రాజన్ను తక్షణం తొలగించండి | Remove Raghuram Rajan As RBI Governor, Writes Subramanian Swamy To PM | Sakshi
Sakshi News home page

రాజన్ను తక్షణం తొలగించండి

Published Wed, May 18 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

రాజన్ను తక్షణం తొలగించండి

రాజన్ను తక్షణం తొలగించండి

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, పార్లమెంటు సభ్యుడు సుబ్రమణ్యస్వామి మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌పై ..

ప్రధానికి సుబ్రమణ్యస్వామి లేఖ
ఉద్దేశపూర్వకంగా ఆర్థిక వ్యవస్థను
ముందుకు వెళ్లనీయలేదని విమర్శ

 న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, పార్లమెంటు సభ్యుడు సుబ్రమణ్యస్వామి మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా గ్రీన్ కార్డ్ పొందిన రాజన్... మానసికంగా పూర్తి భారతీయుడు కాదని, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో మరింత ముందుకు దూసుకుపోకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. తక్షణం ఆయనను ఆర్‌బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక లేఖ రాశారు. రాజన్‌ను చికాగో తిరిగి పంపేయాలని స్వామి గతవారం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధానికి తాజాగా లేఖ రాశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం నియమించిన వ్యక్తిని ఇప్పుడూ కీలక బాధ్యతల్లో కొనసాగించడం సరికాదని అన్నారు. ఆర్‌బీఐ చీఫ్ బాధ్యతలు నిర్వహించడానికి దేశానికి చెందిన అనేకమంది నిపుణులు ఉన్నారని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల రీత్యా రాజన్‌ను తక్షణం తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. దేశాన్ని అధిక వడ్డీరేట్ల  వ్యవస్థలో దీర్ఘకాలం ఉంచడం వల్ల ఆర్థికాభివృద్ధి వేగం మందగించడం తన డిమాండ్‌కు ప్రధాన కారణమని వివరించారు. కేవలం రెండేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిలు రెట్టింపై రూ.3.5 లక్షల కోట్లకు చేరడం దారుణమని పేర్కొన్నారు.

 సెప్టెంబర్‌లో ముగియనున్న బాధ్యతలు...
రాజన్ మూడేళ్ల బాధ్యతలు సెప్టెంబర్ మొదటివారంలో ముగియనున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన రాజన్‌కు... అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై విశేష పట్టు ఉంది. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన ఘనత ఆయనకు సొంతం. ప్రతిష్టాత్మక చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఫైనాన్స్)లో ‘ఆన్‌లీవ్’ ఫ్రొఫెసర్‌గా ఉన్నారు. సెప్టెంబర్ 2013లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా  రుణ బెంచ్‌మార్క్ రేటు- రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు.

2014 మొత్తం భారత్ అధిక వడ్డీరేటు వ్యవస్థలో కొనసాగింది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని ఆయన కారణంగా చూపారు. అటు తర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50% తగ్గించారు. దీనితో ఈ రేటు 6.5%కి దిగివచ్చింది. చేయాల్సింది చాలా ఉందని ఇటీవలే పేర్కొన్న రాజన్.. రెండోసారి కొనసాగడానికి సిద్ధమని ఇటీవలే సంకేతాలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement