ఇల్లు కొనే ముందు సవాలక్ష ఎంక్వైరీలు, చర్చలు, లాభనష్టాల బేరీజులు... ఇలా చాంతాడంత లిస్టే ఉంటుంది. కానీ, నేటి యువతరం గృహ కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత ఈజీగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్లిపోతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఇంటి కొనుగోలు నిర్ణయానికి 33 రోజుల సమయం పడితే.. ఈ ఆర్థిక సంవత్సరం అర్ధ వార్షికం(హెచ్1) నాటికి కేవలం 26 రోజుల్లోనే డెసిషన్ తీసుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరో
మనదేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ప్రాపర్టీ అన్వేషకులు కొనుగోలుదారులుగా మారేందుకు పట్టే సమయంపై ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2019, 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కొనుగోలు సమయం కేవలం 25 రోజులుగా ఉంది. 2021 కోవిడ్ మహమ్మారి సమయంలో గరిష్టంగా 33 రోజుల సమయం పట్టింది.
వేగానికి కారణమిదే...
ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. కొన్నేళ్లుగా మార్కెట్‌లో బ్రాండెడ్ డెవలపర్ల నుంచి గృహాల విక్రయాలు పెరిగాయి. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రూ.3 కోట్లయినా చిటికెలో నిర్ణయం..
సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. రూ.3 కోట్ల ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఎంపికకు అతి తక్కువగా, కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారు. రూ.1–3 కోట్ల ధర ఉన్న ఇళ్లకు 27 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల కొనుగోలుకు ఏకంగా 30 రోజులు సమయం తీసుకుంటున్నారు.
డిమాండ్‌తో వేగంగా నిర్ణయం
కోవిడ్ తర్వాతి నుంచి విశాలైన గృహాలు, హైఎండ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో ఇళ్లు వేగంగా అమ్ముడవుతున్న కారణంగా కస్టమర్లు కొనుగోలు నిర్ణయాన్ని వేగంగా తీసుకుంటున్నారు.
– ప్రశాంత్‌రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్
Comments
Please login to add a commentAdd a comment