సాక్షి, ముంబై : దేశీయ బ్యాంకింగ్ రంగంలోకార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రమోటర్లు గైడ్ లైన్స్, కార్పొరేట్ సిస్టమ్ సమీక్షకు 2020 జూన్ 12న ఆర్‌బీఐ నియమించిన అంతర్గత కమిటీ తాజాగా కీలక ప్రతిపాదను చేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్,నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ విభాగంలోని కఠిన ఆంక్షలు సవరణలు చేయాలంటూ సూచించింది. తద్వారా కార్పొరేట్లకు మార్గం సుగమం చేసింది. దీంతో కార్పొరేట్ కంపెనీలు, బడా పారిశ్రామిక సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు నిబంధనలు సడలించేలా ప్రభుత్వం కీలక సంస‍్కరణలకు శ్రీకారం చుట్టనుందని సమాచారం. ఫలితంగా టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ లాంటి పలు కార్పోరేట్ బిజినెస్ టైకూన్లు బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలనూ బ్యాంకింగ్ రంగంలో అనుమతించాలంటూ ఆర్‌బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యుజి) సిఫారసు చేసింది.
- పదిహేనేళ్లలో ప్రైవేట్ బ్యాంక్‌ల ప్రమోటర్ల వాటా పరిమితిని ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచాలి.
- ఆర్థికంగా మెరుగైన పనితీరును కనబరుస్తున్న పెద్దపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రైవేట్ బ్యాంక్‌లుగా మారేందుకు అవకాశం కల్పించాలి.
- కనీసం 10 ఏళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తూ, రూ.50,000 కోట్లు.. అంతకు మించి ఆస్తులున్న ఎన్‌బీఎఫ్‌సీలకు అర్హత ఉండేలా నిబంధనలు అమలు చేయాలి.
- కొత్తగా ప్రైవేట్ బ్యాంక్ లైసెన్సుల జారీకి కనీస మూలధన అర్హతను ప్రస్తుతమున్న రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచాలి.
- స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్సుల జారీకి కనీస మూలధన పరిమితిని రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచాలి.
- ప్రభుత్వ బ్యాంకుల పనితీరును మెరుగుపరచేందుకు అనేక చర్యలు, బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ సూచనలు
- ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతం కంటే తక్కువగా ఉండాలి
మరోవైపు ఐడబ్ల్యుజీ సిఫారసులపై ఆర్‌బీఐ మాజీ గవర్నరు రఘురామ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య విమర‍్శలు గుప్పించారు. పారిశ్రామిక వర్గాలను బ్యాంకింగ్‌లోకి అనుమతించకూడదని గట్టిగా వాదించారు. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు వారు తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు, ప్రశ్నలు లేకుండానే కార్పొరేట్ సులువుగా రుణాలు అందుబాటులోకి వచ్చేస్తాయి. కొన్ని వ్యాపార సంస్థలలో ఆర్థిక, రాజకీయ శక్తుల ప్రాబల్యం పెరిగిపోతుంది. అక్రమాలు అధికార దుర్వనియోగం పెరిగిపోతుందని అందోళన వ్యక్తం చేశారు. నిరర్ధక ఆస్తులుపెరగడానికి క్రోనీయిజం కారణమని గుర్తుచేశారు. లైసెన్సులు న్యాయంగా కేటాయించినప్పటికీ, అవినీతికి అవకాశం ఏర్పడుతుందనీ, ఇప్పటికే ప్రారంభ మూలధనం ఉన్న పెద్ద వ్యాపార సంస్థలకు అదనపు ప్రయోజనాలు చేకూరతాయని, రాజన్, ఆచార్య అభిప్రాయపడ్డారు.సోమవారం విడుదల చేసిన ఇండియన్ బ్యాంక్స్: ఎ టైమ్ టు రిఫార్మ్ అనే పరిశోధనా పత్రంలో బ్యాంకింగ్ రంగ ప్రస్తుత యథాతథ స్థితి ఆమోదయోగ్యం కాదు, బ్యాంకింగ్ పరిశ్రమను సంస్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్థిక సేవల విభాగాన్ని మూసివేయడం, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు తగదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment