్లను నెలకొల్పి ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేసేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. దీనిపై ఆర్‌బీఐ గవర్నర్ విమర్శలు గుప్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు మనం తయారీ ఎగుమతులపై దృష్టికేంద్రీకరిస్తే.. ముందుగా చైనాతో పోటీపడాల్సి ఉంటుందని రాజన్ చెప్పారు. ప్రపంచం మరో చైనా వంటి చౌక తయారీ హబ్‌ను కోరుకోవడం లేదన్నారు.

‘భారత్ కంటే అనేక ఏళ్లకు ముందే ఈ విధమైన వృద్ధి బాటను చైనా సహా ఆసియాలోని కొన్ని దేశాలు ఎంచుకున్నాయి. ఇదే వ్యూహాన్ని మనం అమలు చేయడం  సులువేమీ కాదు. ఎందుకంటే అంతర్జాతీయంగా ఎగుమతి కేంద్రంగా మారాలంటే.. ఎగుమతిదారులకు భారీ రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. ముడిసరుకులను చౌకగా లభించేలా చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా కరెన్సీ మారకం విలువను తక్కువస్థాయి(అండర్‌వేల్యూ)లో కొనసాగించాల్సి ఉంటుంది. ఇవన్నీచూస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో మేక్ ఇన్ ఇండియా అనేది మనకు సరిపడదు’ అని రాజన్ పేర్కొన్నారు.

దేశీ డిమాండ్‌పై దృష్టిపెట్టాలి...
దేశీయంగా ఏకీకృత మార్కెట్‌ను సృష్టించేందుగా ముందుగా ఇక్కడి డిమాండ్‌ను చేజిక్కించుకోవడంపై కంపెనీలు దృష్టిపెట్టాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు.   ‘ప్రతిపాదిత వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) వల్ల పన్నుల గందరగోళానికి తెరపడుతుంది. తద్వారా అసలైన జాతీయ మార్కెట్ ఆవిర్భవిస్తుంది. రానున్న సంవత్సరాల్లో మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇది చాలా కీలకం కూడా’ అని రాజన్ వ్యాఖ్యానించారు.
 
పొదుపును ప్రోత్సహించాలి...
దేశీయంగా ప్రజల్లో పొదుపును ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో తగిన ప్రోత్సాహకాలను ప్రకటించాలని రాజన్ సూచించారు. ‘దేశీ పొదుపు మొత్తాల నుంచే పెట్టుబడులకు భారీ మొత్తంలో నిధులు సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలో  మరిన్ని పెట్టుబడుల కోసం ప్రభుత్వం తీసుకునే పొదుపు ప్రోత్సాహక చర్యలు ఎంతగానో దోహదం చేస్తాయి. మన బ్యాంకులు మొండిబకాయిల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రాజెక్టుల మదింపులో గత తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి.

రుణాల మంజూరులో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే.. ఆర్థిక వ్యవస్థ అసలైన అవసరాలను తీర్చేందుకు వీలవుతుంది’ అని రాజన్ చెప్పారు. ఇప్పటిదాకా బడ్జెట్లలో వ్యక్తిగతంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఆదాయపు పన్ను ప్రోత్సాహకాలు  వాస్తవానికి వాళ్లకు నిజమైన ప్రయోజనాన్ని చేకూర్చడం లేదని.. అందువల్ల ఈసారి పొదుపు పెంచేదిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాగా, ద్రవ్యోల్బణాన్ని సాధ్యమైనంతవరకూ కనీస స్థాయిలో స్థిరంగా ఉంచడమే ఆర్‌బీఐ లక్ష్యమని.. దీనివల్ల వృద్ధికి సానుకూల పరిస్థితులు నెలకొంటాయన్నారు. ద్రవ్యోల్బణాన్ని మధ్య కాలానికి 2-6 శాతం శ్రేణిలో పరిమితమ య్యేలా చూసేందుకు ప్రభుత్వంతో ఆర్‌బీఐ చర్చిస్తోందని ఈ సందర్భంగా రాజన్  వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement