raghu ram rajan
-
RBI మాజీ గవర్నర్ రాఘురాం రాజన్ తో రేవంత్ టీమ్ సమావేశం
-
చైనాను భారత్ భర్తీ చేస్తుందా? ఆర్బీఐ మాజీ గవర్నర్ వ్యాఖ్యలు
దావోస్: ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో చైనాను భారత్ భర్తీ చేస్తుందని భావించడం.. తొందరపాటే (ప్రీమెచ్యూర్) అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం అన్నారు. భారత్ ఎకానమీ చాలా చిన్నదని పేర్కొంటూ, ప్రపంచ ఎకనామీని ప్రభావితం చేసే స్థాయి ఇప్పుడే దేశానికి లేదని పేర్కొన్నారు. అయితే, భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున దేశ ఎకానమీ మరింత వృద్ధి చెందుతూ, పరిస్థితి (ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో) మున్ముందు మారే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్నే ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఒక నివేదిక సందర్భంగా రాజన్ విలేకరులతో మాట్లాడారు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా పునరుద్ధరణ జరిగితే, అది ఖచ్చితంగా ప్రపంచ వృద్ధి అవకాశాలను పెంచుతుందని అన్నారు. ఈ సమయంలో విధాన రూపకర్తలు కార్మిక మార్కెట్‌తో పాటు హౌసింగ్ మార్కెట్ పరిస్థితులపై కూడా దృష్టి సారిస్తున్నారని అన్నారు. అమెరికాను ప్రస్తావిస్తూ, అక్కడ గృహాల విక్రయాలు జరగడం లేదని, అయితే ధరలు కూడా తగ్గడం లేదని అన్నారు. ‘ఇదంతా అంధకారమా లేక వినాశనమా? బహుశా కాకపోవచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే, ఖచ్చితంగా పరిస్థితి అంతా మారిపోతుంది’’ అని రాజన్ పేర్కొన్నారు. ‘‘2023లో ఇంకా 12 నెలల సమయం ఉంది. రష్యా యుద్ధం నిలిచిపోయినా, చైనా పురోగతి సాధించినా ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతుంది’’’ అని ఆయన విశ్లేషించారు. చైనా ఎకానమీ మార్చి, ఏప్రిల్ నుంచి రికవరీ సాధించే అవకాశం ఉందని కూడా రాజన్ అంచనా వేశారు. -
అది భారత భవిష్యత్తుకి మంచిది కాదంటున్న ప్రసిద్ధ ఆర్థికవేత్త
న్యూఢిల్లీ: భవిష్యత్ భారతానికి మెజారిటీవాదం తీవ్ర హానికరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విశ్లేషించారు. భారత్ పురోగతిని ప్రతి దశలోనూ ఈ మెజారిటీవాదం నిరోధిస్తుందని ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న రాజన్ అన్నారు. స్పష్టమైన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారని పేరున్న రాజన్ ఒక వెబినార్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. - శాసనపరమైన కొన్ని చర్యల ద్వారా కొన్ని విమర్శలకు ప్రభుత్వం మరింత ప్రతిస్పందించాలి. - మెజారిటీవాదం వైపు ధోరణి అపారమైన ప్రతికూల పరిణామాలను కలిగి ఉంది. ఇది ప్రతి ఆర్థిక సూత్రానికి విరుద్ధం. - భారతదేశానికి అందరి భాగస్వామ్యం కలిగిన సమ్మిళిత వృద్ధి అవసరం. ఏదైనా ఒక వర్గాన్ని రెండవ తరగతి పౌరులుగా చూస్తూ, సమ్మిళిత వృద్ధిని సాధించలేము. - మెజారిటీవాదం ప్రజలను విభజిస్తుంది. భారతదేశం కలిసి ఉండాల్సిన సమయంలో విభజన ఎంతమాత్రం మంచిదికాదు. ఇదే జరిగితే అంతర్జాతీయంగా దేశానికి బెదిరింపులు మరింత పెరుగుతాయి. - భారతదేశ ఎగుమతి విభాగం పనితీరు బాగానే ఉంది కానీ... అద్భుతం కాదు. - భారత్‌లో మహిళా కార్మిక భాగస్వామ్యం భారీగా పెరగాలి. - ప్రతి పరిణామాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకుని, తగిన నిర్ణయాలతో ముందుకువెళ్లే ప్రభుత్వం అవసరం. గణాంకాల గురించి ఇలా... భారతదేశం నేడు బలమైన వృద్ధి గణాంకాలను కలిగి ఉంది. అయితే వృద్ధి గణాంకాల పట్ల దేశం జాగ్రత్తగా ఉండాలి. క్షీణత తర్వాత లో బేస్‌తో నమోదయ్యే వృద్ధి గణాంకాల గురించి మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరాదు. వాస్తవిక వృద్ధి ధోరణి ఎల్లప్పుడూ అవసరం. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ ఎకానమీ వాస్తవంగా అంత అద్భుతంగా లేదు. బలమైన వృద్ధి గణాంకాలు ఉన్నప్పటికీ, అది మంచి ఉద్యోగావకాశాలను సృష్టించలేదు. ప్రస్తుతం పలు విభాగాల్లో మహమ్మారి కరోనా కన్నా వెనకడుగులోనే ఉన్నాము. గణాంకాలు వాస్తవింగా ఉండాలి. వాస్తవాలను దాచిపెట్టే విధంగా ఉండకూడదు. చదవండి: ఆర్థిక శాఖ వింత సూత్రీకరణ.. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ధనవంతులే నష్టపోతున్నారట! -
ఆర్బీఐ ప్యానెల్ సూచనలు : రాజన్, ఆచార్య విమర్శలు
సాక్షి, ముంబై : దేశీయ బ్యాంకింగ్ రంగంలోకార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రమోటర్లు గైడ్ లైన్స్, కార్పొరేట్ సిస్టమ్ సమీక్షకు 2020 జూన్ 12న ఆర్బీఐ నియమించిన అంతర్గత కమిటీ తాజాగా కీలక ప్రతిపాదను చేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్,నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ విభాగంలోని కఠిన ఆంక్షలు సవరణలు చేయాలంటూ సూచించింది. తద్వారా కార్పొరేట్లకు మార్గం సుగమం చేసింది. దీంతో కార్పొరేట్ కంపెనీలు, బడా పారిశ్రామిక సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు నిబంధనలు సడలించేలా ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టనుందని సమాచారం. ఫలితంగా టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ లాంటి పలు కార్పోరేట్ బిజినెస్ టైకూన్లు బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలనూ బ్యాంకింగ్ రంగంలో అనుమతించాలంటూ ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యుజి) సిఫారసు చేసింది. పదిహేనేళ్లలో ప్రైవేట్ బ్యాంక్‌ల ప్రమోటర్ల వాటా పరిమితిని ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచాలి. ఆర్థికంగా మెరుగైన పనితీరును కనబరుస్తున్న పెద్దపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రైవేట్ బ్యాంక్‌లుగా మారేందుకు అవకాశం కల్పించాలి. కనీసం 10 ఏళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తూ, రూ.50,000 కోట్లు.. అంతకు మించి ఆస్తులున్న ఎన్‌బీఎఫ్‌సీలకు అర్హత ఉండేలా నిబంధనలు అమలు చేయాలి. కొత్తగా ప్రైవేట్ బ్యాంక్ లైసెన్సుల జారీకి కనీస మూలధన అర్హతను ప్రస్తుతమున్న రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్సుల జారీకి కనీస మూలధన పరిమితిని రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచాలి. ప్రభుత్వ బ్యాంకుల పనితీరును మెరుగుపరచేందుకు అనేక చర్యలు, బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ సూచనలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతం కంటే తక్కువగా ఉండాలి మరోవైపు ఐడబ్ల్యుజీ సిఫారసులపై ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురామ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య విమర్శలు గుప్పించారు. పారిశ్రామిక వర్గాలను బ్యాంకింగ్‌లోకి అనుమతించకూడదని గట్టిగా వాదించారు. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు వారు తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు, ప్రశ్నలు లేకుండానే కార్పొరేట్ సులువుగా రుణాలు అందుబాటులోకి వచ్చేస్తాయి. కొన్ని వ్యాపార సంస్థలలో ఆర్థిక, రాజకీయ శక్తుల ప్రాబల్యం పెరిగిపోతుంది. అక్రమాలు అధికార దుర్వనియోగం పెరిగిపోతుందని అందోళన వ్యక్తం చేశారు. నిరర్ధక ఆస్తులుపెరగడానికి క్రోనీయిజం కారణమని గుర్తుచేశారు. లైసెన్సులు న్యాయంగా కేటాయించినప్పటికీ, అవినీతికి అవకాశం ఏర్పడుతుందనీ, ఇప్పటికే ప్రారంభ మూలధనం ఉన్న పెద్ద వ్యాపార సంస్థలకు అదనపు ప్రయోజనాలు చేకూరతాయని, రాజన్, ఆచార్య అభిప్రాయపడ్డారు.సోమవారం విడుదల చేసిన ఇండియన్ బ్యాంక్స్: ఎ టైమ్ టు రిఫార్మ్ అనే పరిశోధనా పత్రంలో బ్యాంకింగ్ రంగ ప్రస్తుత యథాతథ స్థితి ఆమోదయోగ్యం కాదు, బ్యాంకింగ్ పరిశ్రమను సంస్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్థిక సేవల విభాగాన్ని మూసివేయడం, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు తగదని పేర్కొన్నారు. -
దిగుమతులు తగ్గించాలనుకోవడం సరికాదు : రాజన్
సాక్షి, ముంబై: ఆత్మ నిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) చొరవల్లో భాగంగా ‘టారిఫ్‌లు పెంపుతో’ దేశం దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, దేశీయ ఉత్పత్తులను పెంచడం ద్వారా స్వయం సంమృద్ధిని సాధించాలనీ భావించడం సరికాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. గతంలో అనుసరించిన ఈ తరహా విధానాలు తగిన ఫలితాలను ఇవ్వలేదని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ నిర్వహించిన ఒక వెబ్‌నార్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒక దేశం చౌకగా వస్తున్న ముడి పదార్థాలను దిగుమతి చేసుకుని, వాటి ఆధారిత ఉత్పత్తులను ‘అంతర్జాతీయ మార్కెట్లో పోటీకి తగినట్లు’ తగిన ధర వద్ద ఎగుమతి చేయాలి. తద్వారా దేశం తగిన ప్రయోజనం పొందాలి. చైనా అనుసరించిన విధానం ఇదే. ఆ దేశం ఈ దిశలో మంచి ఫలితాలను సాధించింది. ఈ తరహా ఉత్పత్తి వాతావరణం దేశంలో నెలకొనడానికి తగిన కృషి జరగాలి’’ అని వెబ్‌నార్‌లో రాజన్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... లక్ష్యాన్ని ఉద్దేశించి కేంద్రం చేసే ప్రతిపైనా దీర్ఘకాలంలో ప్రతిఫలం అందిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో విచక్షణారహిత వ్యయ విధానాలు అనుసరించరాదు. కరోనా సవాళ్లకు ముందే దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిందన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇందుకు కారణాలను, పర్యవసానాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలని సూచించారు. భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ ఇప్పటికీ బలహీనంగా ఉందని పేర్కొన్న ఆయన, సవాళ్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి అవసరమని అన్నారు. తద్వారానే సామాన్యుని కష్టాలను తీర్చగలమని పేర్కొన్నారు. సమీప కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతర ద్రవ్య పరపతి విధానాన్నే అవలంభిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అలా భావించడం తగదు..: సన్యాల్ స్వావలంబన భారత్ ఉద్దేశం ‘దిగుమతులు తగ్గించడమో... లేక లైసెన్స్ రాజ్‌ను తిరిగి ప్రవేశపెట్టడమో లేదా సమర్థవంతంగా వ్యాపారం చేయని సంస్థలను రక్షించడమో కాదు’ అని సీఐఐ గురువారం నిర్వహించిన ఫైనాన్షియల్ మార్కెట్ 2020– వెర్చువల్ సదస్సులో కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ ప్రకటన నేపథ్యంలో సన్యాల్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యంత పటిష్టమైన, సామర్థ్యంతో కూడిన సంస్థలు సవాళ్లను ఎదుర్కొని నిలబడేట్లు చేయడమే ఆత్మ నిర్భర్ భారత్ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే సర్కార్ నిర్భర్ భారత్‌గా భావించరాదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో ఎంతో సామర్థ్యంతో పనిచేస్తున్న ఫార్మా రంగం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, అలాంటి పరిశ్రమలకు ప్రభుత్వ పరంగా తగిన సహాయ సహకారాలు అందాల్సి ఉంటుందని అన్నారు. కోవిడ్-19తో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో తిరిగి డిమాండ్ నెలకొనడానికి తక్షణం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సన్యాల్ పేర్కొన్నారు. ఆతిథ్యం వంటి ఎన్నో రంగాల్లో డిమాండ్ మెరుగుపడాల్సి ఉందని అన్నారు. -
రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం
వాషింగ్టన్ : ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (57) కీలక గౌరవాన్ని దక్కించుకున్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో భారత దేశంలో అనుసరించాల్సిన ఆర్థికవిధానాలపై పలు కీలక సూచనలు చేసిన ఆయన తాజాగా అంతర్జాతీయ ద్యవ్యనిథి సంస్థ (ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా బృందంలో చోటు దక్కించుకన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12మంది ఆర్థిక నిపుణులతో ఏర్పాటైన ఈ కమిటీలో రఘురామ్ రాజన్‌ను కూడా చేరుస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా ఒక ప్రకటన జారీ చేశారు. గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా దృక్పథాలను అందిస్తుందని ఐఎంఎఫ్ శుక్రవారం తెలిపింది. ఆర్థికమాంద్యంతో ఇబ్బందులు పడుతున్న తమ సభ్యదేశాలను ఆదుకునేందుకు, ఆర్థిక సహాయం, సంబంధిత విధానాల రూపకల్పనలో అసాధారణమైన నైపుణ్యం, అగ్రశ్రేణి నిపుణుల సలహాలు తమకిపుడు చాలా అవసరం అని ఆమె చెప్పారు. వీరంతా తమ అమూల్య సేవలను అందించేందుకు అంగీకరించడం తనకు గర్వంగా ఉందన్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న అసాధారణ సవాళ్లు, కీలక పరిణామాలు, ఇతర విధి విధానాలపై ఈ టీం సూచనలు చేయనుంది. సింగపూర్ సీనియర్ మంత్రి ,సింగపూర్ ద్రవ్య అథారిటీ చైర్మన్ షణ్ముగరత్నం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ క్రిస్టిన్ ఫోర్బ్స్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, యుఎన్ మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లార్డ్ మార్క్ మల్లోచ్ బ్రౌన్ తదితరులు కమిటీలో వున్నారు. (కరోనా : శరవేగంగా ఆర్థిక వ్యవస్థ పతనం) కాగా కోవిడ్-19 మహమ్మారి గడచిన శతాబ్దంలో ఎదురైన సంక్షోభాలన్నికంటే తీవ్రమైన సంక్షోభాన్నిఎదుర్కొంటున్నామంటూ ఇప్పటికే క్రిస్టలినా ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర మందగనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ మహమ్మారి మరింత దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్ సభ్య దేశాల్లోని సుమారు 170 దేశాల్లో తలసరి ఆదాయం క్షీణించిందని పేర్కొన్నారు. 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్‌గా పనిచేసిన రాజన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. (దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్) నకిలీ వార్తలకు చెక్ చెప్పిన రతన్ టాటా, కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం -
కోవిడ్-19 షాక్‌నకు ఆర్థిక టానిక్ అదే!
ప్రపంచమంతా మృత్యు ఘంటికలు మోగిస్తున్న కోవిడ్-19 వైరస్‌పై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ స్పందించారు. ముందు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని వ్యాఖ్యానించారు. ఆర్థిక ఉద్దీపన చర్యల గురించి ఆందోళన చెందకుండా ఈ భయంకరమైన అంటువ్యాధిని అరికట్టేందుకు పోరాడటమే ప్రభుత్వాలు చేయగలిగే గొప్ప పని అని ప్రస్తుతం చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న రాజన్ అన్నారు. కరోనావైరస్ షాక్‌కు ఉత్తమమైన ఆర్థిక టానిక్ అదే అని ఆయన అభప్రాయడ్డారు. పరిస్థితి అదుపులోనే వుందన్న విశ్వాసాన్ని కంపెనీలకు కలిగించేందుకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. ఈ విషయంలో కేంద్ర బ్యాంకులు కంటే, ఆయా ప్రభుత్వాలే ఎక్కువ స్పందించి, చర్యలు చేపట్టాలని రాజన్ వెల్లడించారు. ప్రజల ఈ వైరస్‌ను నిరోధించే చర్యల్ని కోరుకుంటున్నారని, ఈ మహమ్మారికి ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆశలో వారున్నారని పేర్కొన్నారు. వైరస్‌పై ప్రజల భయాలు, ఆందోళన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక దశాబ్దం క్రితం ఆర్థిక సంక్షోభం వైపు నెట్టివేస్తోందన్నారు. గ్లోబలైజేషన్ ఉత్పత్తి చాలా ఘోరంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే ఒక్క వారంలో ఈక్వీటీ మార్కెట్లు ఉత్థాన పతనాలను నమోదు చేసిందంటూ గుర్తు చేశారు. మరోవైపు ఈ సంవత్సరం ప్రపంచ వృద్ధి 2.8 శాతంగా వుండనుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఇది 2009 నాటి కంటే బలహీనమైనని బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ ఆర్థికవేత్తలు గురువారం హెచ్చరించారు. -
ద్రవ్య లోటుపై రఘురామ్ రాజన్ హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత ద్రవ్య లోటు ప్రమాదకర స్థాయిలో ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న తరుణంలో నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, 2016లో భారత వృద్ధి రేటు 9శాతం ఉండగా, క్రమక్రమంగా ఇప్పుడు అయిదు శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ క్రమంలో దేశంలో పెట్టుబడులు, వినియోగం, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని అభిప్రాయపడ్డారు. దేశంలోని కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ విపరీతమైన జోక్యం చేసుకుంటుందని రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్లిష్ల పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, పంపిణీ వ్యవస్థకు ప్రాధాన్యమిస్తుందని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు. విదేశీ పోటీని ఆహ్వానించాలని, కొందరు వాదిస్తున్నట్లుగా మన సంస్కృతి, సంప్రదాయాలకు ఏ మాత్రం విఘాతం కలగదని పేర్కొన్నారు. -
ఆర్బీఐ వివాదం: రఘురామ్ రాజన్ స్పందన
సాక్షి,ముంబై: కేంద్రం, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మధ్య రగులుతున్న వివాదంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తొలిసారి స్పందించారు. కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ పరస్పరం గౌరవప్రదంగా వ్యవహరించి వుంటే ప్రస్తుత వివాదాన్ని నిరోధించగలిగేదని వ్యాఖ్యానించారు. ఒక జాతీయ సంస్థ ఆర్బీఐని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసందర్భంగా అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్బీఐ బోర్డుకు మెత్తగా చురకలంటించారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ బోర్డు రాహుల్ ద్రావిడ్‌లాగా వ్యవహరించాలని, నవజోత్ సిద్ధులా దూకుడుగా ఉండకూదని వ్యాఖ్యానించారు. కార్యాచరణ నిర్ణయాలకు దూరంగా ఉంటూ, ఘర్షణాత్మక వైఖరి కాకుండా, రక్షణాత్మక ధోరణిలో ఆర్బీఐ వ్యవహరించాలని బోర్డుకు సూచించారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం, సెక్షన్ 7, ఎన్బీఎఫ్సీ, ఆర్బీఐ బోర్డు, సీఐసీ నోటీసులు తదితర వివాదాల నేపథ్యంలో రాజన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. జాతీయ సంస్థ కేంద్ర బ్యాంకు (ఆర్బీఐ)ను కాపాడుకోవాల్సి అవసరం ఉందని రాజన్ పేర్కొన్నారు. ఆర్థికమంత్రిత్వ శాఖ, ఆర్బీఐ మధ్య అనారోగ్యకరమైన భిన్నాభిప్రాయాలను బహిరంగపర్చడం ద్వారా మరింత దిగజార్చుకోకూడదని అన్నారు. ఒకసారి ఆర్బీఐ గవర్నర్‌గానో, డిప్యూటీ గవర్నర్‌గానో నియమితులైతే ప్రభుత్వం మాట వినాల్సిందేనని హితవు పలికారు. మరోవైపు ఆర్బీఐ స్వయంప్రతిపత్తిపై ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య వ్యాఖ్యలను రాజన్ ప్రశంసించారు. ఎన్‌బీఎఫ్‌సీల వివాదంపై స్పందిస్తూ కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ, ఆర్బీఐ మధ్య విబేధాలున్నా, పరస్పర గౌరవం ఇద్దరికీ వుండాలన్నారు. ఆర్బీఐ కారు సీట్ బెల్ట్ లాంటిదన్నారు. ప్రమాదాలను నివారించాలంటే సీటు బెల్టు పెట్టుకోవడం ముఖ్యమని రాజన్ వ్యాఖ్యానించారు. అలాగే కారును నడిపే ప్రభుత్వం సీట్ బెల్టు పెట్టుకోవాలా లేదా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వృద్ధిపై దృష్టిపెడితే, ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వం గురించి ఎక్కువ ఆలోచిస్తుందని రాజన్ చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయాలకు నో చెప్పే అధికారం కూడా ఆర్బీఐకి ఉంటుందని స్పష్టం చేశారు. ఎందుకంటే రాజకీయ, వ్యక్తిగత ప్రాధాన్యతలు ఆర్బీఐకి ఉండవు. కేవలం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమే ముఖ్యం. ఈ విషయంలో కేంద్రానికి, ఆర్బీఐకి మధ్య భిన్నాభిప్రాయాలున్నా పరస్పరం గౌరవించుకోవడం చాలా ముఖ్యమని రాజన్ అభిప్రాయపడ్డారు. సెక్షన్-7 ప్రభుత్వం వినియోగించి వుంటే పరిస్థితి మరింత దిగజారేదని తెలిపారు. ద్రవ్యోల్బణం విషయంలో భారతదేశం మెరుగైన పరిస్థితిలోఉందని, ద్రవ్యోల్బణాన్నికట్టడి చేసిన ఘనత ప్రభుత్వం, ఆర్బీఐకు దక్కుతుందని పేర్కొన్నారు. అయితే కరెంట్ అకౌంట్ లోటు (సిఎడి) ఆందోళనను పెంచుతున్నట్లు రాజన్ చెప్పారు. -
మరోసారి వార్తల్లో రాజన్
-
ఎక్కడి ‘రేట్లు’ అక్కడే..!
ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో నిర్ణయం రెపో రేటు 6.75 శాతం, రివర్స్ రెపో 5.75 శాతం, సీఆర్ఆర్ 4 శాతంగా కొనసాగింపు ద్రవ్యోల్బణం పెరుగుదల అంచనాలే కారణం... అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు కూడా.. ముంబై: ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈసారి అందరి అంచనాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నిర్వహించిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకుతుండటం.. ఈ నెలలో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలో దశాబ్దకాలం తర్వాత వడ్డీరేట్లను పెంచవచ్చన్న వాదనలు బలపడుతుండటం ఆర్బీఐ తాజా నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. అయితే, పరిస్థితులనుబట్టి తగిన సమయంలో రేట్ల తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తామని, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్నంతవరకూ తాము సరళ విధానాన్నే అనుసరిస్తామని గవర్నర్ రాజన్ చెప్పారు. అంతేకాకుండా.. ఆర్బీఐ ఇప్పటివరకూ అందించిన రెపో రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు ఇంకా పూర్తిగా తమ ఖాతాదారులకు బదలాయించాల్సి ఉందని కూడా ఆయన బ్యాంకర్లకు తేల్చిచెప్పారు. బ్యాంకుల వడ్డీరేట్ల మార్పులకు ప్రామాణికమైన రెపో రేటు 6.75 శాతంలో ఆర్బీఐ ఈసారి ఎలాంటీ మార్పూ చేయలేదు. దీంతో ముడిపడిన రివర్స్ రెపో రేటు ఇప్పుడ్నున్నట్లే 5.75 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతంగానే కొనసాగనుంది. ఈ ఏడాదిలో ఆర్బీఐ రెపో రేటును 1.25 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో జరిగిన సమీక్షలో అనూహ్యంగా అర శాతం రెపో కోతతో రాజన్ అందరినీ ఆశ్చర్యపరిచారు కూడా. ఇక ఫెడ్ పాలసీపైనే దృష్టి... ఆర్బీఐ తాజా సమీక్షలో తీసుకున్న నిర్ణయం సరైన దిశలోనే ఉందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే, ఈ నెల 16న అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం ఆధారంగానే వడ్డీరేట్లపై ఆర్బీఐ తదుపరి చర్యలు ఆధారపడిఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం, మెరుగైన ఉద్యోగ గణాంకాల నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్ల పెంపు మొదలవుతుందన్న వాదనలు బలంగా వినబడుతున్నాయి. దీంతో మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కివెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. మరోపక్క, అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టానికి(5 శాతం) ఎగబాకిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం గణాంకాలను కూడా ఇకపై ఆర్బీఐ నిశితంగా గమనిస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరలు పెరగడం ఆర్బీఐని ఆందోళనకు గురిచేస్తోందనేది వారి అభిప్రాయం. పాలసీలో ఇతర ముఖ్యాంశాలు... ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.4 శాతంగా ఉండొచ్చు. వ్యవసాయ రంగంలో మందగమన ధోరణి ఉంది. రుతుపవన వర్షపాతంలో కొరత కారణంగా ఖరీఫ్, రబీ దిగుబడి అంచనాలపై ప్రభావం ఉంటుంది. రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఏడాది జనవరినాటికి 6 శాతంగా, 2017 జనవరినాటికి 5 శాతంగా ఉండొచ్చు. గత రెండు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది(అక్టోబర్‌లో 5 శాతం). బ్యాంకుల మొండిబకాయిల సమస్య తగ్గుముఖం పడితే తాజా రుణాలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. చిన్న మొత్తాల పొదుపు రేట్లను మార్కెట్ వడ్డీరేట్ల (డిపాజిట్ రేట్లు)తో అనుసంధానించడంపై సమాలోచనలు జరుగుతున్నాయి. తదుపరి పాలసీ సమీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న జరుగుతుంది. రుణ రేట్లు మరింత తగ్గాల్సిందే.. బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ రాజన్ స్పష్టీకరణ ఈ ఏడాదిలో ఆర్బీఐ రెపో రేటును 1.25 శాతం తగ్గిస్తే.. బ్యాంకులు మాత్రం ఇందులో సగాన్ని(0.6 శాతం) మాత్రమే బదలాయించాయని ఆర్బీఐ గవర్నర్ మరోసారి బ్యాంకర్లకు హెచ్చరిక స్వరాన్ని వినిపించారు. బ్యాంకులు తమ రుణ రేట్లను మరింత తగ్గించేందుకు ఆస్కారం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో కొనసాగుతోందన్న స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయని కూడా రాజన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రికవరీ ఇంకా ప్రారంభస్థాయిలోనే ఉన్నందున.. ఈ ఏడాది తమ జీడీపీ అంచనా(7.4 శాతం)లో మార్పులు చేయడం లేదని రాజన్ చెప్పారు. తొలి త్రైమాసికంలో వృద్ధి 7 శాతంగా ఉంది. బ్యాంకుల మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యను తగ్గించేందుకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయని... 2017కల్లా బ్యాంకుల ఎన్పీఏలు దిగొచ్చేందుకు ఆస్కారం ఉందన్నారు. ఎన్పీఏల కట్టడికి బ్యాంకులకు మరిన్ని అధికారాలను ఇస్తున్న విషయాన్ని రాజన్ గుర్తు చేశారు. ఇక ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయడం ప్రభుత్వానికి కష్టతరమైన అంశమేనని, అయితే, అసాధ్యమేమీ కాదన్నారు. దీనివల్ల ద్రవ్యలోటు తగ్గింపు లక్ష్యానికి ఇబ్బందులేవీ ఉండబోవన్నారు. ఆదాయాలను పెంచుకోవడం లేదా, వ్యయాల కోత ద్వారా ఈ అదనపు వ్యయాన్ని ప్రభుత్వం సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని రాజన్ పేర్కొన్నారు. బ్యాంకర్ల ‘తగ్గింపు’ స్వరం... బేస్ రేటు లెక్కింపునకు కొత్త విధానం తీసుకొస్తుండటం... రెపో కోత ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదలాయించాల్సిందేనంటూ రాజన్ హెచ్చరికల నేపథ్యంలో బ్యాంకర్లు స్వరం మార్చారు. ఈ దిశగా అడుగులు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. రానున్న రోజుల్లో రుణ రేట్ల కోత ఉంటుందన్న సంకేతాలిచ్చారు. ఆర్బీఐ పాలసీ నిర్ణయం తమ అంచనాల మేరకే ఉందని పేర్కొన్నారు. తాజా పాలసీ నిర్ణయం, వ్యాఖ్యలు చూస్తుంటే ఆర్బీఐ సరళ పాలసీ విధానానికి అద్దంపడుతున్నాయి. అవసరమైన సమయంలో రేట్లు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామన్న గవర్నర్ రఘురామ్ రాజన్ సంకేతాలు ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశం. ఆర్బీఐ ప్రవేశపెట్టనున్న కొత్త బేస్ రేటు విధానాన్ని పూర్తిగా పరిశీలించి తగిన చర్యలు చేపడతాం’. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ మా అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ పాలసీ నిర్ణయం వెలువడింది. ఇప్పటివరకూ తీసుకున్న పాలసీపరమైన చర్యల ప్రభావం డిపాజిట్ రేట్ల(బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయం)లో ప్రతిబింబించింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లు మరింతగా తగ్గుతాయని భావిస్తున్నా. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చిన్న మొత్తాల పొదుపు రేట్లు మార్కెట్ వడ్డీరేట్లతో సమాన స్థాయికి వస్తే... బ్యాంకుల డిపాజిట్ రేట్లను మరింతగా తగ్గించేందుకు దోహదం చేస్తుంది. దీనివల్ల నిధుల సమీకరణ వ్యయం తగ్గుతుంది. అంతిమంగా రుణాలపై వడ్డీరేట్లను కూడా ఇంకా తగ్గుముఖం పడతాయి. - చంద్రశేఖర్ ఘోష్, బంధన్ బ్యాంక్ సీఎండీ ఇర బ్యాంకులే తగ్గించాలి: కార్పొరేట్ ఇండియా ఆర్బీఐ రెపో కోత పూర్తి ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాల్సిందేనని... రుణాలపై వడ్డీరేట్లను మరింతగా తగ్గించాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. ‘ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేలా చేయాలంటే.. అటు ఇన్వెస్టర్లు, ఇటు వినియోగదార్లు అందరికీ రుణ రేట్లను మరింతగా తగ్గించాల్సి ఉందని ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఎ.దీదార్ సింగ్ వ్యాఖ్యానించారు. రుతుపవన వర్షాలు తగినంతగా లేకపోవడంతో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బలహీనంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన చెప్పారు. ‘ఇప్పుడు ఆర్బీఐ పాలసీ రేట్ల కోతను రుణాలపై రేట్ల తగ్గింపునకు బదలాయించడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాల్సి ఉంది. పుంజుకుంటున్న రుణ వృద్ధికి అనుగుణంగా నిధులను అందించడానికి బ్యాంకులు సిద్ధంగా ఉండాలి. అధిక మొండిబకాయిల ప్రభావంతో రుణాలివ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేయకుండా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి’ అని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని అసోచామ్ ప్రెసిడెంట్ సునిల్ కనోరియా అభిప్రాయపడ్డారు. బేస్ రేటుకు కొత్త మార్గదర్శకాలు వస్తున్నాయ్... బ్యాంకుల కనీస రుణ రేటు(బేస్ రేటు) లెక్కింపు విధానానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈ వారంలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఇప్పుడున్న యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ స్థానంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారంగా బేస్ రేటును నిర్ణయించే విధంగా కొత్త విధానం ఉంటుందన్నారు. దీనివల్ల పాలసీ రేట్ల మార్పులకు అనుగుణంగా బ్యాంకులు తమ వడ్డీరేట్లలో వెంటనే దీన్ని అమలు చేయడానికి వీలవుతుందని చెప్పారు. ఇటీవలి కాలంలో రెపో రేటును భారీగానే తగ్గించినప్పటికీ.. ఈ ప్రయోజనంలో సగాన్ని మాత్రమే బ్యాంకులు కస్టమర్లకు బదలాయించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ కొత్త విధానానికి తెరతీస్తోంది. అయితే, దేశీ మార్కెట్లో డిపాజిట్ల సమీకరణ వ్యయం ఇంకా అధికంగానే ఉన్న తరుణంలో ఇది తగిన విధానం కాదని బ్యాంకర్లు వాదిస్తున్నారు. మరోపక్క, 1-3 ఏళ్ల వ్యవధిగల డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీరేట్లను భారీగా తగ్గించాయని.. ఈ స్థాయిలో బేస్ రేటును మాత్రం తగ్గించలేదంటూ రాజన్ గుర్తుచేశారు. రుణ రేట్లను మరింత తగ్గించాల్సిందేనని తేల్చిచెప్పారు. -
తయారీపైనే దృష్టి.. ప్రమాదకరం
‘మేక్ ఇన్ ఇండియా’పై ఆర్బీఐ గవర్నర్ రాజన్ వ్యాఖ్యలు చైనాను అనుసరించడం మంచిదికాదు... ఇరు దేశాల్లో పరిస్థితులు భిన్నమైనవి... న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టారు. చైనాలో సత్ఫలితాలిచ్చిందన్న కారణంతో మనం కూడా తయారీ రంగాన్నే ఎక్కువగా ప్రోత్సహించడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. శుక్రవారమిక్కడ ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎగుమ తి ఆధారిత వృద్ధి బాటను ఎంచుకున్న చైనాను అనుసరిస్తూ.. మేక్ ఇన్ ఇండియా పేరుతో కేవలం తయారీ రంగంపైనే అధికంగా దృష్టికేంద్రీకరించడం ప్రమాదకరం. ఇలా నిర్ధిష్టంగా ఒకే రంగాన్ని ప్రోత్సహించాల్సి న అవసరం లేదని నేను భావిస్తున్నా. చైనాతో మన దే శాన్ని పోలిస్తే... కాలమాన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా భిన్నమైనవి. అయితే, దేశీ మార్కెట్ కోసం తయారీని ప్రోత్సహించేలా ‘మేక్ ఫర్ ఇండియా’గా మార్చితే బాగుంటుంది’ అని రాజన్ పేర్కొన్నారు. మనకు సరిపడదు...: భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో ప్రధాని మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. విదేశీ కంపెనీలు భారత్‌లో తమ తయారీ ప్లాంట్లను నెలకొల్పి ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేసేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. దీనిపై ఆర్బీఐ గవర్నర్ విమర్శలు గుప్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు మనం తయారీ ఎగుమతులపై దృష్టికేంద్రీకరిస్తే.. ముందుగా చైనాతో పోటీపడాల్సి ఉంటుందని రాజన్ చెప్పారు. ప్రపంచం మరో చైనా వంటి చౌక తయారీ హబ్‌ను కోరుకోవడం లేదన్నారు. ‘భారత్ కంటే అనేక ఏళ్లకు ముందే ఈ విధమైన వృద్ధి బాటను చైనా సహా ఆసియాలోని కొన్ని దేశాలు ఎంచుకున్నాయి. ఇదే వ్యూహాన్ని మనం అమలు చేయడం సులువేమీ కాదు. ఎందుకంటే అంతర్జాతీయంగా ఎగుమతి కేంద్రంగా మారాలంటే.. ఎగుమతిదారులకు భారీ రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. ముడిసరుకులను చౌకగా లభించేలా చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా కరెన్సీ మారకం విలువను తక్కువస్థాయి(అండర్వేల్యూ)లో కొనసాగించాల్సి ఉంటుంది. ఇవన్నీచూస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో మేక్ ఇన్ ఇండియా అనేది మనకు సరిపడదు’ అని రాజన్ పేర్కొన్నారు. దేశీ డిమాండ్‌పై దృష్టిపెట్టాలి... దేశీయంగా ఏకీకృత మార్కెట్‌ను సృష్టించేందుగా ముందుగా ఇక్కడి డిమాండ్‌ను చేజిక్కించుకోవడంపై కంపెనీలు దృష్టిపెట్టాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ‘ప్రతిపాదిత వస్తు-సేవల పన్ను(జీఎస్టీ) వల్ల పన్నుల గందరగోళానికి తెరపడుతుంది. తద్వారా అసలైన జాతీయ మార్కెట్ ఆవిర్భవిస్తుంది. రానున్న సంవత్సరాల్లో మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇది చాలా కీలకం కూడా’ అని రాజన్ వ్యాఖ్యానించారు. పొదుపును ప్రోత్సహించాలి... దేశీయంగా ప్రజల్లో పొదుపును ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం బడ్జెట్లో తగిన ప్రోత్సాహకాలను ప్రకటించాలని రాజన్ సూచించారు. ‘దేశీ పొదుపు మొత్తాల నుంచే పెట్టుబడులకు భారీ మొత్తంలో నిధులు సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని పెట్టుబడుల కోసం ప్రభుత్వం తీసుకునే పొదుపు ప్రోత్సాహక చర్యలు ఎంతగానో దోహదం చేస్తాయి. మన బ్యాంకులు మొండిబకాయిల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రాజెక్టుల మదింపులో గత తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. రుణాల మంజూరులో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే.. ఆర్థిక వ్యవస్థ అసలైన అవసరాలను తీర్చేందుకు వీలవుతుంది’ అని రాజన్ చెప్పారు. ఇప్పటిదాకా బడ్జెట్లలో వ్యక్తిగతంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఆదాయపు పన్ను ప్రోత్సాహకాలు వాస్తవానికి వాళ్లకు నిజమైన ప్రయోజనాన్ని చేకూర్చడం లేదని.. అందువల్ల ఈసారి పొదుపు పెంచేదిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాగా, ద్రవ్యోల్బణాన్ని సాధ్యమైనంతవరకూ కనీస స్థాయిలో స్థిరంగా ఉంచడమే ఆర్బీఐ లక్ష్యమని.. దీనివల్ల వృద్ధికి సానుకూల పరిస్థితులు నెలకొంటాయన్నారు. ద్రవ్యోల్బణాన్ని మధ్య కాలానికి 2-6 శాతం శ్రేణిలో పరిమితమ య్యేలా చూసేందుకు ప్రభుత్వంతో ఆర్బీఐ చర్చిస్తోందని ఈ సందర్భంగా రాజన్ వెల్లడించారు. -
పేదల నుంచి లాభాలు పిండుకోవద్దు
మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు ఆర్బీఐ గవర్నర్ రాజన్ హితవు ముంబై: సమాజంలో అట్టడుగునున్న నిరుపేదల నుంచి కూడా లాభాలను పిండుకోవడం తగదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థ(ఎంఎఫ్ఐ)లనుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకు సంబంధించిన రుణాల విషయంలో ఎంఎఫ్ఐలు అధిక లాభాపేక్ష లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇటీవల జరిగిన ఎంఎఫ్ఐ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రఖ్యాత మేనేజ్మెంట్ గురు సీకే ప్రహ్లాద్ రాసిన ‘ద ఫార్చూన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్’ అనే పుస్తకంలో అభిప్రాయాలకు పూర్తి విరుద్ధంగా రాజన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కంపెనీలు పేదల లక్ష్యంగా వస్తు, సేవల వ్యాపారాల నిర్వహణ కోసం అనుసరించాల్సిన కొత్త వ్యాపార విధానాలను ప్రహ్లాద్ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ‘ప్రహ్లాద్ తన పుస్తకంలో అట్టడుగున సంపద దాగి ఉందంటూ పేర్కొనడం ద్వారా పేదలపై నిర్దయతో వ్యవహరించారని భావిస్తున్నా. నిరుపేదల నుంచి ఎవరైనాసరే ఎలా లాభాలు దండుకుంటారు. తమ వ్యాపారాలు నిలదొక్కుకునేందుకు అవసరమైనమేరకే స్వల్ప లాభాలకు పరిమితం కావాలనేదే నా ఉద్దేశం. ఎడాపెడా లాభాలు పిండుకుంటే అది సమాజంలో ఆందోళనలు పెరిగేందుకు దారితీస్తుంది. ప్రహ్లాద్ చెప్పిన మేనేజ్మెంట్ పాఠాలతో చాలా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మారుమూల మార్కెట్లలోకి చొచ్చుకెళ్లాయి. ముఖ్యంగా దేశంలోని కన్సూమర్ గూడ్స్, వాహన, టెలికం కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. అయితే, ఎవరైనాసరే నిరుపేదలకు సేవల విషయంలో అధిక లాభాపేక్షలేకుండా వ్యవహరించాలి’ అని రాజన్ అన్నారు. -
ప్రభుత్వ ప్రభావం నుంచి బయటపడాలి
పీఎస్బీలకు రఘురామ్ రాజన్ సూచన న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రభావం నుంచి బయటపడితే ప్రభుత్వ రంగ బ్యాంకుల పోటీతత్వం మరింత పెరుగుతుందని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. పోటీ పెరిగితే సామర్థ్యం మెరుగవుతుందని చెప్పారు. న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన భారతీయ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఐదో వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత్‌లోని అనేక పీఎస్‌బీల పనితీరు మెరుగుపర్చడానికి పాలనలోనూ, కార్యకలాపాల నిర్వహణలోనూ మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. రూ.8 వేల కోట్ల జరిమానాలు... సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా ప్రసంగిస్తూ, వ్యాపారంలో పోటీతత్వానికి వ్యతిరేకమైన పద్ధతులు పాటించిన పలు సంస్థలపై సీసీఐ ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల పెనాల్టీలు విధించిందని పేర్కొన్నారు. వివిధ రంగాలకు చెందిన కేసులు వీటిలో ఉన్నాయని చెప్పారు. -
చిన్నారి లేఖకు స్పందించిన ఆర్బిఐ గవర్నర్
కిందటి సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం డాలరుకి రూపాయి మారకం విలువను పెంచడానికి ఎంతో ప్రయత్నం చేసింది. తగ్గిపోతున్న రూపాయి విలువను ఎలా పెంచాలా అని తర్జనభర్జన పడింది. ఆ విషయం తెలుసుకున్న పదేళ్ల బాలిక 20 డాలర్ల నోటును రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌కి పంపుతూ, దేశ ఆర్థికవ్యవస్థను బాగుచేయమని ఒక ఉత్తరం రాసింది. రఘురామ్ రాజన్ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా 2013, సెప్టెంబరు 4 వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ మరుసటి రోజే లైలా ఇందిరా ఆల్వా ఆయనకు ఒక ఉత్తరం పంపింది. ‘‘నేను వార్తలలో మన ఆర్థికవ్యవస్థ కుంటుపడుతోందని విన్నాను. అలాగే డాలర్‌కి రూపాయి మారకం విలువ పడిపోతుందని కూడా విన్నాను’’ అని రాసింది. ఢిల్లీ శివార్లలోని గుర్గావ్లో నివసిస్తున్న లైలాకు కూడా మిగతా అందరి బాలికల్లాగే స్నేహితులతో ఆడుకోవడమంటే చాలా ఇష్టం. ఇంకా చదువుకోవడం, పాటలు పాడటం, గిటార్ వాయించడం, ఈత కొట్టడం... ఇలా ఎన్నో. అయితే కిందటి వేసవికాలంలో మన ఎకానమీ గురించి, ప్రతిరోజూ డాలర్‌తో రూపాయి విలువ తగ్గిపోతోందనీ, కరెంట్ అకౌంట్లో లోటు నానాటికీ పెరిగిపోతోందనీ, ఇటువంటి వార్తలు వినవలసి వచ్చినందుకు చాలా బాధ పడింది. ఆమె తల్లిదండ్రులు తెచ్చిన అనేక వార్తాపత్రికలు చదివి కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంది. ‘‘లంచగొండితనం, ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని నాకు తెలుసు. ఈ విషయం నేను వార్తాపత్రికల్లో చదివాను, మా తల్లిదండ్రులు కూడా చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు’’ అంటోంది లైలా. ‘‘ప్రజలకు సుఖంగా జీవించడానికి తగినంత ఆదాయం లేదు. వారంతా పేదరికంలోనే జీవిస్తున్నారు’’ అని బాధపడుతోంది లైలా. లైలా తల్లి ప్రియా సోమయ్యా ఆల్వా , ఆమె భర్త తరచుగా లైలాతోను, పదమూడుసంవత్సరాల ఆమె అన్నయ్యతోనూ వార్తల గురించి చర్చిస్తుంటారు. ‘‘కిందటి సెప్టెంబర్, మేమంతా భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటున్నాం. నేను మా వారు డాలర్ ధర గురించి చర్చించుకుంటున్నాం. మిస్టర్ రాజన్ రిజర్వ్‌బాంక్ గవర్నరుగా పదవీబాధ్యతలు తీసుకుంటున్నారని వార్తలో చూశాం’’ అన్నారు. మరుసటి రోజు, లైలా స్కూల్ నుంచి తిరిగి వచ్చాక, ఆమె తల్లితో ‘‘నేను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కి ఉత్తరం రాస్తాను. ఆయన మన ఎకానమీని ఇంప్రూవ్ చేస్తారు’’ అని చెప్పింది. ‘‘అలాగే. నువ్వు చిన్న పిల్లవు, నువ్వు ఏం కావాలనుకుంటే అది చెయ్యొచ్చు’’ అంది ప్రియా. ‘‘డా.రఘురామ్‌రాజన్! దయచేసి మీరు కొత్త కొత్త ఆలోచనలతో మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయండి. విదేశాల నుంచి ప్రజలంతా భారతదేశానికి రావాలని కోరుకుంటున్నాను. అంతేకాని మన దేశం గురించి ఏ ఒక్కరూ లంచగొండి దేశమనీ, చెత్త నిండిన దేశమనీ భావించకూడదు’’ అని ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం ఇటీవలే ఆమె చదువుతున్న స్కూల్ మ్యాగజీన్లో ప్రచురించారు. తాను 20 డాలర్ల నోటును ఇవ్వడానికి నిశ్చయించుకుంది. ఆ నోటు కూడా ... సెలవులకు కిందటి సంవత్సరం ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు ఆమెకు తల్లిదండ్రులు ఇచ్చారు. ఆ నోటును ఇప్పుడు బ్యాంకుకి ఇవ్వాలనుకుంటోంది లైలా. దేశానికి ఈ నోటుతో ఎంతో అవసరం ఉందని భావించింది. ‘‘ఏదైనా సరే చిన్న మొత్తంతో ప్రారంభమై పెద్ద మొత్తంగా చేకూరుతుందని చాలామంది చెబుతుంటారు. అందుకే నేను 20 డాలర్ల నోటు ఇద్దామని నిశ్చయించుకున్నాను. ప్రజలకు సరైన ఆలోచనా ధోర ణి ఉంటే, వారు ఈ మొత్తాన్ని పెద్ద మొత్తంగా చేయగలరు. ప్రతిఒక్కరూ ఎంతో కొంత సహాయం అందచేసి, మన ఆర్థికవ్యవస్థను మెరుగుపరచి, దేశ ప్రగతికి పాటుపడాలని కోరుకుంటున్నాను’’ అంటుంది లైలా. పది రోజుల తర్వాత, ఒక అధికారిక ఉత్తరం లైలా పేరుతో వచ్చింది. ఆ ఉత్తరం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ ఉత్తరం రిజర్వ్‌బ్యాంక్ నుంచి వచ్చింది. ‘‘నీ ఆలోచనకు నేను చలించిపోయాను. ప్రస్తుతం దేశానికి ఇదొక పెద్ద సవాలు. నిస్సందేహంగా మన ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుంది’’ అని సమాధానమిచ్చారు ఆ ఉత్తరంలో. ఆ కవర్లో లైలా పంపిన 20 డాలర్ల నోటు కూడా ఉంది. ‘‘నేను నీకు 20 డాలర్ల నోటు వెనక్కు పంపుతున్నాను. ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచడానికి రిజర్వ్‌బ్యాంక్ దగ్గర తగినంత నిధులు ఉన్నాయి’’ అని రాస్తూ, ఈసారి ముంబై వచ్చినప్పుడు తనను కలవమన్నారు. ‘‘నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది’’ అంది లైలా తనకు వచ్చిన జవాబు చూస్తూ. ‘‘రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌కి ఉత్తరం రాయడం సర్వసాధారణం అయ్యి ఉండవచ్చు. నా ఉత్తరం నిజంగా ఆయన చదవలేదనుకున్నాను. ఎవరికో చెప్పి సమాధానం రాయించి ఉంటారు’’అనుకుంది లైలా ఆమెకు తను పంపిన 20 డాలర్ల నోటు వెనక్కు రావడం ఆనందంగా లేదు. ‘‘బహుశ ఇలా తీసుకోవడం వాళ్లకి చిన్నతనం కావచ్చు’’ అనుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం, ‘‘దేశానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా సహాయపడతారు’’ అని ఆమెను సముదాయించారు. కిందటి నవంబరులో లైలా తండ్రి వ్యాపార నిమిత్తం ముంబై వెళ్లారు. తండ్రితో పాటు లైలా కూడా ముంబై వెళ్లింది, గవర్నర్‌ని కలవడానికి. ‘‘లైలాకి ఎంతో ఆనందం కలిగింది. ఆర్బిఐ బిల్డింగ్ చూడగానే మురిసిపోయింది. కాయిన్ మ్యూజియం చూసింది. డ బ్బును ఒకరి నుంచి ఒకరికి ఎంత సులువుగా అందచేయవచ్చో అక్కడ చూసింది. ఆమెకు అన్నిటి కంటె వింత మామా గురించి’’ అన్నారు ప్రియా. ‘‘ఆయన చాలా పొడవుగా వున్నారు’’ కళ్లు ఇంతింత చేసుకుని చెప్పింది లైలా. ‘‘మేమిద్దరం ఫొటో తీయించుకున్నాం. ఆయన పొడుగ్గా జెయింట్లా వున్నారు’’ అంది లైలా. రాజన్‌తో ఆమె సమావేశమైనప్పుడు, ఆమె ‘‘ఆర్బిఐ పేదల కోసం ఎందుకని ఎక్కువ నోట్లు ప్రింట్ చేయదు’’ అని ప్రశ్నించింది. అప్పుడు ఆయన ద్రవ్యోల్బణం గురించి, డబ్బు ఏ లెక్కన అచ్చు వేస్తారో ఆమెకు వివరంగా చెప్పారు. ఆయన వెనక ఉన్న గోడ మీద ఉన్న చిత్తరువులు చూసి, ‘‘ఒక్క లేడీ గవర్నర్ కూడా లేరేంటి?’’ అని ప్రశ్నిస్తే, ‘‘బహుశ భవిష్యత్తులో నువ్వే అవుతావేమో’’ అన్నారు రాజన్. ఆమెను పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే, ‘‘ నాకు మాత్రం ముందుగా ఫొటోగ్రాఫర్ కావాలని కోరికగా ఉంది. ఆ తరువాత గాయనిగా! బహుశ ఆ తరువాత గవర్నర్ అవుతానేమో’’ అని సమాధానమిచ్చింది. ప్రస్తుం ఆమె ఆర్థికవ్యవస్థ మీద మరీ దృష్టి సారించట్లేదు. కిందటి సంవత్సరం డాలర్‌కి 70 రూపాయలు. ప్రస్తుతం ఆ ధర 60 రూపాయలకు చేరుకుంది. 20 డాలర్ల నోటు గురించి ప్రస్తుతం ప్రశ్నిస్తే, ఒకప్పుడు తాను ఆ నోటును రూపాయలలోకి మార్చి, ఖర్చు చేయాలనుకుంది, కానీ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకుంది. ‘‘ఉత్తరంతో పాటు ఈ నోటును ఫ్రేమ్ చేయించాలనుకుంటున్నాను’’ అంటోంది లైలా. -
మూడో వడ్డింపు తప్పదా?
ముంబై: ధరల సెగతో వడ్డీరేట్లకు మరోసారి రెక్కలు రానున్నాయి! ఈ నెల 18న చేపట్టనున్న పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వరుసగా మూడో విడత కీలక పాలసీ రేట్లను పెంచడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. రెపో రేటు(ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక నిధులపై బ్యాంకులు చెల్లించే వడ్డీ)ను మరో పావు శాతం పెంచవచ్చనేది బ్రిటిష్ బ్రోకరేజి దిగ్గజం హెచ్ఎస్బీసీ అభిప్రాయం. ఒక పక్క వృద్ధి మందగమనం ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ వడ్డీరేట్ల పెంపునకే రాజన్ మొగ్గుచూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు అన్నింటికంటే ప్రధానంగా ఎగబాకుతున్న ధరలకు కళ్లెం వేయడంపైనే ఆర్బీఐ పూర్తిస్థాయిలో దృష్టి పెడుతుందని హెచ్ఎస్బీసీ పేర్కొంది. రాజన్‌కు కత్తిమీదసామే... నవంబర్‌లో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం అనూహ్యంగా 1.07 శాతం ఎగబాకి 11.24 శాతానికి(అక్టోబర్‌లో 10.17%) దూసుకెళ్లడం తెలిసిందే. ఇది తొమ్మిది నెలల గరిష్టం. మరోపక్క, అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి తిరోగమనంలోకి జారిపోయి మైనస్ 1.8 శాతం క్షీణించింది. ఈ రెండు గణాంకాలూ వెలువడిన మర్నాడే హెచ్ఎస్బీసీ తాజా అంచనాలను ప్రకటించింది. ఒకపక్క పరిశ్రమల రివర్స్‌గేర్.. మరోపక్క ధరలు చుక్కలనంటుతుండటంతో రాజన్‌కు ఈసారి పాలసీ సమీక్ష అత్యంత సవాలుగానే నిలవనుంది. సెప్టెంబర్‌లో ఆర్బీఐ పగ్గాలు చేపట్టిన రాజన్... వరుసగా రెండు సమీక్షల్లో కూడా వడ్డీరేట్లను పావు శాతం చొప్పున పెంచడం తెలిసిందే. ప్రధానంగా ధరల పెరుగుదలకు అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన ప్రకటించారు కూడా. ఇప్పుడు ద్రవ్యోల్బణం మరింత ఎగబాకుతున్న నేపథ్యంలో వడ్డీరేట్లను మరింత పెంచకతప్పని పరిస్థితి నెలకొందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే జరిగితే పారిశ్రామిక రంగం మరింత కుదేలవడం ఖాయమని కార్పొరేట్లు గగ్గోలు పెడుతున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికాదీ అదేమాట... ద్రవ్యోల్బణం ఆందోళనల ప్రభావంతో 18న మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్షలో ఆర్బీఐ పావు శాతం రేట్ల పెంపు తప్పదని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ-ఎంఎల్) అభిప్రాయపడింది. రెపో రేటు వరుస పెరుగుదల, ఈ విధానంలో నిధులసమీకరణ పరిమితుల నేపథ్యంలో బ్యాంకులు ఇక తమ అదనపు లిక్విడిటీ అవసరాలకోసం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్)పై అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కూడా పేర్కొంది. ప్రస్తుతం రెపో రేటు 7.75%, రివర్స్ రెపో 6.75%, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4%గా కొనసాగుతున్నాయి. కాగా, ఎంఎస్ఎఫ్ 8.75 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం కట్టడే తమ ప్రధాన కర్తవ్యమని తాజాగా రాజన్ మరోసారి స్పష్టీకరించిన సంగతి తెలిసిందే. మరోపక్క లిక్విడిటీ మెరుగుదలపై దృష్టిసారిస్తామని కూడా చెప్పారు. తద్వారా మరోవిడత వడ్డీరేట్ల పెంపు, ఎంఎస్ఎఫ్ తగ్గింపు సంకేతాలిచ్చారు. ‘ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. అయితే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు అంతకంతకూ ఎగబాకుతుండటంతో వృద్ధి, ధరల కట్టడి మధ్య సమతూకంతో వ్యవహరించాల్సి ఉంది’ అని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా.. టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు కూడా నవంబర్‌లో కాస్త పెరిగి.. 7.1 శాతానికి చేరొచ్చని బీఓఎఫ్ఏ-ఎంఎల్ అంచనా వేసింది. అక్టోబర్‌లో ఈ రేటు 7%. -
కాస్త కోలుకున్న రూపాయి..
ముంబై: దేశీ కరెన్సీ ఐదు రోజుల వరుస పతనానికి ఎట్టకేలకు అడ్డుకట్టపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం 41 పైసలు కోలుకొని 63.30 వద్ద స్థిరపడింది. ఎగుమతిదారులు, బ్యాంకులు తాజాగా డాలర్ల అమ్మకాలకు దిగడంతో రూపాయికి కాస్త వెన్నుదన్నుగా నిలిచిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు చెప్పాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ లోటు గత అంచనాల కంటే చాలా తక్కువగా 56 బిలియన్ డాలర్లకు(జీడీపీలో 3 శాతం లోపే) పరిమితం కావచ్చని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన ప్రకటన కూడా దేశీ కరెన్సీపై సానుకూల ప్రభావం చూపింది. కాగా, గడచిన ఐదు రోజుల్లో 209 పైసలు(3.39%) పతనమై రెండు నెలల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. -
నేడు వాషింగ్టన్కు చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరం మంగళవారం వాషింగ్టన్ బయలుదేరి వెళుతున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల్లో పాల్గొనడం ఈ అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశం. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, కోటా సంస్కరణల వంటి అంశాలపై ఈ సమావేశాలు చర్చించనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 16న చిదంబరం భారత్‌కు తిరిగి వస్తారు. 11వ తేదీ నుంచీ 13వ తేదీ వరకూ మూడు రోజుల పాటు జరిగే అగ్రస్థాయి సంస్థల వార్షిక సమావేశాల్లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మయారామ్సహా ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. -
కొత్త బ్యాంకుల లెసైన్సుల దిశగా మరో అడుగు...
రాయ్‌పూర్: కొత్త బ్యాంకు లెసైన్సులను జారీ చేసే ప్రక్రియ వేగం పుంజుకుంది. లెసైన్సుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు రిజర్వ్ బ్యాంక్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ సారథ్యం వహిస్తుండగా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్, సెబీ మాజీ చైర్మన్ సీబీ భవే, ఆర్థికవేత్త నచికేత్ మోర్ సభ్యులుగా ఉంటారు. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ విషయాలు తెలిపారు. కొత్త బ్యాంకుల అంశాన్ని పర్యవేక్షిస్తున్న డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా జనవరిలో రిటైరయ్యే లోగా లెసైన్సులను జారీ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. కొత్త బ్యాంకింగ్ లెసైన్సుల కోసం మొత్తం 26 దరఖాస్తులు వచ్చాయి. టాటా సన్స్, అనిల్ అంబానీ గ్రూప్, కుమార మంగళం బిర్లా గ్రూప్ మొదలైన దిగ్గజ సంస్థలు బరిలో ఉన్నాయి. గడచిన 20 సంవత్సరాల్లో రెండు విడతలుగా ఆర్బీఐ ప్రైవేట్ రంగంలో 12 బ్యాంకులకు లెసైన్సులు ఇచ్చింది. 1993 జనవరిలో మార్గదర్శకాల ప్రకారం అప్పట్లో పది బ్యాంకులకు లెసైన్సులు ఇచ్చింది. ఈ అనుభవాలతో 2001 జనవరిలో మార్గదర్శకాలను సవరించి.. 2003-04లో కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంకులకు ఆర్బీఐ లెసైన్సులు జారీ చేసింది. -
5.5% వృద్ధి రేటు సాధ్యమే..
రాయ్‌పూర్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగానే 5-5.5 శాతంగా ఉండగలదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఖరీఫ్ పంటల దిగుబడి, ఎగుమతులు, మౌలిక పరిశ్రమల పనితీరు మెరుగ్గా ఉండగలదన్న అంచనాల నేపథ్యంలో .. దీని గురించి సందేహించాల్సిన అవసరమేమీ కనిపించడం లేదన్నారు. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం రాజన్ ఈ విషయాలు తెలిపారు. ‘గతేడాది కన్నా ఈసారి ఖరీఫ్ దిగుబడి అంచనాలు మెరుగ్గా ఉన్నాయి. మౌలిక రంగం పనితీరు మెరుగుపడుతోంది. ఎగుమతులు కూడా కాస్త పుంజుకుంటాయేమో చూడాలి. మొత్తం మీద 5-5.5 శాతం వృద్ధి స్థాయిని సాధించగలమనే ఆశిస్తున్నాను’ అని రాజన్ పేర్కొన్నారు. 2012-13లో దశాబ్ద కనిష్టం 5 శాతానికి పడిపోయిన వృద్ధి రేటు.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 4.4 శాతానికి క్షీణించిన సంగతి తెలిసిందే. దీంతో 2013-14లో వృద్ధి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు 6 శాతం నుంచి ఏకంగా 4.7 శాతానికి కుదించింది. అటు ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) సైతం 6.4 శాతం నుంచి 5.3 శాతానికి అంచనాలను కుదించిన నేపథ్యంలో తాజాగా వృద్ధిపై రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చౌక రుణాలపై కసరత్తు.. ద్విచక్ర వాహనాలు, వినియోగ వస్తువుల కొనుగోళ్ల కోసం తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనంగా నిధులు సమకూర్చే స్కీముపై ఇంకా కసరత్తు జరుగుతోందని రాజన్ తెలిపారు. ఏ విధంగా దీన్ని అమలు చేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు బడ్జెట్లో పేర్కొన్న రూ. 14,000 కోట్ల కంటే అదనంగా పెట్టుబడులు సమకూర్చాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవైపు అధిక వడ్డీరేట్ల కారణంగా రుణాలు తీసుకోవడానికి వెనుకాడుతున్న కొనుగోలుదారులకు, మరోవైపు డిమాండ్ లేక కుదేలవుతున్న పరిశ్రమకి ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, రూపాయి పతనాన్ని కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా స్వాప్ విధానం ద్వారా సెప్టెంబర్ 4 నుంచి ఇప్పటిదాకా 5.6 బిలియన్ డాలర్లు వచ్చినట్లు రాజన్ పేర్కొన్నారు. రాష్ట్రాలపై నివేదిక సరైనదే.. రాష్ట్రాల వెనుకబాటుతనంపై నివేదిక విషయానికి సంబంధించి పలు అంశాలను కమిటీ పరిగణనలోకి తీసుకుందని రాజన్ పేర్కొన్నారు. అయితే, తొలి పది స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు చాలా సంపన్నమైనవని, దిగువ స్థాయిలో ఉన్న పది రాష్ట్రాలు అత్యంత పేద రాష్ట్రాలని భావించనక్కర్లేదని ఆయన చెప్పారు. ఫార్ములా ప్రకారం స్కోరు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని, అదే విధంగా మెరుగైన పనితీరు కనపర్చినా కూడా ఎక్కువ నిధులు దక్కే అవకాశాలూ ఉన్నాయని రాజన్ పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో మిగతా వివాదాలేమైనా ఉంటే అవన్నీ రాజకీయపరమైనవేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల స్థితిగతులపై రాజన్ కమిటీ ఇచ్చిన నివేదికలో గోవా, కేరళకు సంపన్న రాష్ట్రాలుగాను, ఒడిసా..బీహార్‌లకు అత్యంత వెనుక బడ్డ రాష్ట్రాలుగాను పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, తన మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కట్టబెట్టేందుకు కేంద్రం ఇలాంటి గిమ్మిక్కులు చేస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత ఆర్బీఐ నివేదికను కొట్టిపారేశారు. -
18,500-20,500 శ్రేణిలోనే సెన్సెక్స్!
న్యూఢి ల్లీ: రిజర్వు బ్యాంకు కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ చేపట్టిన పరపతి విధాన సమీక్ష నిరుత్సాహపరచడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు దిద్దుబాటు(కరెక్షన్)కు లోనయ్యే అవకాశముందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీవోఎఫ్‌ఏఎంఎల్) అంచనా వేసింది. ప్రస్తుత స్థాయిల నుంచి 6-8% వరకూ క్షీణించవచ్చని తన నివేదికలో పేర్కొంది. వెరసి రానున్న కాలంలో సెన్సెక్స్ 18,500-20,500 పాయింట్ల స్థాయిలో సంచరించవచ్చని ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం అభిప్రాయపడింది. ఆర్థిక పరిస్థితులు, కంపెనీల పనితీరు బలహీనంగా ఉన్న కారణంగా మార్కెట్లు పుంజుకునే అవకాశం తక్కువేనని తెలిపింది. కాగా, మరోవైపు వడ్డీ రేట్ల తగ్గింపు, పాలసీ చర్యలు మార్కెట్లు భారీగా క్షీణించకుండా అడ్డుకుంటాయని వివరించింది. కాగా, తమ అంచనాల ప్రకారం ప్రస్తుతం మార్కెట్లు గరిష్ట స్థాయి శ్రేణికి దగ్గరలో ఉన్నందున లాభాలకు అవకాశాలు తక్కువేనని బీవోఎఫ్‌ఏఎంఎల్ పేర్కొంది. దీనికితోడు బ్లూచిప్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు 21%కు చేరడం కూడా రిస్క్‌ను పెంచుతున్నదని వ్యాఖ్యానించింది. వర్థమాన మార్కెట్లలో ఎఫ్ఐఐలు అమ్మకాలు చేపడితే దేశీయ స్టాక్ మార్కెట్లు అత్యధికంగా ప్రభావితమవుతాయని తెలిపింది. ప్రస్తుతం సెంటిమెంట్ ప్రతికూలంగా మారిందని, ఇకపై పరిస్థితులు మరింత బలహీనపడితే ఎఫ్ఐఐల పెట్టుబడులు తిరోగమించవచ్చునని అంచనా వేసింది. వీటితోపాటు, కంపెనీల పనితీరు, ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ దృష్టి, రానున్న సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నివేదికలో పేర్కొంది. స్వల్పలాభాలతో ముగిసిన సూచీలు రెండు రోజుల డౌన్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడింది. సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో మంగళవారం క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్, పవర్ షేర్లలో జరిగిన షార్ట్ కవరింగ్ ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్పలాభంతో 19,920 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెట్ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ డౌన్‌గ్రేడ్ చేయడంతో ట్రేడింగ్ ప్రారంభంలో 19,782 పాయింట్ల స్థాయికి సెన్సెక్స్ పడిపోయింది. కనిష్టస్థాయి వద్ద షార్ట్ కవరింగ్ ప్రభావంతో వేగంగా కోలుకుని 20,050 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. మధ్యాహ్న సెషన్ తర్వాత మెటల్స్, పీఎస్‌యూ షేర్లలో విక్రయాలు జరగడంతో మళ్లీ సెన్సెక్స్ తగ్గింది. ఇలా 270 పాయింట్ల శ్రేణిలో సూచీ హెచ్చుతగ్గులకు లోనయ్యింది. 5,850-5,940 పాయింట్ల శ్రేణి మధ్య కదలిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 2.7 పాయింట్ల లాభంతో 5,892 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీల్లో రోలోవర్స్ జోరు... డెరివేటివ్స్ విభాగంలో సెప్టెంబర్ నెల కాంట్రాక్టులకు సంబంధించి అటు షార్ట్స్, ఇటు లాంగ్ పొజిషన్ల స్క్వేర్‌ఆఫ్ యాక్టివిటీ ఎక్కువగా జరిగింది. అయితే ట్రేడింగ్ అధికంగా జరిగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాంట్రాక్టులు అక్టోబర్ నెలకు రోలోవర్స్ జోరుగా సాగాయి. ఈ రెండు సూచీలు రానున్న కొద్దిరోజులూ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే సంకేతాలను ఈ రోలోవర్స్ సూచిస్తున్నాయి. నిఫ్టీ ఫ్యూచర్ సెప్టెంబర్ కాంట్రాక్టుల ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 10.40 లక్షల షేర్లు కట్‌కాగా, అక్టోబర్ ఫ్యూచర్లో 33.82 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. అక్టోబర్ సిరీస్ ప్రారంభానికి మరో మూడు రోజుల గడువు వున్నప్పటికీ నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్ ఓఐ 1.16 కోట్ల షేర్లకు చేరింది. బ్యాంక్ నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్ నుంచి 2.29 లక్షల షేర్లు కట్‌కాగా, అక్టోబర్ ఫ్యూచర్లో 5 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. -
మరో 363 పాయింట్లు డౌన్
రిజర్వుబ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అనూహ్యంగా వడ్డీ రేట్లను పెంచుతూ శుక్రవారం ఇచ్చిన షాక్ ప్రభావం వరుసగా రెండోరోజు మార్కెట్లపై కనిపించింది. సోమవారం బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్ఈ సెన్సెక్స్ మరో 363 పాయింట్లు నష్టపోయి 19,900 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారంనాటి గరిష్టస్థాయి నుంచి సెన్సెక్స్ 800 పాయింట్లకుపైగా నష్టపోయింది. 122 పాయింట్లు తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 5,890 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోగా మరో ఆరశాతం వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచవచ్చన్న అంచనాలను అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థలు వెల్లడించడంతో బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో అమ్మకాలు కొనసాగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మూడూ కలిపి సెన్సెక్స్‌లో 155 పాయింట్లు నష్టపర్చాయి. ఈ మూడింటితో పాటు ఎస్బీఐ సైతం 5 శాతం మేర పడిపోయింది. రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ 10 శాతం క్షీణించగా, ఓఎన్జీసీ, మారుతి, ఎల్ అండ్ టీలు 3-4 శాతం తగ్గాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ షేర్లు 4-10 శాతం మధ్య క్షీణించాయి. మెటల్ షేర్లు సేసా గోవా, హిందాల్కోలు స్వల్పంగా పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ. 80 కోట్ల మేర నికర విక్రయాలు జరపగా, దేశీయ సంస్థలు రూ. 745 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. దీంతో ఆర్బీఐ పాలసీ ప్రకటన వెలువడినప్పటి నుంచి దేశీయ ఫండ్స్ రూ. 1,500 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్లయ్యింది. బ్యాంకింగ్ కౌంటర్లలో షార్ట్ రోలోవర్స్... సోమవారంనాటి మార్కెట్లో బాగా క్షీణించిన బ్యాంకింగ్ కౌంటర్లలో జోరుగా రోలోవర్ యాక్టివిటీ చోటుచేసుకుంది. మరో మూడు రోజుల్లో సెప్టెంబర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్ సిరీస్‌కు భారీగా షార్ట్ రోలోవర్స్ జరిగినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. రిజర్వుబ్యాంక్ నాటకీయంగా పాలసీ రేట్లను పెంచడం, కొన్ని బ్యాంకుల డెట్ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్ చేయడంతో ఇన్వెస్టర్లు వారి క్యాష్ పొజిషన్లను రక్షించుకునేందుకు బ్యాంకింగ్ కౌంటర్లలో షార్ట్చేసివుండొచ్చని, ఈ షేర్లు మరింత తగ్గొచ్చన్న అంచనాలతో ట్రేడర్లు ఈ నెల సిరీస్‌లో షార్ట్స్‌ను కవర్ చేసి, వచ్చే నెలకు రోలోవర్ చేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 4%పైగా క్షీణించిన బ్యాంక్ నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్లో 37 వేల షేర్లు కట్‌కాగా, అక్టోబర్ కాంట్రాక్టులో 1.89 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ తరహాలోనే పలు బ్యాంకింగ్ కౌంటర్లలో ఈ నెల కాంట్రాక్టుల నుంచి తగ్గిన షేర్లకంటే వచ్చే నెల కాంట్రాక్టుల్లో యాడ్ అయిన షేర్లు చాలా ఎక్కువ. ఇలా ఎక్కువ షేర్లు యాడ్కావడం, మరోవైపు షేర్లు భారీగా క్షీణించడం షార్ట్ పొజిషన్లు క్రియేషన్‌ను సూచిస్తున్నది. ఎస్బీఐ అక్టోబర్ కాంట్రాక్టులో 9.65 లక్షల షేర్లు యాడ్‌కాగా, ఈ నెల ఫ్యూచర్ నుంచి 35 వేలు మాత్రమే కట్ అయ్యాయి. మిడ్‌సైజ్ పీఎస్‌యూ కౌంటర్లలో షార్ట్ రోలోవర్స్ అధికంగా సాగాయి. వచ్చే నెల సిరీస్‌కు బ్యాంక్ ఆఫ్ బరోడా కౌంటర్లో 10.62 లక్షలు, పీఎన్బీ ఫ్యూచర్లో 11.84 లక్షలు, యూనియన్ బ్యాంక్ కాంట్రాక్టులో 19.25 లక్షలు, బీఓఐ కౌంటర్లో 9.54 లక్షల షేర్ల చొప్పున యాడ్ అయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ కౌంటర్లోనూ ఈ తరహా యాక్టివిటీ ఎక్కువగా జరిగింది. ఈ కాంట్రాక్టులో 14.50 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. షేరు తగ్గొచ్చన్న అంచనాలతో ఫ్యూచర్ కాంట్రాక్టును విక్రయించడాన్ని షార్ట్ సెల్లింగ్‌గా వ్యవహరిస్తారు. ఈ నెలలో ఇంతకుమునుపు విక్రయించిన కాంట్రాక్టును కొని(స్క్వేర్ ఆఫ్), వచ్చే నెలకు ఇదే షేరుకు సంబంధించిన కాంట్రాక్టును తిరిగి అమ్మడాన్ని షార్ట్ రోలోవర్గా పరిగణిస్తారు. -
మరో అర శాతం ‘వడ్డింపు'?
ముంబై: ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న విశ్లేషకులు.. రానున్న రోజుల్లో మరింత కఠిన విధానం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా(మార్చిలోపు) కీలకమైన రెపో రేటును ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మరో అర శాతం వరకూ పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తొలి పాలసీ సమీక్షలోనే అనూహ్యంగా రెపో రేటును పెంచి అటు మార్కెట్ వర్గాలను, ఇటు ఆర్థికవేత్తలు, విశ్లేషకులను కూడా రాజన్ అవాక్కయ్యేలా చేశారు. ‘తాజా రెపో పెంపును చూస్తే... కొత్త ఆర్బీఐ గవర్నర్ కూడా వృద్ధి రేటు కంటే ధరలకు కళ్లెం వేయడంపైనే దృష్టిసారిస్తున్నారనేది స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలోపు మరో రెండు పాలసీ సమీక్షల్లో చెరో పావు శాతం చొప్పున రెపో రేటు పెంపు ఉండొచ్చని భావిస్తున్నాం. దీంతో ఇది 8 శాతానికి చేరనుంది’ అని బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం స్టాండర్డ్ చార్టర్డ్ ఆర్థికవేత్తలు పేర్నొన్నారు. జపాన్ బ్రోకరేజి సంస్థ నోమురా కూడా వచ్చే మార్చిలోపే మరో అర శాతం రెపో పెంపును అంచనా వేసింది. ఈ ఏడాది పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని, అదేవిధంగా వచ్చే సంవత్సరంలో ముప్పావు శాతం రెపో కోత ఉండొచ్చని గతంలో నోమురా అభిప్రాయపడింది. ఇప్పుడు ఆర్బీఐ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో తాము కూడా అంచనాలను మార్చుకున్నట్లు నోమురా పేర్కొంది. కాగా, రానున్న నెలల్లో మరో రెండు విడతల్లో రెపో పెంపు ఉండొచ్చని క్రెడిట్ సుసీ ఆర్థికవేత్తలు కూడా అంచనా వేశారు. అయితే, ఎంతమేరకు పెంచొచ్చనేది వెల్లడించలేదు. ద్రవ్యోల్బణంపైనే గురి... ఈ నెల 20న జరిపిన మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్షలో రెపో(బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే నిధులపై చెల్లించే వడ్డీరేటు) రేటును రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పావు శాతం పెంచడం తెలిసిందే. దీంతో ఇది 7.5 శాతానికి చేరింది. మరోపక్క, బ్యాం కులకు ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) పెంచేలా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్)లో ముప్పావు శాతం తగ్గించి(9.5 శాతానికి) కాస్త ఊరట కల్పించారు. ధరల కట్టడే ప్రధాన లక్ష్యమని, రానున్న పాలసీల్లో కూడా ద్రవ్యోల్బణం గణాంకాలే ప్రభావం చూపుతాయని రాజన్ పేర్కొనడం గమనార్హం. ఆగస్టులో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్టానికి(6.1%) ఎగబాకగా... రిటైల్ ద్రవ్యోల్బణం కూడా అధిక స్థాయిలోనే(9.52%)గా నమోదైంది. ఈ ద్రవ్యోల్బణం ఆందోళనలే రెపో పెంపునకు ముఖ్య కారణమని రాజన్ పేర్కొన్నారు. ఆర్బీఐ చర్యలతో రుణ, డిపాజిట్ రేట్లను పెంచక తప్పదని ఎస్బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి పాలసీ సమీక్ష అనంతరం వ్యాఖ్యానించడం తెలిసిందే. రూపాయి విలువ స్థిరీకరణ జరిగితే... ఎంఎస్ఎఫ్ను గత స్థాయికి తగ్గించే అవకాశం ఉందని నోమురా అంటోంది. రూపాయికి చికిత్సలో భాగంగా జూలైలో ఎంఎస్ఎఫ్ను ఆర్బీఐ రెండు శాతం పెంచి 10.25 శాతానికి చేర్చింది. దీనిలో తాజాగా ముప్పావు శాతం తగ్గింపును రాజన్ ప్రకటించారు. రెపో, ఎంఎస్ఎఫ్ మధ్య వ్యత్యాసాన్ని 1 శాతానికి తీసుకురావాల్సి ఉందని కూడా ఆయన పాలసీ సందర్భంగా పేర్కొనడం విదితమే. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 2 శాతంగా ఉంది. -
రాజన్‌కు తొలి పరీక్ష!
ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ నేడు(శుక్రవారం) చేపట్టనున్న తొలి పరపతి విధాన సమీక్షపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. కార్పొరేట్ల నుంచి మార్కెట్ వర్గాలు, ఆర్థికవేత్తల వరకూ దేశవ్యాప్తంగా ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే ఉత్కంఠతో వేచిచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి గాడిలోపెట్టేందుకు తక్షణం వడ్డీరేట్లను తగ్గించాలంటూ ఒకపక్క కార్పొరేట్లు డిమాండ్ చేస్తుండగా... ద్రవ్యోల్బణం ఆందోళనకరమైన రీతిలో ఆర్నెల్ల గరిష్టానికి(6.1 శాతం) ఎగబాకిన నేపథ్యంలో రాజన్‌కు తొలి సమీక్ష కత్తిమీదసామేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, ఆశ్చర్యకరమైన రీతిలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం అటు దేశీ మార్కెట్లకూ, ఇటు రూపాయికీ బూస్ట్ ఇచ్చాయి. ఈ అనూహ్య ఊరట నేపథ్యంలో ఆర్బీఐ పాలసీ సమీక్షలో కఠిన విధానాన్ని సడలించేందుకు(వడ్డీరేట్ల కోత, ద్రవ్యసరఫరా పెంపు) కొంత ఆస్కారం కల్పిస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 18న ఫెడ్ పాలసీ నిర్ణయం ఉండటంవల్లే ఆర్బీఐ పాలసీ సమీక్షను 20వ తేదీకి వాయిదా వేయడం కూడా గమనార్హం. బ్యాంకర్లదీ రేట్ల కోత డిమాండే... ద్రవ్యసరఫరా పెంపు, నిధుల లభ్యత పెంచాలంటూ ఇప్పటికే తాము ఆర్బీఐకి సూచించామని ఎస్బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి పేర్కొన్నారు. సీఆర్ఆర్, రెపో రేటు కోతతో పాటు మార్జినల్ స్టాండిగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్)ను ఒక స్థాయికే పరిమితం చేయొద్దని కూడా తాము కోరామని చెప్పారు. పండుగల సీజన్ డిమాండ్ నేపథ్యంలో రుణాలను చౌకగా అందించాలంటే ఆర్బీఐ పాలసీ రేట్ల తగ్గింపు తప్పనిసరి అని పలువురు బ్యాంకర్లు ఘంటాపథంగా చెబుతున్నారు. యథాతథంగానే: నిపుణులు అధిక ద్రవ్యోల్బణం, రూపాయి తీవ్ర హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఆర్బీఐ సమీక్షలో కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయని కొంతమంది నిపుణులు అంటున్నారు. వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందని తాను భావించడం లేదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రిస్క్‌లు, రూపాయి పతనం ప్రభావంతో గత సమీక్షలో కూడా అప్పటి గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించడం తెలిసిందే. దీంతో రెపో రేటు(బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే నిధులపై చెల్లించే వడ్డీరేటు) 7.25 శాతంగా, సీఆర్ఆర్(బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సి నిధుల నిష్పత్తి) 4 శాతం వద్దే ఉన్నాయి. కాగా, రూపాయి పతనం చికిత్స కోసం ద్రవ్య సరఫరా కట్టడిలో భాగంగా ఆర్బీఐ ఈ ఏడాది జూలైలో బ్యాంక్ రేటు, ఎంఎస్‌ఎఫ్‌లను చెరో రెండు శాతం పెంచి 10.25 శాతానికి చేర్చింది. దీనివల్ల బ్యాంకులకు నిధుల లభ్యత భారంగా మారింది. బ్యాంకులకు ద్రవ్యసరఫరా కొరత భారీగా తలెత్తినప్పుడు అధిక వడ్డీరేటుకు ఆర్బీఐ నుంచి నిధులను తీసుకోవడం కోసం ఎంఎస్ఎఫ్ను ఆర్బీఐ 2011-12లో కొత్తగా ప్రవేశపెట్టిన విషయం విదితమే. కాగా, ఈ కఠిన ద్రవ్యసరఫరా చర్యలను తాజా పాలసీలో వెనక్కి తీసుకునే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.