ఎక్కడి ‘రేట్లు’ అక్కడే..! | RBI Governor Raghuram decision was taken in line with the expectations of everyone. | Sakshi
Sakshi News home page

ఎక్కడి ‘రేట్లు’ అక్కడే..!

Published Wed, Dec 2 2015 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM

ఎక్కడి ‘రేట్లు’ అక్కడే..!

ఎక్కడి ‘రేట్లు’ అక్కడే..!

ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో నిర్ణయం
రెపో రేటు 6.75 శాతం, రివర్స్ రెపో 5.75 శాతం,
సీఆర్‌ఆర్ 4 శాతంగా కొనసాగింపు
ద్రవ్యోల్బణం పెరుగుదల అంచనాలే కారణం...
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు కూడా..
 
 ముంబై:
ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈసారి అందరి అంచనాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నిర్వహించిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకుతుండటం.. ఈ నెలలో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలో దశాబ్దకాలం తర్వాత వడ్డీరేట్లను పెంచవచ్చన్న వాదనలు బలపడుతుండటం ఆర్‌బీఐ తాజా నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచాయి.
 
  అయితే, పరిస్థితులనుబట్టి తగిన సమయంలో రేట్ల తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తామని, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్నంతవరకూ తాము సరళ విధానాన్నే అనుసరిస్తామని గవర్నర్ రాజన్ చెప్పారు. అంతేకాకుండా.. ఆర్‌బీఐ ఇప్పటివరకూ అందించిన రెపో రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు ఇంకా పూర్తిగా తమ ఖాతాదారులకు బదలాయించాల్సి ఉందని కూడా ఆయన బ్యాంకర్లకు తేల్చిచెప్పారు.
 
 బ్యాంకుల వడ్డీరేట్ల మార్పులకు ప్రామాణికమైన రెపో రేటు 6.75 శాతంలో ఆర్‌బీఐ ఈసారి ఎలాంటీ మార్పూ చేయలేదు. దీంతో ముడిపడిన రివర్స్ రెపో రేటు ఇప్పుడ్నున్నట్లే 5.75 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతంగానే కొనసాగనుంది. ఈ ఏడాదిలో ఆర్‌బీఐ రెపో రేటును 1.25 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో జరిగిన సమీక్షలో అనూహ్యంగా అర శాతం రెపో కోతతో రాజన్ అందరినీ ఆశ్చర్యపరిచారు కూడా.

 ఇక ఫెడ్ పాలసీపైనే దృష్టి...
 ఆర్‌బీఐ తాజా సమీక్షలో తీసుకున్న నిర్ణయం సరైన దిశలోనే ఉందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే, ఈ నెల 16న అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం ఆధారంగానే వడ్డీరేట్లపై ఆర్‌బీఐ తదుపరి చర్యలు ఆధారపడిఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం, మెరుగైన ఉద్యోగ గణాంకాల నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్ల పెంపు మొదలవుతుందన్న వాదనలు బలంగా వినబడుతున్నాయి. దీంతో మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కివెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనలు నెలకొన్నాయి.
 
 మరోపక్క, అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టానికి(5 శాతం) ఎగబాకిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం గణాంకాలను కూడా ఇకపై ఆర్‌బీఐ నిశితంగా గమనిస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరలు పెరగడం ఆర్‌బీఐని ఆందోళనకు గురిచేస్తోందనేది వారి అభిప్రాయం.
 
 పాలసీలో ఇతర ముఖ్యాంశాలు...
 ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.4 శాతంగా ఉండొచ్చు.
 వ్యవసాయ రంగంలో మందగమన ధోరణి ఉంది. రుతుపవన వర్షపాతంలో కొరత కారణంగా ఖరీఫ్, రబీ దిగుబడి అంచనాలపై ప్రభావం ఉంటుంది.
 రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఏడాది జనవరినాటికి 6 శాతంగా, 2017 జనవరినాటికి 5 శాతంగా ఉండొచ్చు. గత రెండు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది(అక్టోబర్‌లో 5 శాతం).
 బ్యాంకుల మొండిబకాయిల సమస్య తగ్గుముఖం పడితే తాజా రుణాలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. చిన్న మొత్తాల పొదుపు రేట్లను మార్కెట్ వడ్డీరేట్ల     (డిపాజిట్ రేట్లు)తో అనుసంధానించడంపై సమాలోచనలు జరుగుతున్నాయి.
 తదుపరి పాలసీ సమీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న జరుగుతుంది. రుణ రేట్లు మరింత తగ్గాల్సిందే..

 బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ స్పష్టీకరణ
 ఈ ఏడాదిలో ఆర్‌బీఐ రెపో రేటును 1.25 శాతం తగ్గిస్తే.. బ్యాంకులు మాత్రం ఇందులో సగాన్ని(0.6 శాతం) మాత్రమే బదలాయించాయని ఆర్‌బీఐ గవర్నర్ మరోసారి బ్యాంకర్లకు హెచ్చరిక స్వరాన్ని వినిపించారు. బ్యాంకులు తమ రుణ రేట్లను మరింత తగ్గించేందుకు ఆస్కారం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో కొనసాగుతోందన్న స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయని కూడా రాజన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రికవరీ ఇంకా ప్రారంభస్థాయిలోనే ఉన్నందున..
 
 ఈ ఏడాది తమ జీడీపీ అంచనా(7.4 శాతం)లో మార్పులు చేయడం లేదని రాజన్ చెప్పారు. తొలి త్రైమాసికంలో వృద్ధి 7 శాతంగా ఉంది. బ్యాంకుల మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్యను తగ్గించేందుకు ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయని... 2017కల్లా బ్యాంకుల ఎన్‌పీఏలు దిగొచ్చేందుకు ఆస్కారం ఉందన్నారు.
 
 ఎన్‌పీఏల కట్టడికి బ్యాంకులకు మరిన్ని అధికారాలను ఇస్తున్న విషయాన్ని రాజన్ గుర్తు చేశారు. ఇక ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయడం ప్రభుత్వానికి కష్టతరమైన అంశమేనని, అయితే, అసాధ్యమేమీ కాదన్నారు. దీనివల్ల ద్రవ్యలోటు తగ్గింపు లక్ష్యానికి ఇబ్బందులేవీ ఉండబోవన్నారు. ఆదాయాలను పెంచుకోవడం లేదా, వ్యయాల కోత ద్వారా ఈ అదనపు వ్యయాన్ని ప్రభుత్వం సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని రాజన్ పేర్కొన్నారు.

బ్యాంకర్ల ‘తగ్గింపు’ స్వరం...
 బేస్ రేటు లెక్కింపునకు కొత్త విధానం తీసుకొస్తుండటం... రెపో కోత ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదలాయించాల్సిందేనంటూ రాజన్ హెచ్చరికల నేపథ్యంలో బ్యాంకర్లు స్వరం మార్చారు. ఈ దిశగా అడుగులు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. రానున్న రోజుల్లో రుణ రేట్ల కోత ఉంటుందన్న సంకేతాలిచ్చారు. ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం తమ అంచనాల మేరకే ఉందని పేర్కొన్నారు.
 
 తాజా పాలసీ నిర్ణయం, వ్యాఖ్యలు చూస్తుంటే ఆర్‌బీఐ సరళ పాలసీ విధానానికి అద్దంపడుతున్నాయి. అవసరమైన సమయంలో రేట్లు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామన్న గవర్నర్ రఘురామ్ రాజన్ సంకేతాలు ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశం. ఆర్‌బీఐ ప్రవేశపెట్టనున్న కొత్త బేస్ రేటు విధానాన్ని పూర్తిగా పరిశీలించి తగిన చర్యలు చేపడతాం’.
                                                                                              - అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చైర్‌పర్సన్
 
 మా అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం వెలువడింది. ఇప్పటివరకూ తీసుకున్న పాలసీపరమైన చర్యల ప్రభావం డిపాజిట్ రేట్ల(బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయం)లో ప్రతిబింబించింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లు మరింతగా తగ్గుతాయని భావిస్తున్నా.
                                                                                            - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్
 
 చిన్న మొత్తాల పొదుపు రేట్లు మార్కెట్ వడ్డీరేట్లతో సమాన స్థాయికి వస్తే... బ్యాంకుల డిపాజిట్ రేట్లను మరింతగా తగ్గించేందుకు దోహదం చేస్తుంది. దీనివల్ల నిధుల సమీకరణ వ్యయం తగ్గుతుంది. అంతిమంగా రుణాలపై వడ్డీరేట్లను కూడా ఇంకా తగ్గుముఖం పడతాయి.
                                                                                - చంద్రశేఖర్ ఘోష్, బంధన్ బ్యాంక్ సీఎండీ
 
 
 ఇర బ్యాంకులే తగ్గించాలి: కార్పొరేట్ ఇండియా

 ఆర్‌బీఐ రెపో కోత పూర్తి ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాల్సిందేనని... రుణాలపై వడ్డీరేట్లను మరింతగా తగ్గించాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. ‘ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేలా చేయాలంటే.. అటు ఇన్వెస్టర్లు, ఇటు వినియోగదార్లు అందరికీ రుణ రేట్లను మరింతగా తగ్గించాల్సి ఉందని  ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఎ.దీదార్ సింగ్ వ్యాఖ్యానించారు.
 
 రుతుపవన వర్షాలు తగినంతగా లేకపోవడంతో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బలహీనంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన చెప్పారు. ‘ఇప్పుడు ఆర్‌బీఐ పాలసీ రేట్ల కోతను రుణాలపై రేట్ల తగ్గింపునకు బదలాయించడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాల్సి ఉంది. పుంజుకుంటున్న రుణ వృద్ధికి అనుగుణంగా నిధులను అందించడానికి బ్యాంకులు సిద్ధంగా ఉండాలి.
 అధిక మొండిబకాయిల ప్రభావంతో రుణాలివ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేయకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకోవాలి’ అని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని అసోచామ్ ప్రెసిడెంట్ సునిల్ కనోరియా అభిప్రాయపడ్డారు.
 
 బేస్ రేటుకు కొత్త మార్గదర్శకాలు వస్తున్నాయ్...

 బ్యాంకుల కనీస రుణ రేటు(బేస్ రేటు) లెక్కింపు విధానానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈ వారంలోనే విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఇప్పుడున్న యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ స్థానంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారంగా బేస్ రేటును నిర్ణయించే విధంగా కొత్త విధానం ఉంటుందన్నారు. దీనివల్ల పాలసీ రేట్ల మార్పులకు అనుగుణంగా బ్యాంకులు తమ వడ్డీరేట్లలో వెంటనే దీన్ని అమలు చేయడానికి వీలవుతుందని చెప్పారు. ఇటీవలి కాలంలో రెపో రేటును భారీగానే తగ్గించినప్పటికీ.. ఈ ప్రయోజనంలో సగాన్ని మాత్రమే బ్యాంకులు కస్టమర్లకు బదలాయించిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ కొత్త విధానానికి తెరతీస్తోంది. అయితే, దేశీ మార్కెట్లో డిపాజిట్ల సమీకరణ వ్యయం ఇంకా అధికంగానే ఉన్న తరుణంలో ఇది తగిన విధానం కాదని బ్యాంకర్లు వాదిస్తున్నారు. మరోపక్క, 1-3 ఏళ్ల వ్యవధిగల డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీరేట్లను భారీగా తగ్గించాయని.. ఈ స్థాయిలో బేస్ రేటును మాత్రం తగ్గించలేదంటూ రాజన్ గుర్తుచేశారు. రుణ రేట్లను మరింత తగ్గించాల్సిందేనని తేల్చిచెప్పారు.http://img.sakshi.net/images/cms/2015-12/71449002179_Unknown.jpg

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement