న్యూఢి ల్లీ: రిజర్వు బ్యాంకు కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ చేపట్టిన పరపతి విధాన సమీక్ష నిరుత్సాహపరచడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు దిద్దుబాటు(కరెక్షన్)కు లోనయ్యే అవకాశముందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీవోఎఫ్‌ఏఎంఎల్) అంచనా వేసింది. ప్రస్తుత స్థాయిల నుంచి 6-8% వరకూ క్షీణించవచ్చని తన నివేదికలో పేర్కొంది. వెరసి రానున్న కాలంలో సెన్సెక్స్ 18,500-20,500 పాయింట్ల స్థాయిలో సంచరించవచ్చని ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం అభిప్రాయపడింది. ఆర్థిక పరిస్థితులు, కంపెనీల పనితీరు బలహీనంగా ఉన్న కారణంగా మార్కెట్లు పుంజుకునే అవకాశం తక్కువేనని తెలిపింది. కాగా, మరోవైపు వడ్డీ రేట్ల తగ్గింపు, పాలసీ చర్యలు మార్కెట్లు భారీగా క్షీణించకుండా అడ్డుకుంటాయని వివరించింది.
కాగా, తమ అంచనాల ప్రకారం ప్రస్తుతం మార్కెట్లు గరిష్ట స్థాయి శ్రేణికి దగ్గరలో ఉన్నందున లాభాలకు అవకాశాలు తక్కువేనని బీవోఎఫ్‌ఏఎంఎల్ పేర్కొంది. దీనికితోడు బ్లూచిప్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు 21%కు చేరడం కూడా రిస్క్‌ను పెంచుతున్నదని వ్యాఖ్యానించింది. వర్థమాన మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు అమ్మకాలు చేపడితే దేశీయ స్టాక్ మార్కెట్లు అత్యధికంగా ప్రభావితమవుతాయని తెలిపింది. ప్రస్తుతం సెంటిమెంట్ ప్రతికూలంగా మారిందని, ఇకపై పరిస్థితులు మరింత బలహీనపడితే ఎఫ్‌ఐఐల పెట్టుబడులు తిరోగమించవచ్చునని అంచనా వేసింది. వీటితోపాటు, కంపెనీల పనితీరు, ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ దృష్టి, రానున్న సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నివేదికలో పేర్కొంది.
స్వల్పలాభాలతో ముగిసిన సూచీలు
రెండు రోజుల డౌన్‌ట్రెండ్‌కు బ్రేక్‌పడింది. సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో మంగళవారం క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్, పవర్ షేర్లలో జరిగిన షార్ట్ కవరింగ్ ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్పలాభంతో 19,920 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెట్ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ డౌన్‌గ్రేడ్ చేయడంతో ట్రేడింగ్ ప్రారంభంలో 19,782 పాయింట్ల స్థాయికి సెన్సెక్స్ పడిపోయింది. కనిష్టస్థాయి వద్ద షార్ట్ కవరింగ్ ప్రభావంతో వేగంగా కోలుకుని 20,050 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. మధ్యాహ్న సెషన్ తర్వాత మెటల్స్, పీఎస్‌యూ షేర్లలో విక్రయాలు జరగడంతో మళ్లీ సెన్సెక్స్ తగ్గింది. ఇలా 270 పాయింట్ల శ్రేణిలో సూచీ హెచ్చుతగ్గులకు లోనయ్యింది. 5,850-5,940 పాయింట్ల శ్రేణి మధ్య కదలిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 2.7 పాయింట్ల లాభంతో 5,892 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీల్లో రోలోవర్స్ జోరు...
డెరివేటివ్స్ విభాగంలో సెప్టెంబర్ నెల కాంట్రాక్టులకు సంబంధించి అటు షార్ట్స్, ఇటు లాంగ్ పొజిషన్ల స్క్వేర్‌ఆఫ్ యాక్టివిటీ ఎక్కువగా జరిగింది. అయితే ట్రేడింగ్ అధికంగా జరిగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాంట్రాక్టులు అక్టోబర్ నెలకు రోలోవర్స్ జోరుగా సాగాయి. ఈ రెండు సూచీలు రానున్న కొద్దిరోజులూ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే సంకేతాలను ఈ రోలోవర్స్ సూచిస్తున్నాయి. నిఫ్టీ ఫ్యూచర్ సెప్టెంబర్ కాంట్రాక్టుల ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 10.40 లక్షల షేర్లు కట్‌కాగా, అక్టోబర్ ఫ్యూచర్లో 33.82 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. అక్టోబర్ సిరీస్ ప్రారంభానికి మరో మూడు రోజుల గడువు వున్నప్పటికీ నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్ ఓఐ 1.16 కోట్ల షేర్లకు చేరింది. బ్యాంక్ నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్ నుంచి 2.29 లక్షల షేర్లు కట్‌కాగా, అక్టోబర్ ఫ్యూచర్లో 5 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి.