రాజన్‌కు తొలి పరీక్ష!
ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ నేడు(శుక్రవారం) చేపట్టనున్న తొలి పరపతి విధాన సమీక్షపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. కార్పొరేట్ల నుంచి మార్కెట్ వర్గాలు, ఆర్థికవేత్తల వరకూ దేశవ్యాప్తంగా ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే ఉత్కంఠతో వేచిచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి గాడిలోపెట్టేందుకు తక్షణం వడ్డీరేట్లను తగ్గించాలంటూ ఒకపక్క కార్పొరేట్లు డిమాండ్ చేస్తుండగా... ద్రవ్యోల్బణం ఆందోళనకరమైన రీతిలో ఆర్నెల్ల గరిష్టానికి(6.1 శాతం) ఎగబాకిన నేపథ్యంలో రాజన్‌కు తొలి సమీక్ష కత్తిమీదసామేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, ఆశ్చర్యకరమైన రీతిలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం అటు దేశీ మార్కెట్లకూ, ఇటు రూపాయికీ బూస్ట్ ఇచ్చాయి. ఈ అనూహ్య ఊరట నేపథ్యంలో ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో కఠిన విధానాన్ని సడలించేందుకు(వడ్డీరేట్ల కోత, ద్రవ్యసరఫరా పెంపు) కొంత ఆస్కారం కల్పిస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 18న ఫెడ్ పాలసీ నిర్ణయం ఉండటంవల్లే ఆర్‌బీఐ పాలసీ సమీక్షను 20వ తేదీకి వాయిదా వేయడం కూడా గమనార్హం.
బ్యాంకర్లదీ రేట్ల కోత డిమాండే...
ద్రవ్యసరఫరా పెంపు, నిధుల లభ్యత పెంచాలంటూ ఇప్పటికే తాము ఆర్‌బీఐకి సూచించామని ఎస్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి పేర్కొన్నారు. సీఆర్‌ఆర్, రెపో రేటు కోతతో పాటు మార్జినల్ స్టాండిగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్)ను ఒక స్థాయికే పరిమితం చేయొద్దని కూడా తాము కోరామని చెప్పారు. పండుగల సీజన్ డిమాండ్ నేపథ్యంలో రుణాలను చౌకగా అందించాలంటే ఆర్‌బీఐ పాలసీ రేట్ల తగ్గింపు తప్పనిసరి అని పలువురు బ్యాంకర్లు ఘంటాపథంగా చెబుతున్నారు.
యథాతథంగానే: నిపుణులు
అధిక ద్రవ్యోల్బణం, రూపాయి తీవ్ర హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఆర్‌బీఐ సమీక్షలో కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయని కొంతమంది నిపుణులు అంటున్నారు. వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందని తాను భావించడం లేదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రిస్క్‌లు, రూపాయి పతనం ప్రభావంతో గత సమీక్షలో కూడా అప్పటి గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించడం తెలిసిందే. దీంతో రెపో రేటు(బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే నిధులపై చెల్లించే వడ్డీరేటు) 7.25 శాతంగా, సీఆర్‌ఆర్(బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సి నిధుల నిష్పత్తి) 4 శాతం వద్దే ఉన్నాయి. కాగా, రూపాయి పతనం చికిత్స కోసం ద్రవ్య సరఫరా కట్టడిలో భాగంగా ఆర్‌బీఐ ఈ ఏడాది జూలైలో బ్యాంక్ రేటు, ఎంఎస్‌ఎఫ్‌లను చెరో రెండు శాతం పెంచి 10.25 శాతానికి చేర్చింది. దీనివల్ల బ్యాంకులకు నిధుల లభ్యత భారంగా మారింది. బ్యాంకులకు ద్రవ్యసరఫరా కొరత భారీగా తలెత్తినప్పుడు అధిక వడ్డీరేటుకు ఆర్‌బీఐ నుంచి నిధులను తీసుకోవడం కోసం ఎంఎస్‌ఎఫ్‌ను ఆర్‌బీఐ 2011-12లో కొత్తగా ప్రవేశపెట్టిన విషయం విదితమే. కాగా, ఈ కఠిన ద్రవ్యసరఫరా చర్యలను తాజా పాలసీలో వెనక్కి తీసుకునే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.