
మరో 363 పాయింట్లు డౌన్
రిజర్వుబ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అనూహ్యంగా వడ్డీ రేట్లను పెంచుతూ శుక్రవారం ఇచ్చిన షాక్ ప్రభావం వరుసగా రెండోరోజు మార్కెట్లపై కనిపించింది. సోమవారం బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో 363 పాయింట్లు నష్టపోయి 19,900 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారంనాటి గరిష్టస్థాయి నుంచి సెన్సెక్స్ 800 పాయింట్లకుపైగా నష్టపోయింది. 122 పాయింట్లు తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5,890 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోగా మరో ఆరశాతం వడ్డీ రేట్లను ఆర్‌బీఐ పెంచవచ్చన్న అంచనాలను అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థలు వెల్లడించడంతో బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో అమ్మకాలు కొనసాగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మూడూ కలిపి సెన్సెక్స్‌లో 155 పాయింట్లు నష్టపర్చాయి.
ఈ మూడింటితో పాటు ఎస్‌బీఐ సైతం 5 శాతం మేర పడిపోయింది. రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ 10 శాతం క్షీణించగా, ఓఎన్‌జీసీ, మారుతి, ఎల్ అండ్ టీలు 3-4 శాతం తగ్గాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ షేర్లు 4-10 శాతం మధ్య క్షీణించాయి. మెటల్ షేర్లు సేసా గోవా, హిందాల్కోలు స్వల్పంగా పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ. 80 కోట్ల మేర నికర విక్రయాలు జరపగా, దేశీయ సంస్థలు రూ. 745 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. దీంతో ఆర్‌బీఐ పాలసీ ప్రకటన వెలువడినప్పటి నుంచి దేశీయ ఫండ్స్ రూ. 1,500 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్లయ్యింది.
బ్యాంకింగ్ కౌంటర్లలో షార్ట్ రోలోవర్స్...
సోమవారంనాటి మార్కెట్లో బాగా క్షీణించిన బ్యాంకింగ్ కౌంటర్లలో జోరుగా రోలోవర్ యాక్టివిటీ చోటుచేసుకుంది. మరో మూడు రోజుల్లో సెప్టెంబర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్ సిరీస్‌కు భారీగా షార్ట్ రోలోవర్స్ జరిగినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. రిజర్వుబ్యాంక్ నాటకీయంగా పాలసీ రేట్లను పెంచడం, కొన్ని బ్యాంకుల డెట్ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్ చేయడంతో ఇన్వెస్టర్లు వారి క్యాష్ పొజిషన్లను రక్షించుకునేందుకు బ్యాంకింగ్ కౌంటర్లలో షార్ట్‌చేసివుండొచ్చని, ఈ షేర్లు మరింత తగ్గొచ్చన్న అంచనాలతో ట్రేడర్లు ఈ నెల సిరీస్‌లో షార్ట్స్‌ను కవర్ చేసి, వచ్చే నెలకు రోలోవర్ చేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 4%పైగా క్షీణించిన బ్యాంక్ నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్లో 37 వేల షేర్లు కట్‌కాగా, అక్టోబర్ కాంట్రాక్టులో 1.89 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి.
బ్యాంక్ నిఫ్టీ తరహాలోనే పలు బ్యాంకింగ్ కౌంటర్లలో ఈ నెల కాంట్రాక్టుల నుంచి తగ్గిన షేర్లకంటే వచ్చే నెల కాంట్రాక్టుల్లో యాడ్ అయిన షేర్లు చాలా ఎక్కువ. ఇలా ఎక్కువ షేర్లు యాడ్‌కావడం, మరోవైపు షేర్లు భారీగా క్షీణించడం షార్ట్ పొజిషన్లు క్రియేషన్‌ను సూచిస్తున్నది. ఎస్‌బీఐ అక్టోబర్ కాంట్రాక్టులో 9.65 లక్షల షేర్లు యాడ్‌కాగా, ఈ నెల ఫ్యూచర్ నుంచి 35 వేలు మాత్రమే కట్ అయ్యాయి. మిడ్‌సైజ్ పీఎస్‌యూ కౌంటర్లలో షార్ట్ రోలోవర్స్ అధికంగా సాగాయి. వచ్చే నెల సిరీస్‌కు బ్యాంక్ ఆఫ్ బరోడా కౌంటర్లో 10.62 లక్షలు, పీఎన్‌బీ ఫ్యూచర్లో 11.84 లక్షలు, యూనియన్ బ్యాంక్ కాంట్రాక్టులో 19.25 లక్షలు, బీఓఐ కౌంటర్లో 9.54 లక్షల షేర్ల చొప్పున యాడ్ అయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ కౌంటర్లోనూ ఈ తరహా యాక్టివిటీ ఎక్కువగా జరిగింది. ఈ కాంట్రాక్టులో 14.50 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. షేరు తగ్గొచ్చన్న అంచనాలతో ఫ్యూచర్ కాంట్రాక్టును విక్రయించడాన్ని షార్ట్ సెల్లింగ్‌గా వ్యవహరిస్తారు. ఈ నెలలో ఇంతకుమునుపు విక్రయించిన కాంట్రాక్టును కొని(స్క్వేర్ ఆఫ్), వచ్చే నెలకు ఇదే షేరుకు సంబంధించిన కాంట్రాక్టును తిరిగి అమ్మడాన్ని షార్ట్ రోలోవర్‌గా పరిగణిస్తారు.